సమీర్‌శర్మ, ప్రదీప్ చంద్రల్లో ఒకరిని నియమించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జీవోఎం)కి నోడల్ అధికారిగా రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిని నియమించాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పి.కె.మహంతి భావిస్తున్నారు. భాస్కర్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్‌గా వెళ్లిపోయినప్పటి నుంచి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. ఈ పదవిలో కేంద్ర సర్వీసులో ఉన్న రాజీవ్‌శర్మను నియమించాలని రాష్ట్రప్రభుత్వం భావించింది. రాజీవ్‌శర్మ గతంలో శ్రీ కృష్ణ కమిటీకి నోడల్ అధికారిగా పనిచేయడం తెలిసిందే. అయితే రాష్ట్ర సర్వీసుకు రావడానికి ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్ సమీర్‌శర్మ లేదా పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్రలలో ఒకరిని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎవరు నియమితులైతే వారు.. జీవోఎంకి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇదిలాఉండగా తెలంగాణ ఏర్పాటు విషయంలో జీవోఎం విధివిధానాలకు సంబంధించిన అంశాలపై సమాచారాన్ని అందజేసేందుకు ప్రధాన శాఖల ముఖ్యకార్యదర్శులను ఢిల్లీకి పంపించనున్నారు. ఇందుకుగాను రెవెన్యూ, ఆర్థిక, విద్యుత్, సాగునీటి, ప్రణాళిక, హోం, న్యాయ, విద్య, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్యకార్యదర్శులను ఢిల్లీకి పంపాలని సీఎస్ భావిస్తున్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం లభించగానే ఢిల్లీకి పంపే ముఖ్యకార్యదర్శులకు సంబంధించిన ఉత్తర్వులను సీఎస్ జారీ చేయనున్నారు.