రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. వార్షిక పరీక్షలకు నిధులు విడుదల చేయలేని ప్రభుత్వం.. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకని పాఠశాలలు మూతపడే సమయంలో లక్షలాది రూపాయలు విడుదల చేయడం వెనుక మతలబు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమపై నమ్మకం లేకనే ప్రభుత్వం ఛాత్రోపాధ్యాయులతో సర్వే చేయిస్తోందని ఆగ్రహిస్తున్నారు.
కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 3, 5, 8 తరగతుల్లోని విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఈ నెల 22, 23వ తేదీల్లో బేస్‌లైన్ అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. విద్యార్థులకు మాతృభాషతో పాటు గణితం, ఇంగ్లిష్ విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 3, 5 తరగతుల్లో పై మూడు అంశాలు ఒకే పరీక్ష ద్వారా, 8వ తరగతిలో పార్ట్-ఎ, పార్ట్-బి పరీక్షలుగా విభజిస్తారు. పార్ట్-ఎ పూర్తిగా 8వ తరగతి సామర్థ్యాలపై, పార్ట్-బి 3, 5 తరగతుల సామర్థ్యాలపై ఉంటుంది. మాతృభాష, ఇంగ్లిష్‌లో మౌఖికం, రాతరూపంలో.. గణితంలో రాత పరీక్ష మాత్రమే జరుగుతుంది. విద్యార్థులకు అబ్జెక్టివ్ టైప్‌లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
80 శాతం రాతపరీక్ష ద్వారా.. 20 శాతం ఓరల్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షను ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులచే కాకుండా శిక్షణ పొందుతున్న ట్రైనీ బీఈడీ, డీఎడ్ విద్యార్థులచే నిర్వహించనుంది. వీరు ఆయా తరగతిలో విద్యార్థులు సాధించాల్సిన విద్యా ప్రమాణాలను, విషయ పరిజ్ఞానం కాకుండా సామర్థ్యాలను ఎంత వరకు సాధించారనే విషయమై మూల్యాంకనం చేస్తారు. ఈ మేరకు జిల్లాకు రూ.30లక్షల వరకు నిధులు విడుదల చేసింది. ఈ పరీక్షపై డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఎంఈవోలు, ట్రైనీ బీఈడీ, డీఎడ్ విద్యార్థులకు, వారికి బోధించే అధ్యాపకులకు పలుమార్లు శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సైతం ఎంఈవోలతో అవగాహన కల్పించారు.
ఎవరి సామర్థ్యానికీ పరీక్ష?
విద్యార్థుల్లో సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆలోచన మరోలా ఉందని ఉపాధ్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణ పరీక్షలు నిర్వహించేందుకే నిధులు ఇవ్వని ప్రభుత్వం యేడాది చివరలో ఎవరి సామర్థ్యాలను పరీక్షిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి సామర్థ్యాల పేరిట ఉపాధ్యాయుల పనితీరును పరీక్షించేందుకే ఈ పరీక్ష నిర్వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థుల్లో సామర్థ్యాలు సరిగ్గా లేవని, అందుకు ఉపాధ్యాయులే కారణమని, వారిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
చివరి పనిదినాల్లో విద్యార్థులు వస్తారా?
జిల్లాలో ఈ నెల 17వ తేదీ నాటికే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగిశాయి. సాధారణంగా వార్షిక పరీక్షలు ముగియగానే విద్యార్థులు సెలవుల మూడ్‌లో ఉంటారు. ఈ మేరకు పరీక్షలు ముగిశాక వారు పాఠశాలకు వచ్చేందుకు సైతం ఇష్టపడరు. ప్రాథమిక పాఠశాలలోని 3, 5వ తరగతి విద్యార్థులకు 22న బేస్‌లైన్ టెస్ట్ నిర్వహించాలని అధికారులు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే సెలవుల్లో వెళ్లిన విద్యార్థులను ఉపాధ్యాయులు ఎలా తీసుకొస్తారనేది ప్రశ్న. విద్యాసంవత్సరం చివరి రోజుల్లో ఇలాంటి పరీక్షలు నిర్వహించి ఎవరి సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
అసెస్‌మెంట్ టెస్ట్‌కు రూ.30లక్షలు
జిల్లాలో సమ్మెటివ్-2, 3 పరీక్షలకు ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలలకు రూ.500, హైస్కూళ్లకు రూ.1500 చొప్పున నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో ప్రశ్నపత్రాలు ముద్రించేందుకు డబ్బులు లేక చాలా పాఠశాలల్లో బోర్డుపై ప్రశ్నలు రాసి పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే పేరుతో జిల్లాకు రూ.30లక్షలు విడుదల చేసి భారీగా బేస్‌లైన్ అసెస్‌మెంట్ పరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్థం చేసింది. దీనికి తోడు ఇంకా శిక్షణ పూర్తి కాని బీఈడీ, డీఈడీ ఛాత్రోపాధ్యాయులతో పాఠశాల విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, వారితోనే మూల్యాంకనం చేయించి తమను అవమానిస్తున్నారని ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతోంది.
ఈ పరీక్షకు శాస్త్రీయత లేదు
యేడాది పాటు కష్టపడి చదివిన విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు నిధులు ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థి సత్తాను పరీక్షిస్తామంటూ భారీగా నిధులు ఖర్చు చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఉపాధ్యాయులపై నమ్మకం లేకనే ఇంకా శిక్షణ పూర్తి కాని బీఎడ్, డీఎడ్ విద్యార్థులతో పరీక్ష నిర్వహించి, వారితోనే మూల్యాంకనం చేయించడం ఉపాధ్యాయులను అవమానించడమే.
-ఇస్మాయిల్,
ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
విద్యార్థులకు.. ఉపాధ్యాయులకు.. పరీక్ష
Published Mon, Apr 20 2015 4:18 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement