ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే
మార్చి 1 నుంచి అన్ని
ఫైళ్లు ఆన్‌లైన్‌లోనే
31 తర్వాత కాగితాలు, బీరువాలు కనిపించరాదు
ఈ-ఆఫీసు నిర్వహణపై కలెక్టర్
సీహెచ్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): మార్చి 1 నుంచి అన్ని రకాల ఫైళ్లు ఆన్‌లైన్ ద్వారానే రావాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. ఇకపై మాన్యువల్ ఫైల్స్‌ను చూడబోనని స్పష్టం చేశారు. ఈ-ఆఫీసుల నిర్వహణలో తొలుత తన కార్యాలయమే అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాలని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లోని అన్ని సెక్షన్‌ల సూపరింటెండెంట్లు, సిబ్బందితో గురువారం ఈ-ఆఫీసుల అమలుపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ విధి విధానాలను వివరించారు. ‘ఈ రోజు నుంచి ఈ- ఆఫీసు అమలుపై పూర్తిగా దృష్టి పెట్టండి. మార్చి 1 నుండి పూర్తిస్థాయిలో అమలులోకి రావాలి. అర్జంట్ ఫైళ్లు కూడా ఆన్‌లైన్ ద్వారానే రావాలి, ఆలస్యమైతే సంబంధిత సెక్షన్ సూపరింటెండెంట్, సిబ్బందిదే బాధ్యత. జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ మొదలు డీఆర్‌ఓ వరకు ఆన్‌లైన్ ద్వారానే ఫైళ్లు నిర్వహించాలి. డిజిటల్ సిగ్నేచర్ కీ లను వినియోగించాలి. అన్ని ఫైళ్లు, రికార్డులను బైండింగ్ చేయించి డీఓఎం ప్రకారం రికార్డు గదికి పంపాలి. మార్చి 31 తర్వాత ఏసెక్షన్‌లోనూ సిస్టమ్స్ తప్ప కాగితాలు, బీరువాలు కనిపించరాదు. ఇందుకోసం అన్ని ఫైళ్లు, రికార్డులను స్కాన్ చేసి కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసుకోండి’ అని కలెక్టర్ ఆదేశించారు.
సమయానికి వచ్చి వెళ్లండి..
ప్రతి ఒక్కరు కచ్చితమైన సమయానికి విధులకు హాజరై అంతే కచ్చితమైన సమయానికి ఇంటికి కూడా వెళ్లవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం బయోమెట్రిక్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. అయితే ప్రతి ఒక్కరు ఇళ్లలో సిస్టమ్స్ పెట్టుకొని ఇంటర్నెట్ సౌకర్యం తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ఇంటి నుంచే పైళ్లు పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కంప్యూటర్ల కోసం లోన్‌లు కూడా ఇప్పిస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకట నారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్లు రామాంజనమ్మ, అన్వర్ ఉసేన్, ప్రియదర్శిని, భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.