సాక్షి, విజయవాడ: నాలుగేళ్లు భారతీయ జనతా పార్టీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇపుడు నీతులు చెబుతున్నారని సీపీఎం జాతీయ నాయకులు బీవీ రాఘవులు విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగేళ్ల బురదను ఎవరు కడుగుతారని ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీజేపీ కాళ్లు పట్టుకుని, ఇపుడు కాళ్లు లాగుతానంటున్నారన్నారు. తనకు అధికారమిస్తే 15 ఏళ్లు రాష్ట్రానికి హోదా తెస్తానన్న బాబు ఇప్పుడేం మాట్లాడుతున్నారు?.. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్న వెంకయ్య నాయుడు ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఎన్నో హామిలిచ్చి.. చివరకు బెల్లం ముక్క కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు సీపీఎం వ్యతిరేకమని ఎప్పుడో ప్రకటించామన్నారు.
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తున్నారు.. మరీ ఈ నాలుగేళ్ళ నుంచి ఏం చేస్తున్నారన్నారు. ఇప్పుడు దీక్ష చేస్తే నాలుగేళ్ళగా చేసిన పాపం పోతుందా అని నిలదీశారు. రమేష్ చేసే దీక్షలో చిత్తశుద్ది లేదన్నారు. ఏ సమస్యపైనైనా దీక్షలు, నిరసనలు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం తమని అరెస్టు చేస్తుందని, కానీ చంద్రబాబు దీక్ష చేస్తే ఆయన్ను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్ష చేస్తే ప్రజాస్వామ్యం, తాము చేస్తే అరాచకమా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి ఇష్టమొచ్చినట్లు తినేశారని, ఇప్పుడు అమరావతిని తింటున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదని, గిట్టుబాటు ధర కోసం పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ వ్యవస్థను అమెరికా చేతిలో పెడుతోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment