సాక్షి, హైదరాబాద్: సామాన్య ప్రజలకు అన్ని రకాల సేవలూ ఒకే చోట అందుబాటులోకి తేచ్చే ఉద్దేశంతో మీ-సేవ కేంద్రాలను ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వాటి నుంచి ఆదాయం పిండుకోవాలని నిర్ణయించింది. ఒక్కో లావాదేవీపై ఇప్పటివరకూ ప్రభుత్వానికి రెండు రూపాయలు మాత్రమే వస్తుంటే.. ఆ ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలుగా దానిని ఏకంగా ఏడు రూపాయలకు పెంచేసింది. ఈ భారం మీ-సేవ కేంద్రాలు నిర్వహించే వారిపైన వేయకుండా.. నేరుగా ప్రజల నుంచి వసూలు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. మీ-సేవ కేంద్రాల్లోని కియోస్క్ కేంద్రాల్లో ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు ఇవ్వకుండా.. కేవలం వారి వద్దనున్న సమాచారం ఆధారంగా జారీ చేసే సర్టిఫికేట్లకు ప్రస్తుతం ఒక్కో లావాదేవీకి రూ. 20 వసూలు చేస్తున్నారు.
దీనిని ఇప్పుడు రూ. 25కు పెంచేశారు. అలాగే కేటగిరి ‘బి’ కింద నోటీసులు, విచారణ, క్షేత్ర పరిశీలన చేయడం తదితర అంశాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ప్రస్తుతం రూ. 30 వసూలు చేస్తుంటే.. ఆ ఛార్జీలను కూడా రూ. 35కు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రస్తుతం 294 సేవలను మీ-సేవ కేంద్రాల్లో అందిస్తున్నారని, 2014 మార్చి నుంచి మరో 150 సేవలు అదనంగా వీటి పరిధిలోకి వస్తాయని సీఎస్ వివరించారు. రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాల్లో లావాదేవీల సంఖ్య మూడు కోట్లకు చేరుకుందని, మిగిలిన సేవలు కూడా కలపడం వల్ల లావాదేవీలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఒక్కో లావాదేవీపై రూ. ఐదు పెంచడం వల్ల ప్రభుత్వానికి నేరుగా ఏటా రూ. 15 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.
మీ-‘సేవ’పైనా బాదుడు
Published Thu, Jan 2 2014 3:25 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement