పునర్విభజన విభాగం ఉండాలి: మహంతి
బాధ్యతలు సంతృప్తినిచ్చాయన్న సీఎస్
పొడిగింపు కోరబోనని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఒకట్రెండు కమిటీలు పని చేయడం కంటే పునర్విభజనకు ప్రత్యేకంగా ఒక విభాగముంటే మేలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి అభిప్రాయపడ్డారు. ‘‘ఎందుకంటే విభజనలో విస్తృతమైన, చాలా రోజులపాటు పని అవసరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మూడు నెలలు పడితే మరికొన్నింటికి ఏడాది దాకా పడుతుంది. అందుకే ప్రత్యేక విభాగంతో పనులు కొంత సులువవుతాయి’’ అని చెప్పారు.విభజనల పనుల నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో సమీక్షకు హాజరైన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. తన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహించిన కాలం నాకు సంతృప్తినిచ్చింది. విభజన నేపథ్యంలో పలు రకాల ఒత్తిడి వాతావరణంలోనూ మచ్చ లేకుండా పనిచేశాను. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్‌గా చేసిన కాలంలోనే గాక పరిపాలనాపరంగా ప్రభుత్వ లబ్ధి ప్రజలకు సులువైన పద్ధతుల్లో చేరేందుకు చర్యలు తీసుకున్నాం. మీసేవలో సర్వీసులను 300కు పెంచాం. నేను సీఎస్‌గా ఉండగా నాలుగు తుపాన్లు ఎదుర్కొన్నాం. ఉత్తరాఖండ్ బీభత్సంలో మనవాళ్లు చిక్కుకున్నారు. రాష్ట్రంలో అనేక కష్టాలు. ఉద్యమాలతో ఉద్యోగులు విధులకు రాని, ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి. వీటన్నింటినీ అధిగమించగలిగాం. సహచర ఐఏఎస్ అధికారుల సహకారం మరువలేనిది. నిజాయితీగా ఉంటే ఏ రంగంలోనైనా జాతికి సేవలందించవచ్చు. రిటైరయ్యాక పారితోషికం ఆశించకుండా ఏవైనా గౌరవ బాధ్యతలు స్వీకరిస్తా. పాలన నిర్వహణపై పాఠాలు బోధించాలని ఉంది’’ అని చెప్పారు.
మహంతి పదవీకాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. ఆయన 1979 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. స్వరాష్ట్రం ఒడిశా. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి అర్థశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. తొలుత రాష్ట్రంలో పనిచేసి 1993లో కేంద్ర సర్వీసుకు వెళ్లారు. 1999 జనవరిలో మళ్లీ రాష్ట్ర సర్వీసులో చేరారు. 2006లో మళ్లీ కేంద్ర సర్వీసుకు వెళ్లి 2013 జనవరి 31న రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వచ్చారు. సాధారణ, భూ పరిపాలన శాఖల్లో పని చేసి 2013 ఏప్రిల్ 30న సీఎస్ అయ్యారు. మహంతి కూతురు శ్వేత 2009లో సివిల్స్‌లో రెండో ర్యాంకు సాధించారు.