వినీలాకాశంలో బ్రహ్మాస్త్రం | ISRO successfully launches PSLV C-45 Mission from Sriharikota | Sakshi
Sakshi News home page

వినీలాకాశంలో బ్రహ్మాస్త్రం

Published Tue, Apr 2 2019 3:37 AM | Last Updated on Tue, Apr 2 2019 9:58 AM

ISRO successfully launches PSLV C-45 Mission from Sriharikota - Sakshi

నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ–45 రాకెట్‌

శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు మరోమారు విజయగర్వంతో రెపరెపలాడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ–సీ45 ఉపగ్రహ వాహక నౌక స్వదేశీ ఎమిశాట్‌ (ఈఎంఐశాట్‌) ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతోపాటు 28 విదేశీ ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి మోసుకెళ్లింది. షార్‌ కేంద్రం నుంచి 71వ ప్రయోగాన్ని, పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) సిరీస్‌లో 47వ ప్రయోగాన్ని, పీఎస్‌ఎల్‌వీ–క్యూఎల్‌ సిరీస్‌లో తొలి ప్రయోగాన్ని నిర్వహించి ఇస్రో శాస్త్రవేత్తలు తమ విజయవిహారాన్ని కొనసాగించారు. మొత్తంగా ఈ ఏడాది ఇస్రో చేపట్టిన రెండో ప్రయోగం ఇది కావడం విశేషం.

ప్రయోగం తీరిలా..
ఆదివారం ఉదయం 6.27 గంటలకు ప్రారంభమైన పీఎస్‌ఎల్‌వీ సీ–45 ప్రయోగ కౌంట్‌డౌన్‌ 27 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్తగా రూపొందించిన మొట్టమొదటి పీఎస్‌ఎల్‌వీ సీ45 (పీఎస్‌ఎల్‌వీ–క్యూఎల్‌) సోమవారం ఉదయం 9.27 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ నాలుగో దశ (పీఎస్‌04 మోటార్‌)ను రెండుసార్లు రీస్టార్ట్‌ చేసి రెండు సార్లు ఆఫ్‌ (నిలుపుదల) చేసేలా రూపొందించారు. పీఎస్‌4 దశలో అమర్చిన 436 కిలోల బరువు కలిగిన ఎమిశాట్‌ ఉపగ్రహాన్ని భూమికి 748 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన «ధృవ కక్ష్యలోకి 17.18 నిమిషాలకు ప్రవేశపెట్టారు.

ఆ తరువాత పీఎస్‌4 దశను 3,611 సెకన్లకు మొదటిగా రీస్టార్ట్‌ చేసి 3,621 సెకన్లకు కటాఫ్‌ చేశారు. మళ్లీ 6,530 సెకన్లకు మళ్లీ రెండోసారి రీస్టార్ట్‌ చేసి 6,541 సెకన్లకు కటాఫ్‌ చేశారు. ఆ తర్వాత 6,626 సెకన్లకు (1.50 గంటలకు) 504 కిలోమీటర్ల ఎత్తులో 14 ఉపగ్రహాలను, 6,901 (1.55 గంటలకు) 508 కిలోమీటర్ల ఎత్తులో మరో 14 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. ఆ తరువాత కూడా పీఎస్‌4 దశను రెండుసార్లు ఆర్బిట్‌ చేంజ్‌ అనే పేరుతో మరో సరికొత్త ప్రయోగం చేశారు. ఉపగ్రహాలను వదిలిపెట్టిన తరువాత మరో గంటపాటు దీన్ని ఎక్స్‌పర్‌మెంటల్‌గా చేయడంతో ప్రయోగం పూర్తయ్యేసరికి సుమారు 3 గంటల సమయం తీసుకుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగం విజయవంతంకావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు.

వీక్షణకు గ్యాలరీ
ప్రయోగాలను వీక్షించేందుకు షార్‌ కేంద్రంలో ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగాన్ని మూడు వేలమంది వచ్చి తిలకించేలా ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ప్రయోగానికి ఐదు వేలు, తర్వాత పదివేల మంది చూసే అవకాశం కల్పించనున్నారు.

శత్రు రాడార్ల పనిపట్టే ఎమిశాట్‌
ప్రయోగంలో ప్రధాన ఉపగ్రహమైన ఎమిశాట్‌ బరువు 436 కిలోలు. దీన్ని 748 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. శత్రు దేశాల రాడార్లు, సెన్సర్లను గుర్తించే సామర్థ్యం ఎమిశాట్‌ సొంతం. దీని సాయంతో శత్రు దేశాల రాడార్లను పసిగట్టడంతోపాటు దానికి తగ్గట్టుగా దేశ భద్రతా చర్యలు చేపట్టొచ్చు. ఈ తరహా ఉపగ్రహాన్ని భారత్‌ చేయడం ఇదే ప్రథమం. మిగతా 28 ఉపగ్రహాల్లో 24 అమెరికావి. ఈ 24 ఉపగ్రహాలు నౌకల కదలికను గుర్తించడంలో ఆ దేశానికి సాయం అందించనున్నాయి. మిగిలిన 4 ఉపగ్రహాలు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్‌కి చెందినవి.

నింగిలోకి 29 ఉపగ్రహాలు
ఈ ఉపగ్రహ వాహక నౌక 436 కిలోలు బరువు కలిగిన ఎమిశాట్‌ (ఈఎంఐశాట్‌) అనే మిలటరీ ఉపగ్రహంతోపాటు 220 కిలోలు బరువు గల అమెరికాకు చెందిన ఫ్లోక్‌–4ఏ పేరుతో 20 చిన్న ఉపగ్రహాలు, లీమూర్‌ పేరుతో మరో 4 చిన్న ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన ఎం–6పీ, బ్లూవాకర్‌–1 అనే రెండు చిన్న తరహా ఉపగ్రహాలు, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకార్ట్‌–1 ఉపగ్రహం, స్పెయిన్‌కు చెందిన ఎయిస్‌ టెక్‌శాట్‌ అనే చిన్న తరహా 28 ఉపగ్రహాలను అలవోకగా రోదసీలోకి మోసుకెళ్లింది. అనంతరం వాటిని భూమికి 748, 504 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలోని 3 రకాల కక్ష్యల్లో విజయవంతంగా ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ మరోమారు గ’ఘన’ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇస్రో చరిత్రలో సువర్ణ అధ్యాయం: శివన్‌
ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం ఒక సువర్ణ అధ్యాయమని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కే శివన్‌ అన్నారు. ఈ రాకెట్‌లో నాలుగోదశ(పీఎస్‌–4)తో కొత్త ప్రయోగం చేశామని, అది సక్సెస్‌ కావడంతో భారతీయ విద్యార్థులు సొంతంగా శాటిలైట్‌ తయారుచేసి తెస్తే ఎలాంటి ఖర్చు లేకుండా ప్రయోగిస్తామన్నారు. ఒకే ప్రయోగం ద్వారా సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోనే 3 రకాల కక్ష్యల్లోకి 29 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సువర్ణ అధ్యాయమన్నారు. 4స్ట్రాపాన్‌ బూస్టర్లతో చేసిన ఈ ప్రయోగానికి పీఎస్‌ఎల్‌వీ క్యూఎల్‌ అని పేరుపెట్టారు. విద్యార్థులకు ప్రయోగాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రానికి 9 మంది హైస్కూల్‌ విద్యార్థులను సెలెక్ట్‌ చేసి వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తామని అన్నారు. భవిష్యత్తులో హ్యూమన్‌ మిషన్‌ ప్రోగ్రాం గురించి కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇందులో బాగా ప్రతిభ కనపరిచిన వారికి స్పేస్‌ ట్రెక్నాలజీలో సీటు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలిపారు. మే రెండో వారంలో పీఎస్‌ఎల్‌వీ సీ46 ద్వారా రీశాట్‌–2బీ, పీఎస్‌ఎల్‌వీ సీ47 ద్వారా కార్టోశాట్, ఆ తరువాత చంద్రయాన్‌–2 ప్రయోగాలుంటాయని తెలిపారు.


శ్రీహరికోటలో గ్యాలరీలో కూర్చుని ప్రయోగాన్నిచూస్తున్న వీక్షకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement