ఏటీపీ సెంటర్‌లో కొత్త సర్వీస్‌చార్జీల పట్టిక , సర్వీస్‌చార్జీ వసూలు చేసిన బిల్లు
చంద్రబాబునాయుడి ప్రభుత్వం ప్రతీది ప్రైవేట్‌పరం చేసి సర్వీస్ చార్జీల పేరుతో వినియోగదారులను దోచుకునేందుకు ఎప్పుడూ ముందుంటుంది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెబుతూనే పలురకాల చార్జీలు వేస్తోంది. తాజాగా ప్రభుత్వ కన్ను ఏటీపీ కేంద్రాలపై పడింది.
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు వీలుగా పలు సబ్‌స్టేషన్లలో వసూలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. అలాగే మీ–సేవ కేంద్రాల్లో కూడా బిల్లులు చెల్లించే అవకాశాన్ని కల్పించి ప్రతి బిల్లుపై అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారు. వినియోగదారులకు 24 గంటలు అందుబాటులో ఉండేందుకు ‘విద్యుత్ బిల్లుల నిరంతర చెల్లింపు కేంద్రం’ (ఏటీపీ)ను ఆ శాఖ నెల్లూరు నగరంలోని మినీబైపాస్‌రోడ్టులోని మిలీనియం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద, ఏకేనగర్‌లోని విద్యుత్‌భవన్ వద్ద, చిన్నబజారులోని చేపల మార్కెట్ వద్ద ఏర్పాటుచేశారు. దీంతో వేలాది మంది వినియోగదారులు ఏ సమయంలోనైనా బిల్లులు చెల్లిస్తూ కేంద్రాలకు అలవాటుపడ్డారు.
మరో రెండు
ఈ క్రమంలో గూడూరులో ఒకటి. నెల్లూరులో ఒకటి కేంద్రాలు మంజూరయ్యాయి. నగరంలో ఉన్న మూడు కేంద్రాల ద్వారానే నెలకు 30 వేలమంది వినియోగదారులు రూ.2 కోట్లు బిల్లులు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు వీటిలో బిల్లులు చెల్లించినందుకు ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు.
వారికి ఇచ్చేశారు
ఈ ఏటీపీ కేంద్రాలను ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ నిర్వహిస్తుండేది. ఈనెల నుంచి కేంద్రాలను ప్రైవేట్‌పరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ సంస్థకు అప్పగించి సర్వీస్ చార్జీ పేరుతో వినియోగదారుల నుంచి నగదు వసూలు చేయనున్నారు. సదరు సంస్థ కేంద్రం పనివేళలు మార్చివేసింది. అవి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకే పనిచేయనున్నాయి. విద్యుత్ బిల్లు రూ.1–200 వరకు సర్వీస్ చార్జీ రూ.2, రూ.201–1,000 వరకు రూ.5, రూ.1,001–2,500 వరకు రూ.10, రూ.2,500పైగా బిల్లుకు రూ.25 చెల్లించాలి.
మరొకటి
విద్యుత్ వినియోగదారుడికి వచ్చే బిల్లులోనే సర్‌చార్జి పేరుతో విద్యుత్ సంస్థ రూ.30–50 వరకు వసూలు చేస్తుంటుంది. గత నెల రూ.2,500పైగా బిల్లును ఏటీపీ ద్వారా చెల్లించిన వినియోగదారులు 6,870 మంది ఉన్నారు. అంతే మంది ఈనెల కూడా చెల్లిస్తే వారిపై రూ.25 సర్వీస్ చార్జీ పడనుంది. మొత్తంగా రూ.1,71,750 అదనంగా కడతారు. నెలకు రూ.1,000 వరకు బిల్లు చెల్లించే వారు 30,000 మంది ఉన్నారు. వీరి ద్వారా ప్రైవేట్ సంస్థకు రూ.1,50,000 వస్తుంది. మొత్తంగా కేంద్రాల ద్వారా సంస్థకు సర్వీస్ చార్జీ రూపంలో రూ.7.50 లక్షలు వినియోగదారులు అదనంగా చెల్లిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment