ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నజరానా...!
► టీడీపీ బలోపేతమే లక్ష్యంగా బాబు అడ్డదారులు
► ఇద్దరు ఎమ్మెల్యేలకు ఫించన్లు బోనస్
► జమ్మలమడుగుకు 1500,
► బద్వేలుకు 1000 పింఛన్లు మంజూరు
► జన్మభూమి కమిటీలతో నిమిత్తం లేకుండా ప్రాధాన్యత
► మండిపడుతున్న స్థానిక టీడీపీ నేతలు
కడప: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పసువు కండువా కప్పుకుని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు పొందారు. వెరసి నజరానాగా 2500 పింఛన్లు మంజూరు చేయించుకున్నారు. జన్మభూమి కమిటీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యేలు సూచించిన వారికి మాత్రమే పింఛన్లు కేటాయించాలని జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు అందాయి.
జిల్లాలో టీడీపీని బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులను టార్గెట్ చేసుకొని టీడీపీ కండువా కప్పుతున్నారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు, బద్వేలు ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, జయరాములు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు 2500 పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జన్మభూమి కమిటీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సూచించిన 1500 మందికి, అలాగే బద్వేలు ఎమ్మెల్యే జయరాములు సూచించిన 1000 మందికి పింఛన్లు ఇవ్వాలని ఆదేశించారు. ప్రాధాన్యత పరంగా వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, చేనేతలకు కేటాయించాలని ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.
అర్హులకు మొండిచేయి..
ఎందరో వృద్ధులు, వికలాంగులు గత ఏడాది కాలంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వికలత్వ ధ్రువీకరణ, వయో పరిమితి ధ్రువీకరణ అర్హత కల్గిన పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 18వేల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ వృద్ధులు, వితంతువులు ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరే కాకుండా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ మృతి చెందుతున్నవారు సరాసరిన నెలకు 150 మంది ఉన్నారు. పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు మృతి చెందితే వెంటనే ఆ పింఛన్ వితంతువుగా మారిన పింఛన్‌దారుడి సతీమణికి ఇవ్వాలని ఉత్తర్వులు వివరిస్తున్నాయి. ఆ విధంగా దాదాపు 900 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతటి ఇబ్బందికర పరిస్థితులు జిల్లాలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం 2500 పింఛన్లు మంజూరు చేసింది. అది కూడా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సూచించిన వారికే ఇవ్వాలని ఆదేశించడం విశేషం.
మండిపడుతున్న టీడీపీ నేతలు..
‘ముందు వచ్చిన చెవుల కన్నా, వెనుక వచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్లుగా తెలుగుదేశం పార్టీనే సర్వస్వం అనుకుని అంటిపెట్టుకున్న తమను కాదని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకే పింఛన్లు కేటాయించడంపై టీడీపీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సూచనలతో నిమిత్తం లేకుండా, బద్వేలు టీడీపీ ఇన్‌చార్జి విజయజ్యోతి అభ్యర్థనకు ఆస్కారం లేకుండా పింఛన్లు మంజూరు చేయడంపై వారి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఆ మేరకు తమకు పింఛన్లు మంజూరు చేయాలని అభ్యర్థించేందుకు సంసిద్ధమైనట్లు తెలుస్తోంది. అలా మంజూరు చేయలేని పక్షంలో ఇప్పటికే ఎమ్మెల్యేల పేరిట మంజూరైన పింఛన్లలో సమాన వాటాలతో అర్హులను సిఫార్సు చేయాలని పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నేతల అభ్యర్థనకు ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.