కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సామాజిక భద్రత పింఛన్లలో భారీగా కోత విధించారు. రేషన్ కార్డు లేదనే సాకుతో పింఛన్లను తొలగిస్తుండటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గత రెండు నెలల్లో 8,372 పింఛన్లను తొలగించగా.. ప్రస్తుతం మరో 5,225 పింఛన్లు రద్దు చేశారు. ఫిబ్రవరి నెల పింఛన్లను మార్చి నెల మొదటి వారం నుంచి పంపిణీ చేస్తారు. గత నెలలో జిల్లాకు 3,37,242 పింఛన్లకు రూ.9,18,62,000 విడుదలైంది. ఈ నెల 3,32,017 లక్షల పింఛన్లకు రూ.9,03,01,900 విడుదల చేశారు. పింఛన్ల తొలగింపుతో జిల్లా నుంచి ఒక్క నెలలోనే ప్రభుత్వానికి రూ.15,60,100 మిగులు వచ్చినట్లయింది.
తొలగింపులో వృద్ధాప్య పింఛన్లు 2,954, వితంతు 1,754, చేనేత 33, వికలాంగులు 439, అభయహస్తం పింఛన్లు 45 ఉన్నాయి. రేషన్ కార్డు లేకపోవడం.. మరణించడం.. శాశ్వతంగా గ్రామాలు, పట్టణాలు వదిలి వెళ్లడం వల్ల వీటిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను ప్రమాణికంగా తీసుకుంటుండగా.. రేషన్ కార్డు లేదనే కారణంతో పింఛన్లను తొలగించడం ఎంతవరకు సమంజసమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది మూడు విడతల రచ్చబండ, ప్రజాదర్బార్ కార్యక్రమాల్లో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో కార్డులకు నోచుకోలేదు.
అయినప్పటికీ కార్డు లేదంటూ ఉన్న ఒక్కగానొక్క ఆసరాను దూరం చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా పింఛన్ల పంపిణీలో దాదాపు రూ.85 లక్షలు స్వాహా చేసిన సీఎస్పీలపై చర్యలు కరువయ్యాయి. 12 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ నెలన్నర క్రితం ఆదేశించినా అతీగతీ లేకపోయింది. నలుగురిపై కేసులు నమోదు చేసినా.. వివిధ కారణాలతో చర్యలకు వెనుకంజ వేస్తున్నారు.
పింఛన్లలో కోత
Published Sat, Mar 1 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement