గుంతకల్లు: సొంత పార్టీ లో ముసలం పుట్టి ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోవచ్చన్న భయంతోనే సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నాడని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆరోపించా రు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం మే డే ఘనంగా నిర్వహించారు.
బహిరంగసభకు పోలీసులు అనుమతివ్వకపోవడంపై ఆయన నిప్పులుచెరిగారు. ప్రజా, కార్మిక ఉద్యమాలను ప్రభుత్వం అణచివేయాలని యత్నిం చడం అప్రజాస్వామికమన్నారు. ప్రజావిశ్వాసాన్ని కోల్పోయామన్న భయంతోనే చంద్రబాబునాయుడు కోట్లాది రూపాయలను ఎరగా వేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు. కేవలం పచ్చనోట్ల కోసం వైఎస్సార్‌సీపీ కదిరి ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా పచ్చ కండువా కప్పుకున్నాడని ఆరోపించారు. బాబూ సర్కారు అభివృద్ధికి ముగ్ధుడనై టీడీపీలో చేరానని ఆయన చెప్పడం సిగ్గుచేటన్నారు.
అధికారపార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా ఆత్మహత్యలు చేసుకున్న చేనేతలు, రైతుల కుటుంబాలను ఆదుకోలేదన్నారు. అలాంటిది అత్తార్‌చాంద్ బాషా ఏమి ఉద్ధరిస్తాడని ఆయన ఎద్దేవా చేశారు. అమ్ముడుపోయిన వారందరికీ భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అంతకుముందు పట్టణంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి డి.శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి శీనా, పట్టణ కార్యదర్శి నర్సయ్య, సీపీఎం పట్టణ కార్యదర్శి భజంత్రీ శీనా, వివిధ అనుబంధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.