సాక్షి, కర్నూలు: నిరుపేదలకు కిలో రూపాయి బియ్యం, అమ్మహస్తం తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు గొప్పులు చెప్పుకుంటున్న ప్రభుత్వం అమలులో విఫలమవుతోంది. ప్రతినెలా బియ్యంతో పాటు కిరోసిన్, పామాయిల్, చక్కెర, గోధుమలు, గోధుమపిండి, ఉప్పు, కారంపొడి వంటి తొమ్మిది రకాల సరుకులను రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేయాలి. అయితే గత ఏడాది ఉగాది కానుకగా ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా ఏ నెలలోనూ సరుకులన్నింటినీ పేదలకు అందించలేకపోయింది.
తాజాగా రచ్చబండ-3లో మంజూరు చేసిన రేషన్ కూపన్లదీ ఇదే పరిస్థితి. రెండు నెలలుగా ఈ కూపన్ దారులకు కిరోసిన్ అందడం లేదు. నవంబర్ నెల రచ్చబండలో కార్డులు... కూపన్లు మంజూరు చేశారు. డిసెంబర్ నుంచి బియ్యం తదితర సరుకుల ఇస్తున్నా.. కిరోసిన్ మాత్రం మరిచారు. జనవరిలోనూ ఇదే పరిస్థితి. తాజాగా ఫిబ్రవరి నెల కోటా కూడా రాకపోవడంతో కూపన్ దారులకు కిరోసిన్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని డీలర్లు స్పష్టం చేస్తున్నారు.
బ్లాక్ మార్కెట్‌తో గుల్ల: చౌకధర దుకాణాల్లో లీటరు కిరోసిన్ ధర రూ.14. గ్యాస్ ఉన్న కార్డుదారులకు లీటరు, గ్యాస్ లేని వారికి 2 లీటర్లు అందిస్తారు. ఇటీవల గ్యాస్ సిలిండర్ ధర రూ.1327లకు చేరడంతో చాలా కుటుంబాలు కట్టెల పొయ్యిలను నమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కిరోసిన్ కోసం చౌకధరల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కిరోసిన్ కేటాయింపుల్లో ప్రతినెలా ఎదోఒక కొర్రీ పెట్టి కోటాను తగ్గిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు కిరోసిన్ కోటా తగ్గుతోంది. డీలర్లకు కేటాయించే కిరోసిన్ వాటా తగ్గడంతో కార్డుదారులందరికీ అందడం లేదు. మొదట వచ్చిన వారికే కిరోసిన్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. గ్యాస్ భారం తగ్గించుకోవాలని భావిస్తున్న పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో కిరోసిన్ కోసం బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. చౌకదుకాణాల్లో లీటరు రూ.14లకు లభించే కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌లో రూ. 40 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని 11 లక్షల కార్డుదారులకు నెలకు 2,200 కిలో లీటర్ల కిరోసిన్ కేటాయించారు. రచ్చబండ-3, మార్పులు చేర్పులు జరిగి కొత్తగా వినియోగంలో ఉన్న 86 వేల కార్డులకు ప్రస్తుతం కూపన్లు ఇచ్చినా.. డిసెంబర్, జనవరికి కిరోసిన్ కేటాయించకపోవడం గమనార్హం.
మూడో నెలా.. రిక్తహస్తమే
Published Mon, Jan 27 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement