సాక్షి, కర్నూలు : జిల్లాలో ఇంకా చలామణిలో ఉన్న బోగస్ తెల్ల రేషన్ కార్డులకు ఇకపై చెక్ పడనుందా? ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకురానున్న బయోమెట్రిక్ విధానంతో ఇది సాధ్యమేనంటున్నారు అధికారులు. జిల్లాలో బోగస్ తెల్ల రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ కొనసాగినా.. ఇంకా అక్కడక్కడ బోగస్ కార్డులు చలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పేదలకు అందాల్సిన నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయి.
దీనికి అడ్డుకట్ట వేయడానికి బయోమెట్రిక్(ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ - ఈ పాస్) విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకురానుంది. మార్చి ఒకటి నుంచి జిల్లాలోని 458 చౌకదుకాణాల్లో దీనిని మొదటిదశ కింద ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం నుంచి రేషన్‌షాపుల డీలర్లకు ఈ-పాస్ విధానంపై శిక్షణ ఇవ్వనున్నారు. 2013లో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వం అక్కడ మంచి ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిని వర్తింప చేస్తోంది. చౌక బియ్యంలో 30 శాతం పక్కదారి పడుతున్నట్లు గుర్తించిన ఈ విధానం అమలుతో సత్ఫలితాలను సాధించింది.
జిల్లా వ్యాప్తంగా 53 మండలాలు, ఒక నగరపాలక సంస్థతోపాటు ఆరు పురపాలక సంస్థలున్నాయి. ప్రతి నెలా 17 స్టాక్ పాయింట్ల ద్వారా దాదాపు 14 వేల మెట్రిక్ టన్నులకుపైగా బియ్యాన్ని నెల నెలా సరఫరా చేస్తున్నారు. తొలివిడతలో 458 చౌకదుకాణాల్లో ఈ విధానాన్ని మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతంలో చేపట్టిన ఆధార్ వివరాల నమోదులో భాగంగా అందరి చేతి వేలిముద్రలు తీసుకున్న విషయం తెలిసిందే. వాటిని ఇప్పుడు వినియోగించనున్నారు. బియ్యం కార్డు ఉన్న కుటుంబంలోని సభ్యులు మాత్రమే చౌక దుకాణానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది వరకు ఒకటి అంతకు మించి కార్డులు పట్టుకుని వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. ఇప్పుడు అది సాధ్యం కాదు. కొందరు డీలర్ల దగ్గరే అనేక బోగస్ రేషన్‌కార్డులున్నందున వాటిపై వారు సరుకులు తీసుకునే వీలు ఉండదు.
డీల్లకు శిక్షణ..
ఈ-పాస్ విధానంపై 6 పురపాలక సంఘాలు, కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 458 మంది చౌకదుకాణాల డీలర్లకు ఒకరోజుపాటు కలెక్టరేట్‌లోని సర్వశిక్షాఅభియాన్ హాల్‌లో గురువారం శిక్షణ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ యంత్రాల పనితీరు ఇలా..
ఈ-పాస్ యంత్రం ఏటీఎంను పోలి ఉంటుంది. ఇందులో డిస్‌ప్లే, స్కానర్, కీబోర్డు ఉంటాయి. ప్రతి కార్డుదారుడి నుంచి రెండు వేలి ముద్రలు తీస్తారు. ఆధార్‌కార్డులో భాగంగా తీసుకున్న వేలిముద్రలు దీనిలో నిక్షిప్తం చేసి ఉంటారు. కార్డుదారుడు వేలి ముద్ర వేయగానే ఎంత పరిమాణంలో బియ్యం, చక్కెర, గోధుమలు ఇవ్వాలో వివరాలతో ముద్రించిన కాగితం బయటకు వస్తుంది.
దాని ప్రకారం డీలర్లు సరుకులను ఇవ్వాలి. తూనికల యంత్రం కూడా ఈ-పాస్ యంత్రానికి అటాచ్‌చేసి ఉంటుంది. అందువల్ల తూకాలలో కూడా మోసం జరిగే ఆస్కారం ఉండదు. డీలరు ప్రతి రోజు చౌకదుకాణం తెరచి సరుకులను పంపిణీ చేయాలి. అన్ని ఆన్‌లై న్‌లో నమోదవుతాయి. కార్డుదారులు తీసుకున్న సరుకులు, డీలర్ల వద్ద నిల్వ ఉన్న సరుకు ఏ రోజుకారోజు నమోదవుతాయి. దీంతో అక్రమాలకు అవకాశం ఉండదు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ వివరాలను ఆన్‌లైన్‌లో అధికారులు పరిశీలిస్తారు.
మార్చి ఒకటి నుంచి బయోమెట్రిక్ ద్వారా పంపిణీ..
ఈ-పాస్ విధానానికి సంబంధించి 458 మంది డీలర్లకు శిక్షణ ఇవ్వబోతున్నాం. అది పూర్తయ్యాక ఆయా రేషన్‌డీలర్ల పరిధిలోని దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రాలను అమరుస్తాం. మార్చి ఒకటో తేదీ నుంచి చౌక దుకాణాల్లో తొలిదశలో భాగంగా ఈ విధానం ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నాం.
- ప్రభాకర్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి, కర్నూలు
బోగస్‌కు చెక్!
Published Thu, Feb 19 2015 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement
Advertisement