వెలవెలబోతున్న రిజిస్ట్రార్ కార్యాలయం
చేవెళ్ల : చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి రెండు నెలల విద్యుత్ బకాయిలు కట్టలేదని అధికారులు మంగళవారం కనెక్షన్ తొలగించారు. రెండు నెలలకు సంబంధించి రూ. 14వేల విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉంది. దీంతో మంగళవారం రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే... చేవెళ్ల మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. దీనికి సంబంధించిన విద్యుత్ బిల్లును కార్యాలయమే చెల్లించాల్సి ఉంది. ప్రతినెలా విద్యుత్‌బిల్లుకు సంబంధించి బిల్లు చేసి ఎస్‌టీఓకు పంపిస్తారు. అక్కడ బిల్లుకు సంబంధించిన నిధులు విడుదలైతే డీడీని విద్యుత్ అధికారులకు ఇస్తారు.
అయితే రెండు నెలలుగా ఎస్‌టీఓ నుంచి డీడీ రాకపోవటంతో వేచి చూసిన విద్యుత్ అధికారులు మంగళవారం కనెక్షన్ తొలగించారు. దీంతో కార్యాలయంలో జరగాల్సిన రోజువారీ రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. అసలే వరుసగా మూడు రోజులు (శని, ఆది, సోమ) సెలవులు రావటంతో రిజిస్ట్రేషన్‌లు జరగలేదు. మంగళవారమైనా చేయించుకుందామని వచ్చిన వారికి నిరాశే మిగిలింది. కొంతమంది పనులు మానుకొని వచ్చామని సబ్‌రిజిస్ట్రార్‌తో వాగ్వివాదం పెట్టుకున్నారు. ఆన్‌లైన్ లేకపోతే మాన్యూవల్‌గానైనా చేయాలని కోరారు. అయితే తనకు అలాంటి అధికారం లేదని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉంటేనే చేస్తానని సబ్ రిజిస్ట్రార్ వారితో చెప్పారు.
రెండు రోజులు గడువిచ్చాం: విద్యుత్ ఏఈ మురళీధీర్
విద్యుత్ ఏఈ మురళీధీర్‌ను ఈ విషయంపై ప్రశ్నించగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం భవనం ప్రైవేటుదని తప్పనిసరిగా ప్రతినెలా బిల్లు చెల్లించాల్సిందేనని అన్నారు. ఇప్పటికే రెండు నెలలు వేచి చూశామని రూ. 14వేల బిల్లు పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఇప్పటికీ బిల్లు రాకపోవటంతోనే తొలగించినట్లు చెప్పారు. అయితే సబ్‌రిజిస్ట్రార్ రెండురోజుల కోసం అనుమతి కోరటంతో సాయంత్రం విద్యుత్ కనెక్షన్‌ను ఇచ్చినట్లు చెప్పారు. రెండు రోజులు చూసి బిల్లు రాకపోతే మళ్లీ తొలగిస్తామని తెలిపారు. సాయంత్రం కనెక్షన్ ఇచ్చినా అప్పటికే సమయం అయిపోవటంతో అందరూ వెళ్లిపోయారు.
బిల్లు చేసి పంపించాం..
బకాయిలకు సంబంధించి బిల్లు చేసి మా కార్యాలయం నుంచి ఎస్‌టీఓకు పంపించాం. అక్కడి నుంచి నేరుగా విద్యుత్ అధికారులకు డీడీ రూపంలో బిల్లు వెళ్లాలి. కానీ ఎస్‌టీఓ నుంచి డీడీ వెళ్లలేదన్నారు. పైనుంచి నిధులు రాలేదని అందుకు డీడీ పంపలేదని చెప్పారు. విద్యుత్ అధికారులు అడిగితే రెండురోజుల్లో వస్తుందని నాలుగైదు రోజులుగా చెబుతున్నారు.
– రాజేంద్రకుమార్, సబ్‌రిజిస్ట్రార్, చేవెళ్ల
Comments
Please login to add a commentAdd a comment