తెల్లరేషన్ కార్డులుగా ఆన్‌లైన్‌లో మార్పు
ఒక్కో కార్డుకు 10 నుంచి 15 కేజీలు చొప్పున బియ్యం కోత
జిల్లాలో 89 వేల కుటుంబాలకు మొండిచేయి
జిల్లాలోని అంత్యోదయ రేషన్ కార్డులకు ప్రభుత్వం మంగళం పాడనుంది. అత్యంత నిరుపేదలు, వికలాంగులు, ఎలాంటి ఆధారంలేని వృద్ధులు, వితంతువులకు ఆసరాగా అంత్యోదయ కార్డులను మంజూరు చేశారు. ఈ కార్డుంటే సభ్యుల సంఖ్యతో పనిలేకుండా ఒక్కో కుటుంబానికి 35 కేజీల చొప్పున బియ్యాన్ని అందజేసేవారు. అయితే ఈ విధానానికి మంగళం పాడుతూ అంత్యోదయ కార్డులన్నింటినీ అధికారులు తెల్లరేషన్ కార్డుల పరిధిలోని తీసుకొస్తున్నారు. లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.
చిత్తూరు (అగ్రికల్చర్): అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు, మహిళలను మోసగిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి కత్తెర వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈసారి ఏకంగా అత్యంత పేదలు లబ్ధిదారులుగా ఉండే అంత్యోదయ కార్డులను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 9.5 లక్షల కుటుంబాలకు తెలుపు, అంత్యోదయకార్డులు ఉన్నాయి. 89 వేల కుటుంబాలకు అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు 35 కేజీల బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల నిరుపేదలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు కొంతమేరకు ఆధారంగా ఉండేది. అయితే ప్రభుత్వం చౌకదుకాణాల్లో బియ్యాన్ని అందించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసింది. ఈ విధానం ద్వారా చౌకదుకాణాల నుంచి ప్రతి నెలా వినియోగదారులు బియ్యాన్ని తెచ్చుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బయోమెట్రిక్ విధానంలో వినియోగదారుల వేలిముద్రలు సరిపోనట్లు చూపెట్టడం, దీనికితోడు బయోమెట్రిక్ టిన్‌కు నెట్ సమస్యలు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా ప్రతినెలా ఇటు వినియోగదారులు, అటు చౌకదుకాణాల డీలర్లు అవస్థలు పడాల్సి వచ్చేది. దీంతో విసుగుచెందిన వినియోగదారులు, డీలర్లు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కార మార్గంగా అధికారులు చౌకదుకాణాల్లో అదనంగా ఐరిష్ మిషన్లకు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఐరీష్‌లు కూడా సక్రమంగా పనిచేయక నిరుపయోగంగా మారాయి.
తెలుపు కార్డులుగా మార్పు..
ప్రతినెలా చౌకదుకాణాల వద్ద పడిగాపులు కాస్తూ, అవస్థలు పడి బియ్యాన్ని తెచ్చుకునే అంత్యోదయ కార్డుదారులకు ఈనెల నుంచి మరో పిడుగు మీదపడింది. ప్రభుత్వం అంత్యోదయ కార్డులను తెలుపు కార్డులుగా మార్పుచేసి, ప్రతి కార్డుకు 10 నుంచి 15 కిలోల మేరకు బియ్యాన్ని తగ్గించి వేసే పనులు ముమ్మరం చేసింది. చడీచప్పుడు లేకుండా ఆన్‌లైన్‌లో అంత్యోదయ కార్డులన్నీ తెలుపు కార్డులుగా మార్చి వేయడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. జల్లావ్యాప్తంగా 89 వేల అంత్యోదయ కార్డులుండగా ఇప్పటికే దాదాపు 50 శాతం కార్డులను తెలుపు కార్డులుగా మార్చి వేసినట్లు తెలుస్తోంది. ఈ విధానంతో వచ్చే జనవరికి పూర్తిగా తెలుపు కార్డులుగా మార్పు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పలువురిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మార్పు జరిగింది వాస్తవమే
జిల్లాలోని పలుచోట్ల అంత్యోదయ కార్డులు ఆన్‌లైన్‌లో తెలుపు రేషన్ కార్డులుగా మార్పు అయివున్నది వాస్తవమే. అయితే వాటన్నింటిని తిరిగి అంత్యోదయ కార్డులుగా మార్పుచేస్తారు. ఈ నెలలో తగ్గిన బియ్యాన్ని తిరిగి ఇవ్వరు. అంత్యోదయ కార్డుగా మార్పు అయిన తరువాత ఆ నెలకు రావాల్సిన 35 కేజీల మేరకు మాత్రమే బియ్యాన్ని అందిస్తారు. - నాగేశ్వరరావు,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
‘అంత్యోదయ’కు మంగళం
Published Tue, Dec 15 2015 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM
Advertisement
Advertisement