అన్నీ కొత్తవే..
15లోపు రేషన్ కార్డులకు దరఖాస్తులు
ఆదాయ, కుల సర్టిఫికెట్లూ పొందాలి
‘స్థానికత’ ధ్రువపత్రాలు కూడా..
ప్రక్రియ పూర్తికి పక్షం రోజులే సమయం
కలెక్టర్, జేసీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ పథకాలను వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు.. కొత్త కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ పకడ్బందీ అమలుకు రేషన్‌కార్డుల స్థానంలోనే ఆహారభద్రత కార్డులను ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకు సర్వే, ఏరివేతలతో బిజీగా గడిపిన జిల్లా యంత్రాంగం.. ఇకపై నూతన పథకాల అమలుపై తలమునకలు కానుంది. మంగళవారం జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్లతో జరిపిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
విద్యార్థులకు, కుల, ఆదాయ, స్థానికత పత్రాల జారీకిగానూ ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులు స్వీకరించాలని, వీటిని ఈ నెలాఖరులోపు జారీ చేయాలని నిర్దేశించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది విద్యార్థులకు స్థానికత ధ్రువపత్రాలు ఇవ్వడం రెవెన్యూ యంత్రాంగానికి కత్తిమీద సాములా మారే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్తులో తెలంగాణేతరులు దొడ్డిదారిన ఉద్యోగాలు సంపాదించకుండా ‘స్థానికత’ నియంత్రిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు.. స్థానికత ధ్రువపత్రాల జారీలో కచ్చితత్వం పాటించాలని కలెక్టర్లకు నిర్దేశించింది. ఇది తహసీల్దార్లకు ఆందోళన కలిగించే పరిణామం.
ఇబ్బడిముబ్బడిగా విద్యాసంస్థలు ఉండడం... ఫాస్ట్ పథకానికి ప్రధాన అర్హతగా స్థానికతను పరిగణించనుండడంతో స్థానికత జారీ అంశం వీరికి తలనొప్పిగా మారింది. పక్షం రోజులను గడువుగా నిర్ధారించడం, ఇందులో దీపావళి సహా నాలుగు రోజులు ప్రభుత్వ సెలువు దినాలుగా ఉండడంతో ఈ సర్టిఫికెట్ల జారీని నిర్ణీత వ్యవధిలోగా జారీ చేయడం ఒకింత కష్టమేనన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. దీనికితోడు ‘మీ-సేవ’ ద్వారా కుల, ఆదాయ, స్థానిక సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది కూడా ఆయా ధ్రువపత్రాల జారీలో విద్యార్థులకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టే అవకాశంలేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్తగా రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ధ్రువీకరణ పత్రాలు జారీ నిర్ణయం తీసుకోవడం సహజమైనప్పటికీ.. విద్యాసంవత్సరం సగం ముగిసిన తర్వాత ఆలస్యంగా సర్టిఫికెట్ల జారీ అంశాన్ని ప్రకటించడంతో విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఇక అన్ని రకాల పింఛన్లు, ఆహార భద్రత కార్డులకు ఈ నెల 15వ తేదీలోపు స్థానిక వీఆర్‌ఓ, గ్రామ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర సర్వేలో పొందుపరిచిన వివరాలను క్రోడీకరించిన అనంతరం.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకే కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. ఇప్పటివరకు ఇతర ప్రభుత్వ పథకాలకు దీన్ని అనుసంధానం చేస్తారని భావించినా, ప్రభుత్వం మాత్రం దీన్ని కేవలం నిత్యావసర సరుకుల పంపిణీకే పరిమితం చేసింది.
కుటుంబాన్ని యూనిట్‌గా చేసుకొని ఈ కార్డులను జారీ చేస్తారు. గ్రామ స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ నేతృత్వంలోని బృందాలను తనిఖీ చేసి.. అర్హులను ప్రకటిస్తారని జాయింట్ కలెక్టర్-2 ఎంవీ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. దళితుల భూ పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వాలని, సమృద్ధిగా నిధులు కేటాయించినందున.. భూ కొనుగోలు ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఆయన చెప్పారు. అలాగే ఇప్పటికే భూములు పొందిన లబ్ధిదారులు.. పొలాలను సాగుకు అనువుగా మలుచుకునేందుకు సహకారం అందించాలని సూచించారని, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కూడా కల్పించాలని ఆదేశించినట్లు ఎంవీ రెడ్డి వివరించారు.