సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం ప్రయోగానికి సర్వం సిద్ధమయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య–ఎల్1ను మోసుకెళ్లనుంది. శుక్రవారం ఉదయం 12.10 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 23.40 గంటలు కొనసాగిన అనంతరం శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ57 ప్రయోగాన్ని చేపడతారు.
శుక్రవారం ఉదయం షార్‌కు విచ్చేసిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ముందుగా శ్రీ చెంగాళమ్మ ఆలయం పూజలు చేసుకున్నారు. కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా ముందుగా రాకెట్‌కు నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శుక్రవారం ఆర్థరాత్రి దాటాక రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో సూర్యుడిపై పరిశోధనలకు 1,480.7 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్నారు. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 59వది.
పీఎస్–4 దశతో మరో సరికొత్త పరిశోధన: పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో మరో సరికొత్త పరిశోధనకు ఇస్రో శ్రీకారం చుట్టింది. నాలుగో దశతో వివిధ రకాల విన్యాసాలు చేసి 01.03.31 గంటలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని వదిలిపెడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఉపగ్రహాన్ని వదిలిపెట్టేందుకు ఇంత సమయం తీసుకున్న పరిస్థితి లేదు. ముందుగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే కక్ష్య దూరం కూడా ఈసారి కొత్తగానే వుంది.
అపోజి అంటే భూమికి దూరంగా 36,500 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అలాంటిది కేవలం 19,500 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు. ఉపగ్రహాన్ని వదిలిపెట్టిన తరువాత రెండు రకాల విన్యాసాలను చేసి కక్ష్య దూరాలను పరిశోధించే పనిని చేపడుతున్నారు. ఎంఓఎన్ పాసివేషన్ పేరుతో 4042.52 సెకన్లకు ఒకసారి, ఎంఎంహెచ్ పాసివేషన్ పేరుతో 4382.52 సెకన్లకు ఒకసారి రీస్టార్ట్ చేసి సరికొత్త పరిశోధనలు చేస్తున్నారు.
రోజుకు 1,440 చిత్రాలు
ఆదిత్య–ఎల్1 నిర్దేశిత కక్ష్యలోకి చేరిన వెంటనే అందులో అమర్చిన విజిబుల్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్‌సీ) పేలోడ్ నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు సుమారు 1,440 చిత్రాలను తీసి విశ్లేషణ కోసం గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతుందని ప్రాజెక్టు సైంటిస్ట్ అండ్ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి మొదటి చిత్రం అందుతుందని భావిస్తున్నామన్నారు.
రాకెట్ వివరాలు
► పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు.
► రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుంటుంది. నింగికి పయనమైన 01–03–31 (3799.52) నిమిషాల్లో ప్రయోగం పూర్తవుతుంది.
► మొదటి దశలో 139 టన్నుల ఘన ఇంధనం కోర్ అలోన్ దశ, ఈ ప్రయోగానికి రాకెట్ చుట్టూరా ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. ఒక్కో బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం నింపుతారు.
► 212.02 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశ 109.40 సెకన్లలో పూర్తవుతుంది.
► 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించి 262.38 సెకన్లకు రెండోదశ పూర్తవుతుంది.
► 7.65 టన్నుల ఘన ఇంధనం సాయంతో 581.42 సెకన్లకు మూడో దశను పూర్తిచేస్తారు.
► మళ్లీ నాలుగోదశ (పీఎస్–4) 3127.52 సెకన్లకు స్టార్ట్ చేసి 3599.52 సెకన్లకు కటాఫ్ చేస్తారు.
► శిఖరభాగాన అమర్చిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని 3799.52 సెకన్లకు (01.03.31 గంటల వ్యవధి)లో భూమికి దగ్గరగా (పెరిజి) 235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్ల ఎత్తులోని ఎసింట్రక్ ఎర్త్ బౌండ్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. 175 రోజుల తరువాత సూర్యుడి సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు–1 వద్ద ప్రవేశపెట్టి సూర్యుడిపై అధ్యయనం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment