పింఛన్ల రాజకీయం | Political pensions | Sakshi
Sakshi News home page

పింఛన్ల రాజకీయం

Published Thu, Oct 9 2014 4:10 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

పింఛన్ల రాజకీయం - Sakshi

పింఛన్ల రాజకీయం

  • లబ్ధిదారుల సర్వేలో రాజకీయ నేతల జోక్యం
  •  జిల్లా వ్యాప్తంగా 84,167 పింఛన్లు తొలగింపు
  •  ఆధార్, రేషన్‌కార్డుల్లో వయసు తేడా ఉన్నా  తీసివేతే..
  •  పొలం ఉన్నా అనర్హులే
  •  వితంతువులదీ అదే పరిస్థితి
  •  అధికారపార్టీకి జీ.. హుజూర్ అనని వారి పింఛన్ల కోత
  • సాక్షి, చిత్తూరు: నారాయణమ్మ...సాలమ్మలు ఇద్దరే కాదు.. జిల్లా వ్యాప్తంగా 84,167మంది పింఛన్లు తీసేశారు. తీసివేతకు కారణం అనర్హత అనుకుంటే పొరపాటే! ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో రాజకీయం జోక్యం పెరిగిపోయి అనర్హుల పొట్టకొట్టింది. రాజకీయ జోక్యానికి కళ్లెంవేసి అర్హులకు న్యాయం చేసేలా చూసి బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించింది. ఇంకేముంది.. అందరి చేతులమీదుగా జిల్లాలోని సామాజిక భద్రతా పింఛన్లు తీసుకునే అర్హులకు అన్యాయం జరిగింది.
     
    దీనికి సమాధానం ఏంటి?

     జిల్లాలో సెప్టెంబరు ఒకటో తేదీ వరకూ 3,96,644మంది పింఛన్లు తీసుకున్నారు. అక్టోబరుకు వచ్చేసరికి వారి సంఖ్య 3,12,477కు తగ్గింది. అంటే 84,167 మంది పింఛన్లు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా 54,254మంది వయస్సు తేడాతో వృద్ధాప్య పింఛను కోల్పోయారు. తర్వాత 22,108మంది వితంతు పింఛను కోల్పోయారు. వీరంద రూ గతంతో పింఛన్లకు అర్హులే అని అధికారులు గుర్తించారు. సదరన్ క్యాంపులు నిర్వహించి వికలాంగులను గుర్తించారు. చివరగా వీరంతా అర్హులని పింఛన్లు ఇచ్చారు. మరి అప్పుడు అధికారుల దృష్టిలో అర్హులైన వీరంతా ఇప్పుడు అనర్హులు ఎందుకయ్యారనేది జిల్లా అత్యున్నతాధికారులే సమాధానం చెప్పాలి.

    అధికారులు తప్పుచేసి అనర్హులను గుర్తించారా? లేదా ప్రస్తుతం అధికార పార్టీకి తలొగ్గి బలవంతంగా అనర్హులని ముద్ర వేశారా? అనేది తేలాల్సి ఉంది. 22,108 వితంతు పింఛన్లు తొలగించారు. వీరిలో అందరూ భర్త చనిపోయి వితంతు పింఛను తీసుకునేవారే! మరి వీరికి ఎందుకు తొలగించారో...అలాగే ఆధార్ కార్డుల్లో తప్పులు జరిగితే దానికి లబ్ధిదారులు బాధ్యత ఎలా వహించాలి. ఆధార్‌కు ప్రత్యామ్నాంగా మరో గుర్తింపుకార్డును పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు అన్యాయంగా పింఛన్లు తొలగించారు. ఏది ఏమైనా తనిఖీల పేరుతో పారదర్శంగా తనిఖీలు జరగలేదనే విషయంగా స్పష్టంగా తెలుస్తోంది.

    సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ నేతలు కమిటీల్లోకి చేరి కాని పేర్లను నిర్ధాక్షణ్యంగా తొలగించారని బాధితులు చెబుతున్నారు. ఇంకో విషయం ప్రస్తుతం 84,167 పింఛన్లను తొలగిస్తే... ఇంకా ఆ మొత్తంలో తొలగించేందుకు ప్రభుత్వం మళ్లీ కంకణం కట్టుకుంది. అందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించి మరోసారి తనిఖీలు నిర్వహించనుంది. కనీసం ఈ తనిఖీల్లోనైనా ఎంతమందిని తీసేయాలనే లక్ష్యంతో కాకుండా అర్హులైన వారందరికీ ఇద్దాం అనే దిశగా తనిఖీలు నిర్వహిస్తే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుంది.
     
    మలి విడత తనిఖీలకు కొత్త నిబంధనలు ఇవే..
     - మాగాణి రెండున్నర ఎకరాలు, మెట్ట 5 ఎకరాలు కలిగి ఉన్నవారు తెల్లకార్డు ఉన్నా అనర్హులు
     - మూడు గదులకు మించి శ్లాబ్ ఇల్లు ఉన్నా... లేదా కారు ఉన్నవారు  అనర్హులు
     - ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగంతో సహా ఎలాంటి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా అనర్హులే !
     - వృద్ధాప్య  పింఛను దారులకు కనీస వయస్సు 65 ఏళ్లు. వితంతువులకు కనీస వయస్సు 16 ఏళ్లు, వికలాంగులకు కనీస అంగవైకల్యం 40 శాతం.
     
     ‘‘ఈమె పేరు నారాయణమ్మ. పలమనేరులోని బోయవీధి వాసి. వయసు 65 ఏళ్లు. భర్త చనిపోయాడు. పిల్లలు లేరు. దుస్తులు ఇస్త్రీ చేసుకుంటూ జీవిస్తోంది. మొన్నటి దాకా వితంతు పింఛను రూ.200 ఇచ్చేవారు. ఇప్పుడు తనిఖీల కమిటీ ఈమెకు పింఛను తీసేసింది. కారణం అడిగితే... రేషన్‌కార్డు తీసేశారు కాబట్టి పింఛను రాదంటున్నారు. వీఆర్వోను అడిగితే... గతంలో తనిఖీల సమయంలో నువ్వు ఊళ్లో లేవు. కాబట్టి తీసేశాం అంటున్నారు... కారణమేదైనా నారాయణమ్మ అర్హత ఉండి పింఛనుకు దూరమైంది.’’
     
     ‘‘ఈమెపేరు సాలమ్మ. వయస్సు 62 ఏళ్లు. భర్త చనిపోయాడు. మొదట్లో వితంతు పింఛను ఇచ్చేవారు. ఆ తర్వాత వృద్ధాప్య పింఛనుకు మార్చుకోమన్నారు. సరే ఏదైనా ఒకటే డబ్బుకదా! అనుకుంటే, తనిఖీల్లో కమిటీ వాళ్లు ఈమె పేరు తీసేశారు. ఇదేమని అడిగితే  రేషన్ కార్డులో వయసు తక్కువగా ఉందన్నారు. వృద్ధాప్య పింఛను కూడా తీసేవారు. పోనీ వితంతు పింఛను ఇవ్వండి అంటే అదీ లేదు!’’
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement