సాక్షిప్రతినిధి, ఖమ్మం : వేతనాల పెంపు కోసం మున్సిపల్ కార్మికులు 28 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎంతకూ దిగిరాకపోవడంతో పుర వీధులు కంపుకొడుతున్నాయి. ఆదివారం నాటికి 28 రోజుల సమ్మెతో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పురపాలకాల్లో 10,900 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకపోవడం గమనార్హం. ఈ పరిస్థితులతో చినుకుపడితే పుర వీధుల్లో రోడ్లపై చెత్త కుళ్లి మురుగుగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. ముక్కుమూసుకోనిదే వీధుల వెంట నడవలేని పరిస్థితి ఉంది.
జిల్లా వ్యాప్తంగా జూలై 6 నుంచి ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీలు, మధిర నగర పంచాయతీ అవుట్ సోర్సింగ్ కార్మికులు వేతన పెంపుకోసం సమ్మెబాట పట్టారు. 900 మంది కార్మికులు సమ్మెలో ఉండడంతో స్వల్పంగా ఉన్న రెగ్యులర్ కార్మికులతో చెత్తను ఎత్తడం పురపాలకాల్లో సాధ్య పడడం లేదు. రెగ్యులర్ కార్మికులు విధులకు హాజరై చెత్తను తరలించేందుకు వెళ్తున్నా సమ్మెలో ఉన్న కార్మికులు బృందాలుగా ఏర్పడి వారిని అడ్డుకుంటున్నారు. కాలనీల్లో చెత్త వేసే కేంద్రాలు డంపింగ్‌యార్డులుగా మారాయి. పలు వీధుల్లోని రోడ్లపై గుట్టలుగుట్టలుగా చెత్తపేరుకుపోతోంది.
ఖమ్మం నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వైరారోడ్డు, మామిళ్లగూడెం, కమాన్‌బజార్, కస్పాబజార్, రైతుబజార్, చర్చికాంపౌండ్, నిజాంపేట, శుక్రవారిపేట, ముస్తఫానగర్, ఇందిరానగర్, రోటరీనగర్, కవిరాజ్‌నగర్‌లో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. చెత్తవేసే డంపర్ బిన్లు నిండడంతో రోడ్లపైనే ప్రజలు.. చెత్త వేస్తున్నారు. వాహదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త కుళ్లి దోమలు, ఈగలకు ఆవాసంగా మారింది. వీటి ప్రభావంతో విష జ్వరాలు విజృంభిస్తున్నారుు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక..
సమ్మెపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. అరుునా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల నాయకులతో అధికారులు చర్చలు కూడా జరపటం లేదు. కార్మికులు ఆందోళన చేస్తుంటే అధికారులు మాత్రం ప్రభుత్వం స్పందించంది తామేమి చేస్తామనే రీతిలో వ్యవహరిస్తున్నారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పక్షాలు, కుల సంఘాలు మద్దతు తెలిపి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటున్నాయి.
అయినా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం సమ్మెపై నిర్ణయం తీసుకోకపోవడంతో కార్మికులు మరింత ఉధృతంగా ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పోలీస్ పహారాలో అర్ధరాత్రి చెత్తను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రయత్నానినికి కూడా కార్మికులు అడ్డుతగులుతున్నారు. కార్మిక సంఘాల నేతలను చర్చలకు పిలిచి కార్మికులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటేనే సమ్మె వీడి పరిస్థితి కనిపిస్తోంది.
పెరుకుపోయిన చెత్తను ఎలా తరలిస్తారు..?
మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్తను కార్మికుల సమ్మె అనంతరం తరలించటం ఓ సవాల్‌గా మారనుంది. ఇంత చెత్తను 15 రోజుల్లో కూడా తరలించలేరు. ఇప్పుడు ఉన్న చెత్తకు తోడు రోజువారి చెత్తకూడా ఎక్కువగా ఉండడం, వర్షాలు పడుతుండడంతో అధికారులు చెత్తపై బెంబేలెత్తిపోతున్నారు. అన్ని పురపాలకాల్లో చెత్తను యుద్ధప్రాతిపదికన తరలించేందుకు వాహన కొరత తీవ్రంగా ఉంది. ఖమ్మం, కొత్తగూడెంలో పగలు, రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తేనే నెలరోజుల పాటు చెత్త తరలించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా అంతటా స్వచ్ఛ మున్సిపాలిటీ చేపట్టి ఇందులో కార్మికులతో పాటు స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యమయ్యేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తేనే చెత్త తరలింపు వేగిరం అవుతుంది.
చెత్తచెత్తగా..
Published Mon, Aug 3 2015 4:25 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement