ధర్మవరం మార్కెట్ యార్డ్‌లో నిల్వ వుంచిన ఇసుక
ధర్మవరం రూరల్: సామాన్యులకు ఇసుక అందుబాటులోకి వచ్చింది. ధర్మవరం నియోజకవర్గంలోని పీసీ రేవు వద్ద ఇసుక రీచ్ నుంచి ధర్మవరం మార్కెట్‌యార్డ్‌కు ఇసుకను తోలి నిల్వ ఉంచుతున్నారు. కావాల్సిన వారు మీ సేవలో అనుమతులు తీసుకొని మార్కెట్ యార్డ్‌లో లభించే ఇసుకను తీసుకెళ్లవచ్చని అధికారులు చెబుతున్నారు.
టన్ను ఇసుక రూ.625
తాడిమర్రి మండలం పీసీ రేవు వద్ద ప్రభుత్వం ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేసింది. అయితే దూరాన ఉన్న ఇసుక రీచ్‌కు వెళ్లి ఇసుకను తీసుకురావాలంటే సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధిక బాడుగలతో పాటు వ్యయప్రయాసాలకు గురికావాల్సి వస్తుంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా పీసీ రేవు వద్ద వున్న రీచ్ నుంచి ఇసుకను తీసుకొచ్చి మార్కెట్‌యార్డ్‌లో నిల్వ చేసేలా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చొరవ చూపారు. ఈ స్టాక్ పాయింట్ నుంచి పట్టణం, రూరల్ ప్రాంతాలకు తక్కువ ధరకే ఇసుక తీసుకెళ్లవచ్చు. ధర్మవరం మార్కెట్ యార్డ్ నుంచి ఇప్పటి వరకు 1600 టన్నుల ఇసుకను ప్రజలు తీసుకెళ్లినట్లు అధికారులు చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుకను తీసుకెళ్లవచ్చు. మీ సేవలో ప్రతి రోజూ ఇసుక కోసం ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుకింగ్ చేసుకోవచ్చునని అధికారులు అంటున్నారు. డంప్ నుంచి తీసుకెళ్లిన ఇసుకను వారి వారి ప్రాంతాలకు 4 గంటలలోపు తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఆ లోపు ఇసుకను తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇసుక డంప్ వద్ద నిరంతరం సీసీ కెమరాలతో పర్యవేక్షిస్తుంటామన్నారు.
ఇసుకాసురుల ఆగడాలకు అడ్డుకట్ట
గత టీడీపీ పాలనలో అప్పటి ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఇసుకను బెంగళూరుకు అక్రమంగా తరలించి రూ.కోట్లు ఆర్జించారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నాయకులు అంతా తామై ఇసుకను సామాన్యులకు దొరకకుండా కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు తక్కువ ధరకే ఇసుకను ప్రజలకు అందించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గతంలో ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్న ఇసుకాసురులకు అడ్డుకట్ట పడినట్లయ్యింది.
తక్కువ ధరకే ఇసుక
కంబదూరు: మండలంలోని చెన్నంపల్లిలో ప్రభుత్వం గుర్తించిన రీచ్ ద్వారా ఇసుక విక్రయాలు సాగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఇసుక రీచ్ ప్రారంభం కావడంతో ప్రజలకు ఇసుక అందుబాటులోకి వచ్చింది. అవసరమైన వారు టన్నుకు రూ.375 ప్రకారం మీ సేవ కేంద్రంలో చెల్లించి పర్మిట్లు పొంది ఇసుకను తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ విధానం అమలులోకి తీసుకురావడంతో ఇసుకాసురుల దోపిడీకి చెక్ పడుతోంది. సామన్య ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment