సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో 6వేల రేషన్ దుకాణాల్లో ‘ఈ-పాస్’ పరికరాల ద్వారా ప్రయోగాత్మకంగా చేపట్టిన సరుకుల పంపిణీని మే ఒకటో తేదీ నుంచి కచ్చితంగా అమలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునిత తెలిపారు. ఈ-పాస్ పరికరాల పనితీరు, నిర్వహణపై శనివారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. జిల్లాలోని పది మండలాలకు చెందిన డీలర్లు ఈ సమావేశంలో పాల్గొని ‘ఈ-పాస్’ పరికరాల పనితీరు, సర్వర్, సిగ్నల్ సమస్యలు మంత్రికి తెలియజేశారు. కమిషన్ ప్రాతిపదికన రేషన్‌దుకాణాలను నిర్వహించడం సాధ్యం కావడం లేదని, కాబట్టి రూ. 15 వేలు వేతనంగా అందించే ఏర్పాటు చేయాలని విన్నవించారు. మండలస్థాయి నిల్వ కేంద్రాల(ఎంఎల్‌ఎస్ పాయింట్లు) నుంచి రేషన్ డీలర్లకు సరఫరా చేస్తున్న సరుకుల తూకాల్లో తేడాలు ఉంటున్నాయని, ఈ నేపథ్యంలో ఈ-పాస్ ద్వారా కచ్చితమైన తూకంలో సరుకులు పంపిణీ చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ సరుకుల పంపిణీని ఈ-పాస్ పద్ధతిలో చేపట్టిందని, అయితే పరికరాల్లో సమస్యలు తలెత్తాయని, అందువల్లే చాలా జిల్లాల్లో సరైన సమయంలో సరుకులు పంపిణీ చేయలేకపోయాని తెలిపారు. చాలా చోట్ల 10 శాతం మించి సరుకుల పంపిణీ జరగలేదన్నారు.
దీంతో సరుకులు అందక పేద ప్రజలు ఇబ్బదులకు గురవుతున్నారన్న విషయం తెలిసే.. ఈ-పాస్ యంత్రాలు పనిచేయని చోట లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుని సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు. ప్రస్తుతం ఈ-పాస్‌లో తలెత్తిన సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని, రేషన్ దుకాణాల్లో సిగ్నల్ వ్యవస్థ బలోపేతానికి విప్ యాంటీనా పెడతామన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌తోపాటు పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
మే ఒకటి నుంచి ఈ-పాస్
Published Sun, Apr 19 2015 3:23 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM
Advertisement
Advertisement