satellite lauch
-
శాటిలైట్లను పేల్చేసే ఉపగ్రహం ప్రయోగించిన రష్యా
వాషింగ్టన్: శత్రుదేశాలైన అమెరికా, రష్యా అంతరిక్ష యుద్ధానికి తెరతీస్తున్నాయా? ఇప్పటి పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. రష్యా అంతరిక్ష సంస్థ ఈ నెల 16న భూదిగువ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించిందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ మంగళవారం చెప్పారు. ఇది అంతరిక్షంలోని ఉపగ్రహాలను పేల్చేసే సామర్థ్యం కలదని వెల్లడించారు. ఇప్పటికే అదే కక్ష్యలో ఉన్న తమ ప్రభుత్వ ఉపగ్రహం ’యూఎస్ఏ 314’ను దెబ్బతీయడానికే రష్యా ఈ చర్యకు పూనుకుందని ఆరోపించారు. దీనిపై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా స్పందించారు. ఈ నెల 17న సోయుజ్–2.1బీ వాహక నౌక ద్వారా ‘కాస్మోస్ 2576’ ప్రయోగించిన మాట నిజమేనని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయోగం తమ రక్షణ శాఖ ప్రయోజనాలకే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అమెరికా ఉపగ్రహం, రష్యా తాజాగా ప్రయోగించిన ఉపగ్రహం ఒకే కక్ష్యలో ఉన్నాయని అంతరిక్ష నిపుణులు చెప్పారు. ఉక్రెయిన్ సైన్యానికి సహకరించే అమెరికా శాటిలైట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని రష్యా ఇటీవలే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. -
ISRO: జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఎస్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించారు. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్శాట్–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీవో)లో శాటిలైట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం దశలవారీగా రెండు రోజులపాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి మారుస్తారు. -
ISRO: నేడే జీఎస్ఎల్వీ సీ14 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్–3డీఎస్‌ను మోసుకెళ్లే జీఎస్ఎల్వీ ఎఫ్14 ఉపగ్రహ వాహక నౌకను నేడు ఇస్రో ప్రయోగించనుంది. ఇందుకోసం శుక్రవారం మధ్యాహ్నమే కౌంట్‌డౌన్ మొదలైందని తెలిసిందే. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగిస్తారు. గతంలో ప్రయోగించిన ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్శాట్–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీవో)లో శాటిలైట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం దశలవారీగా రెండు రోజులపాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి మారుస్తారు. -
ISRO's Aditya-L1 Solar Mission: నేడే పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం ప్రయోగానికి సర్వం సిద్ధమయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య–ఎల్1ను మోసుకెళ్లనుంది. శుక్రవారం ఉదయం 12.10 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 23.40 గంటలు కొనసాగిన అనంతరం శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగాన్ని చేపడతారు. శుక్రవారం ఉదయం షార్కు విచ్చేసిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ముందుగా శ్రీ చెంగాళమ్మ ఆలయం పూజలు చేసుకున్నారు. కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా ముందుగా రాకెట్‌కు నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శుక్రవారం ఆర్థరాత్రి దాటాక రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో సూర్యుడిపై పరిశోధనలకు 1,480.7 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్నారు. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 59వది. పీఎస్–4 దశతో మరో సరికొత్త పరిశోధన: పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో మరో సరికొత్త పరిశోధనకు ఇస్రో శ్రీకారం చుట్టింది. నాలుగో దశతో వివిధ రకాల విన్యాసాలు చేసి 01.03.31 గంటలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని వదిలిపెడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఉపగ్రహాన్ని వదిలిపెట్టేందుకు ఇంత సమయం తీసుకున్న పరిస్థితి లేదు. ముందుగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే కక్ష్య దూరం కూడా ఈసారి కొత్తగానే వుంది. అపోజి అంటే భూమికి దూరంగా 36,500 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అలాంటిది కేవలం 19,500 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు. ఉపగ్రహాన్ని వదిలిపెట్టిన తరువాత రెండు రకాల విన్యాసాలను చేసి కక్ష్య దూరాలను పరిశోధించే పనిని చేపడుతున్నారు. ఎంఓఎన్ పాసివేషన్ పేరుతో 4042.52 సెకన్లకు ఒకసారి, ఎంఎంహెచ్ పాసివేషన్ పేరుతో 4382.52 సెకన్లకు ఒకసారి రీస్టార్ట్ చేసి సరికొత్త పరిశోధనలు చేస్తున్నారు. రోజుకు 1,440 చిత్రాలు ఆదిత్య–ఎల్1 నిర్దేశిత కక్ష్యలోకి చేరిన వెంటనే అందులో అమర్చిన విజిబుల్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్ నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు సుమారు 1,440 చిత్రాలను తీసి విశ్లేషణ కోసం గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతుందని ప్రాజెక్టు సైంటిస్ట్ అండ్ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి మొదటి చిత్రం అందుతుందని భావిస్తున్నామన్నారు. రాకెట్ వివరాలు ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు. ► రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుంటుంది. నింగికి పయనమైన 01–03–31 (3799.52) నిమిషాల్లో ప్రయోగం పూర్తవుతుంది. ► మొదటి దశలో 139 టన్నుల ఘన ఇంధనం కోర్ అలోన్ దశ, ఈ ప్రయోగానికి రాకెట్ చుట్టూరా ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. ఒక్కో బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం నింపుతారు. ► 212.02 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశ 109.40 సెకన్లలో పూర్తవుతుంది. ► 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించి 262.38 సెకన్లకు రెండోదశ పూర్తవుతుంది. ► 7.65 టన్నుల ఘన ఇంధనం సాయంతో 581.42 సెకన్లకు మూడో దశను పూర్తిచేస్తారు. ► మళ్లీ నాలుగోదశ (పీఎస్–4) 3127.52 సెకన్లకు స్టార్ట్ చేసి 3599.52 సెకన్లకు కటాఫ్ చేస్తారు. ► శిఖరభాగాన అమర్చిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని 3799.52 సెకన్లకు (01.03.31 గంటల వ్యవధి)లో భూమికి దగ్గరగా (పెరిజి) 235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్ల ఎత్తులోని ఎసింట్రక్ ఎర్త్ బౌండ్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. 175 రోజుల తరువాత సూర్యుడి సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు–1 వద్ద ప్రవేశపెట్టి సూర్యుడిపై అధ్యయనం చేస్తారు. -
ఇక వాణిజ్యప్రయోగాలే
సూళ్లూరుపేట: ఎల్వీఎం3–ఎం2 ప్రయోగం విజయంతో ఇస్రోకు ఒక రోజు ముందుగానే దీపావళి పండగ వచ్చిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగానంతరం ఆదివారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడారు. న్యూ స్పేస్ ఇండియా, వన్‌వెబ్ సహకారంతో ఆదివారం ఎల్వీఎం3–ఎం2 ద్వారా ప్రయోగించిన 36 యూకేకి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామని తెలిపారు. క్రయోజనిక్ దశలో 36 ఉపగ్రహాలను ఒకేసారి కాకుండా నాలుగు దిశల్లో నాలుగేసి ఉపగ్రహాలు చొప్పున కక్ష్యలోకి విడిపోయేలా ఈ ప్రయోగంలో కొన్ని కీలకమైన సైంటిఫిక్ పరికరాలతో రూపొందించామని చెప్పారు. ఈ ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరడం కీలకం కావడంతో 36 ఉపగ్రహాలు విడిపోవడానికి 1.30 గంటల సమయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. వన్‌వెబ్ కంపెనీతో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒప్పందం మేరకు మరో 36 ఉపగ్రహాలను, మళ్లీ ఇంకో 36 ఉపగ్రహాలను ఇదే తరహాలోనే ప్రయోగిస్తామని తెలిపారు. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్య ప్రయోగాలే లక్ష్యం ఇకపై వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడమే లక్ష్యమని న్యూ స్పేస్ ఇండియా సీఎండీ రాధాకృష్ణన్ అన్నారు. దీన్ని చరిత్రాత్మక ప్రయోగంగా వన్‌వెబ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభివర్ణించారు. ఇప్పటికే 648 ఉపగ్రహాలను వివి«ధ దేశాల నుంచి ప్రయోగించామని గుర్తు చేశారు. ఇది కొత్త అధ్యాయానికి శ్రీకారమని పవన్ గోయెంకా (వన్‌వెబ్ కంపెనీ) చెప్పారు. ‘‘36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపడం కూడా అద్భుతం. వాణిజ్యపరంగా ఇస్రో మరో అడుగు ముందుకేయడం శుభ పరిణామం’’ అని ఆయన చెప్పారు. -
SSLV-D1: ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం విఫలం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ1) ప్రయోగం విఫలమయ్యింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్‌ను ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. మైక్రోశాట్–2ఏ (ఈఓఎస్శాట్)తోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు రూపొందించిన ఆజాదీశాట్‌ను నిర్దేశిత సమయంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ ప్రయోగం సఫలం కాలేదు. మొదటి మూడు దశలు ముందస్తు ప్రణాళిక ప్రకారం సక్రమంగానే పూర్తయ్యాయి. నాలుగో దశ నుంచి మిషన్ కంట్రోల్ సెంటర్‌కు ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. రెండు ఉపగ్రహాల నుంచి కూడా గ్రౌండ్స్టేషన్కు సంకేతాలు అందకపోవడం ఉత్కంఠకు గురిచేసింది. తొలి మూడు దశలు విజయవంతం ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగానికి ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఏడు గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగింది. సరిగ్గా ఉదయం 9.18 గంటలకు ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్ ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ నింగివైపు ప్రయాణం కొనసాగించింది. అప్పుడే కురుస్తున్న వర్షపు జల్లులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలను చీల్చుకుంటూ తొలి మూడు దశల్లో విజయవంతంగా ప్రయాణం సాగించింది. నాలుగో దశలో రాకెట్ రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి వదిలిపెట్టిన వెంటనే మిషన్ కంట్రోల్ సెంటర్లో సూది పడినా వినిపించేంత నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. శాస్త్రవేత్తలంతా కంప్యూటర్ల వైపు ఉత్కంఠగా చూడడం ప్రారంభించారు. ఇంతలోనే ఏదో అపశుతి చోటు చేసుకున్నట్లు గుర్తించారు. పనిచేయని సెన్సర్లు.. అందని సిగ్నల్స్ రాకెట్లో నాలుగు దశలూ అద్భుతంగా పనిచేశాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన మాట్లాడారు. మైక్రోశాట్–2ఏ, ఆజాదీశాట్లను 13.2 నిమిషాల్లో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టామని, ఉపగ్రహాలకు ఉన్న సోలార్ ప్యానెల్స్ కూడా విచ్చుకున్నాయని చెప్పారు. అయితే, ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి కాకుండా వేరే కక్ష్యలోకి చేరుకోవడంతో వాటిలోని సెన్సర్లు పనిచేయక సిగ్నల్స్ అందలేదని పేర్కొన్నారు. వృత్తాకార కక్ష్యలోకి కాకుండా దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించడంతో సెన్సార్లు పనిచేయక గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందకుండా పోయాయని వివరించారు. ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఎస్.సోమనాథ్ అభినందనలు తెలిపారు. రాకెట్ ప్రయోగమంతా సక్సెస్ అయినట్టేనని, ఆఖర్లో ఉపగ్రహాలు చేరుకున్న కక్ష్య దూరంలో తేడా రావడంతో చిన్నపాటి ఇబ్బంది తలెత్తిందని చెప్పారు. వీలైనంత త్వరగానే.. అంటే వచ్చే నెలలో ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగానికి సిద్ధం కాబోతున్నామని ప్రకటించారు. ఇప్పుడు చోటుచేసుకున్న ఈ చిన్నపాటి లోపాలను సరిచేసుకుంటామని, మరో ప్రయోగంలో కచ్చితంగా విజయం సా«ధించే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. ఇస్రో మాజీ చైర్మన్లు కె.రాధాకృష్ణన్, ఏఎస్ కిరణ్‌కుమార్, కె.శివన్ తదితరులు విచ్చేసి, ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగాన్ని వీక్షించారు. ఆ ఉపగ్రహాలు ఇక పనిచేయవు నిర్దేశిత కక్ష్యలోకి కాకుండా మరో కక్ష్యలోకి ప్రవేశించిన మైక్రోశాట్–2ఏ, ఆజాదీశాట్ ఉపగ్రహాలు ఇక పనిచేయవని, వాటితో ఉపయోగం లేదని ఇస్రో తేల్చిచెప్పింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ప్రస్తుతం జరిగిన పొరపాటును శాస్త్రవేత్తల కమిటీ విశ్లేషించనుందని పేర్కొంది. ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగంలో ఇలాంటి అపశ్రుతులు పునరావృతం కాకుండా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని వెల్లడించింది. ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్ రెండు శాటిలైట్లను 356 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, 356 కిలోమీటర్లు x 76 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో తెలియజేసింది. -
భారత్‌పై నిఘా పెట్టలేదు
వాషింగ్టన్: భారత్ ఇటీవల చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ–శాట్ పరీక్షపై నిఘా పెట్టినట్లు వస్తున్న వార్తలను అమెరికా రక్షణశాఖ ఖండించింది. భారత్ ఏ–శాట్ ప్రయోగాన్ని చేపడుతుందన్న విషయం తమకు ముందుగానే తెలుసని అమెరికా రక్షణశాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ డేవిడ్.డబ్ల్యూ.ఈస్ట్‌బర్న్ చెప్పారు. ‘ప్రయోగం గురించి మాకు ముందే తెలుసు. ఎందుకంటే ప్రయోగం కోసం నిర్ణీత ప్రాంతంలో విమానాల రాకపోకలను భారత్ నిషేధించింది. ఈ విషయాన్ని ముందురోజే చెప్పింది’ అని అన్నారు. 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని గత గురువారం∙ఏశాట్ క్షిపణి కూల్చివేసింది. దీంతో అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అయితే ఈ ప్రయోగం జరిగిన కొన్ని నిమిషాలకే అమెరికాకు చెందిన ‘ఆర్సీ–135ఎస్ కోబ్రా బాల్’ నిఘా విమానం బంగాళాఖాతంపై ప్రయాణిస్తూ వివరాలను సేకరించింది. మోదీపై బీఎస్ఎఫ్ జవాన్ పోటీ ఛండీగఢ్: జవాన్లకు నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ రెండేళ్ల క్రితం వీడియో పోస్ట్ చేసి ఉద్యోగం కోల్పోయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్‌బహదూర్ యాదవ్ వారణాసిలో ప్రధాని మోదీపై పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని, ఒకవేళ గెలుపొందితే సాయుధ బలగాల్లో అవినీతి నిర్మూలనకు కృషిచేస్తానని ఆయన శుక్రవారం చెప్పారు. అవినీతి గురించి గళం విప్పినందుకే తనకు ఉద్వాసన పలికారని అన్నారు. నియంత్రణ రేఖ వెంట విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ 2017లో యాదవ్ ఆన్లైన్లో పోస్ట్ పెట్టగా, క్రమశిక్షణా చర్యల కింద ఆర్మీ ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. -
ఏటీఎం కోసం పరుగో పరుగు!
బుధవారం జాతినుద్దేశించి తాను చేసే ప్రసంగానికి సంబంధించి ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు విపరీతంగా స్పందించారు. కొన్ని నిమిషాల్లోనే ప్రధాని ట్వీట్‌కు 20,663 రీట్వీట్లు, 57,674 లైక్‌లు, 15,000 కామెంట్లు వచ్చాయి. బుధవారం ఉదయం 11.23 గంటలకు ప్రధాని మోదీ తన ట్విటర్ నుంచి ‘ఈ రోజు పదకొండు ముప్పావు, పన్నెండు గంటల మధ్య నేను జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నాను. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. టీవీ, రేడియో, సామాజిక మాధ్యమాల్లో నా ప్రసంగాన్ని చూడండి’అని ట్వీట్ చేశారు. పలువురు నేతలు నెటిజన్లు వెంటనే స్పందించారు. ► దేశంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తారని, దావూద్ ఇబ్రహీంను వెనక్కి తీసుకొచ్చినట్లు చెపుతారని, మసూద్ అజార్‌ను చంపేశా మని ప్రకటిస్తారని.. ఇలా వందల ట్వీట్లు వచ్చాయి. ► మోదీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారంటూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ► 2016, నవంబర్ 8న మోదీ ఇలాగే పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు జాతినుద్దేశించి ప్రసంగంలో ప్రకటించారు. దాన్ని ప్రస్తావిస్తూ ఒక ట్విటర్ ‘మోదీజీ కొంచెం ఆగండి.. ఏటీఎం నుంచి రూ.100 నోట్లు డ్రా చేస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు. ► ‘మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. నేను ఇప్పటికే ఏటీఎం దగ్గరికొచ్చా’అని అమీర్ పఠాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ► ‘కేజ్రీవాల్ ఊహించినట్టే మోదీ దేశంలో ఎన్నికలపై నిషేధం ప్రకటించనున్నారు’ అని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. ► ‘ ఓ మైగాడ్. అందరూ ఏటీఎంలవైపు పరుగెడుతున్నారు’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ► ‘మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తానన్నపుడల్లా అవినీతిపరులందరికీ గుండెపోటు వస్తోంది’ అన్నది మరో ట్వీట్. ► మోదీ ప్రసంగం ప్రకటన పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు బీపీ తెప్పిస్తోందనే క్యాప్షన్‌తో ‘ఇమ్రాన్ బీపీ చెక్ చేసుకుంటున్న ఫొటో’ మరొకరు ట్వీట్ చేశారు. ► మరొకరు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటిం చినప్పటి ఫొటోను బ్లాగ్‌లో పెట్టారు. ► చివరికి మోదీ చెప్పిన సమయానికి 26 నిమిషాలు ఆలస్యంగా ప్రసంగం మొదలెట్టారు. భారతదేశం చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం గురించి ఆయన చెప్పారు. ఇదే ప్రధాని మోదీ చెప్పిన ‘ఆశ్చర్యకరమైన’విషయం. -
‘శక్తి’మాన్ భారత్
న్యూఢిల్లీ/బీజింగ్/ఇస్లామాబాద్: అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. అంతరిక్షంలోని శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చివేయగల శాటిలైట్ విధ్వంసక క్షిపణి(ఏశాట్)ని భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. భూదిగువ కక్ష్యలో 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న పనిచేయని ఓ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఏశాట్ క్షిపణి 3 నిమిషాల్లో కూల్చివేసింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం సాధించిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ‘మిషన్ శక్తి’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం వివరాలను ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. ఏ దేశానికీ వ్యతిరేకం కాదు మోదీ ప్రసంగిస్తూ..‘భారత్ శాటిలైట్ విధ్వంసక క్షిపణి(ఏశాట్)ని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న డా.ఏపీజే అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి బుధవారం ఉదయం 11.16 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టాం. ప్రతీ దేశ చరిత్రలో ప్రజలు చాలా గర్వపడే, భవిష్యత్ తరాలపై గొప్ప ప్రభావం చూపే ఘటనలు కొన్ని చోటుచేసుకుంటాయి. ఈరోజు జరిగిన ఏశాట్ ప్రయోగం అలాంటిదే. భూదిగువ కక్ష్యలో 300 కి.మీ ఎత్తులో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని అత్యంత కచ్చితత్వంతో కేవలం 3 నిమిషాల వ్యవధిలో ఏశాట్ కూల్చివేసింది. ఇప్పటివరకూ భూ,జల, వాయు మార్గాల్లో పటిష్టంగా ఉన్న మనం అంతరిక్షంలోనూ మన ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నాం. ఏశాట్ ప్రయోగం సందర్భంగా భారత్ ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను ఉల్లంఘించలేదు. ముంబైలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ వద్ద మోదీ ప్రసంగం వింటున్న స్థానికులు ఈ క్షిపణిని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. ఏశాట్ చేరికతో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన శాస్త్రవేత్తలతో పాటు దేశప్రజలందరికీ అభినందనలు’ అని తెలిపారు. ప్రసంగం అనంతరం ఈ ప్రయోగం చేపట్టిన శాస్త్రవేత్తలతో మోదీ సమావేశమయ్యారు. శాస్త్రవేత్తల తాజా విజయంతో దేశప్రజలంతా గర్వపడుతున్నారని వారితో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బుధవారం మధ్యాహ్నం 11.45 నుంచి 12 గంటల మధ్యలో కీలక ప్రకటన చేస్తానని మోదీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే ఏశాట్ ప్రయోగం విజయవంతమైందని ధ్రువీకరించుకునేందుకు ఎక్కువ సమయం పట్టడంతో మధ్యాహ్నం 12.10 గంటలకు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆచితూచి స్పందించిన చైనా భారత్ ఏశాట్ క్షిపణి ద్వారా ఉపగ్రహాన్ని కూల్చివేయడంపై చైనా ఆచితూచి స్పందించింది. ‘భారత్ ఏశాట్ క్షిపణిని పరీక్షించినట్లు తెలిసింది. ప్రపంచదేశాలన్నీ అంతరిక్షంలో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు కట్టుబడి ఉంటాయని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు ఈ ప్రయోగంపై పాక్ తీవ్రంగా స్పందించింది. భారత్ అంతరిక్షంలో ఊహాజనిత శత్రువుల కోసం సిద్ధమవుతోందని పాక్ విదేశాంగ ప్రతినిధి ఫైజల్ విమర్శించారు. ఈసీకి ప్రతిపక్షాల ఫిర్యాదు శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగం నిర్వహిస్తే, దాని ఘనతను సొంతం చేసుకునేందుకు మోదీ ఉబలాటపడుతున్నారని దుయ్యబట్టాయి. ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించడం ద్వారా మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ విషయమై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ స్పందిస్తూ..‘ఏశాట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన శాస్త్రవేత్తలకు అభినందనలు. ప్రధాని మోదీకి అంతర్జాతీయ నాటక దినోత్సవ శుభాకాంక్షలు’ అని చురకలు అంటించారు. ఏశాట్ ప్రాజెక్టు మన్మోహన్ సింగ్ హయాంలో ప్రారంభమైందని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. మోదీ అడ్డూఅదుపులేని డ్రామాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. నిరుద్యోగం, మహిళల భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మోదీ మళ్లించారని ఎస్పీ, బీఎస్పీలు విమర్శించాయి. ప్రధాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ సీపీఎం ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఈసీ ప్రకటించింది. భారత్ దగ్గర 2007 నుంచి శాటిలైట్ విధ్వంసక క్షిపణి(ఏశాట్) సాంకేతికత ఉందని ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ తెలిపారు. కానీ ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ప్రయోగాన్ని చేపట్టలేదని వెల్లడించారు. రెండేళ్ల క్రితమే ఆమోదం కీలక సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో భారత సామర్థ్యానికి ఏశాట్ ప్రయోగం ఓ మచ్చుతునక అని డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రెండేళ్ల క్రితమే ఆమోదముద్ర లభించిందన్నారు. శత్రుదేశాలకు ఇది ఓ హెచ్చరికగా ఉపయోగపడుతుందన్నారు. తాజా ప్రయోగంతో భారత్ శత్రుదేశాల ఉపగ్రహాలను సెంటీమీటర్ల కచ్చితత్వంతో కూల్చివేసే సామర్థ్యాన్ని సొంతం చేసుకుందన్నారు. ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తిచేశామనీ, తద్వారా డీఆర్డీవో సమర్థతను చాటుకున్నామని పేర్కొన్నారు. భారత రక్షణశాఖ, డీఆర్డీవో సమన్వయంతో ఈ ప్రయోగాన్ని చేపట్టాయన్నారు. డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి ఏ శాట్ క్షిపణి పనిచేసిందిలా.. ఖండాంతర క్షిపణి కార్యక్రమం (ఐడీబీఎం)లో భాగంగా భారత్ అభివృద్ధి చేసిన ఏశాట్ క్షిపణిని ఇందులో ఉపయోగించారు. ఈ ప్రయోగం ప్రధానంగా మూడుదశల్లో కొనసాగింది. తొలుత భారత భూభాగంపై నిఘాపెట్టిన ఓ ఉపగ్రహాన్ని భూమిపైన ఉన్న రాడార్లు గుర్తించాయి. ఓసారి టార్గెట్‌ను లాక్‌చేసిన అనంతరం మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణిని నిర్దేశిత లక్ష్యంపైకి ప్రయోగించారు. రెండోదశలో భాగంగా భూమి నుంచి నిర్ణీత ఎత్తులోకి వెళ్లాక ఏశాట్‌కు అమర్చిన హీట్‌షీల్డ్స్ తొలగిపోయాయి. మూడో దశలో భాగంగా రాడార్ సాయంతో ఏశాట్ క్షిపణి లక్ష్యంవైపు దూసుకుపోయి నిర్దేశిత ఉపగ్రహాన్ని కూల్చివేసింది. తిరుగులేని గురి శత్రు దేశాల నుంచి వచ్చే క్షిపణులను మార్గమధ్యంలో గాల్లోనే పేల్చేయడం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. మిషన్ శక్తిలో కూడా దాదాపు ఇలాంటి క్షిపణినే వాడారు. అయితే, ఇందులో వాడిన సాంకేతిక పరిజ్ఞానంలో కొంత తేడా ఉంది. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండే అతి చిన్న లక్ష్యాన్ని ఛేదించాలంటే క్షిపణి ఎంతో కచ్చితమైన మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. బుధవారం నాటి పరీక్షలో ఈ కచ్చితత్వం సాధించగలిగామని, అన్ని రకాలుగా పరీక్ష సఫలమైందని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. అమెరికాతో మొదలు ఉపగ్రహ ప్రయోగాలు మొదలైన 1950లలోనే అమెరికా వాటిని ఆకాశంలోనే కూల్చేసే టెక్నాలజీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమెరికా వాయుసేన నిపుణులు వెపన్ సిస్టమ్స్ –199ఏ పేరుతో ఈ ప్రయోగాలు చేపట్టారు. వీటిల్లో ఒకటి లాక్‌హీడ్ మార్టిన్ ప్రాజెక్టు బోల్డ్ ఓరియన్. సార్జెంట్ క్షిపణి మోటార్ ఆధారంగా తయారు చేసిన ఈ యాంటీ శాటిలైట్ మిస్సైల్‌ను 1958 మే నుంచి 1959 అక్టోబరు మధ్యకాలంలో దాదాపు 12సార్లు పరీక్షించారు. చాలా పరీక్షలు విఫలమయ్యాయి. దీంతో క్షిపణి వ్యవస్థలో మార్పులు చేశారు. 1700 కిలోమీటర్ల పరిధితో కూడిన క్షిపణిని సిద్ధం చేసి పరీక్షించారు. కానీ, ఇది లక్ష్యానికి 6.4 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లింది. అప్పటి సోవియట్ యూనియన్ కూడా ఉపగ్రహాలను కూల్చివేసే వ్యవస్థలను పలుమార్లు పరీక్షించింది. శత్రు ఉపగ్రహాలను బలమైన విద్యుదావేశంతో నాశనం చేయగల వ్యవస్థను సోవియట్ యూనియన్ 1970 తొలినాళ్లలోనే సిద్ధం చేసింది. 1985లో అమెరికా ఏజీఎం –135 పేరుతో ఎఫ్–15 యుద్ధ విమానం నుంచి ప్రయోగించగల ఇంకో క్షిపణి ద్వారా సోల్విండ్ పీ78–1 ఉపగ్రహాన్ని కూల్చివేసింది. 2007లో చైనా పాతకాలపు వాతావరణ ఉపగ్రహాన్ని కూల్చివేయడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. చైనా ప్రయోగం పుణ్యమా అని అంతరిక్షంలో దాదాపు మూడు వేల శకలాలు చెల్లాచెదురుగా ఏర్పడ్డాయి. 2008లో అమెరికా కూడా ఓ నౌకపై నుంచి ఎస్ఎం3 క్షిపణిని ప్రయోగించి అంతరిక్షంలో పనిచేయని ఉపగ్రహం ఒకదాన్ని కూల్చేసింది. సైనిక అవసరాలకు కూడా అంతరిక్షంలోని ఉపగ్రహాలను కూల్చేసే సాంకేతికతతో మిలటరీకీ ప్రయోజనకరమనడంలో ఎలాంటి సందేహం లేదు. శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చివేస్తే వారికి వ్యూహాత్మక సమాచారం అందకుండా పోతుంది. బుధవారం నాటి ప్రయోగాలతో భారత వ్యతిరేక శక్తుల ఉపగ్రహాలను కూల్చివేసే సామర్థ్యం సంపాదించుకున్నట్లు అయింది. ఒకవైపు పాకిస్తాన్ తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూండటం.. భారత వాయుసేన బాలాకోట్‌పై దాడి నేపథ్యంలో ఈ టెక్నాలజీకి మరింత ప్రాధాన్యం లభించింది. చైనా, రష్యా రాకెట్ల సాయంతో పాకిస్తాన్ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఉపగ్రహాలను కూల్చివేసే క్రమంలో ఏర్పడుతున్న శకలాలు అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి. విపరీతమైన వేగంతో ప్రయాణించే ఈ శకలాలు ఏ ఒక్కటి ఢీకొన్నా ఆయా కక్ష్యల్లో ఉండే ఉపగ్రహాలకు భారీ నష్టం వాటిల్లుతుంది. భూమికి 330 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తరచూ తన కక్ష్యను మార్చుకుంటూ ఈ శకలాల నుంచి తప్పించుకుంటోంది. ఊహాత్మక చిత్రం -
చైనా రాకెట్ ప్రయోగం విఫలం
బీజింగ్: అత్యంత అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో సిద్ధం చేసిన ఓ శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టడంలో చైనా విఫలం చెందింది. షాంగ్సీలోని తయ్యువాన్ ఉపగ్రహ ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ గాలిలోనే పేలిపోయింది. అయితే దీనిపై చైనా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. చైనా వ్యోమగాములు నడిపై ఓ వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన ఈ వివరాలను ఉంచారు. చైనా చేసే రాకెట్ ప్రయోగాలు విఫలం చెందడం చాలా అరుదు. 2013లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కూడా ఇలానే కక్ష్యలోకి వెళ్లకముందే పేలిపోయింది. లాంగ్ మార్చ్4సీ రాకెట్ ద్వారా గావోఫెన్-10 ఉపగ్రహాన్ని గురువారం చైనా ప్రయోగించింది. నింగిలోకి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపంతో రాకెట్ పేలిపోయింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను షాంగ్సీకు చెందిన వారు సోషల్ మీడియాలో ఉంచారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన లాంచింగ్ వెహికల్ గా లాంగ్ మార్చ్ ను చైనా పేర్కొన్న విషయం తెలిసిందే. లాంగ్ మార్చ్ వెహికల్ ద్వారా చైనా సంవత్సరానికి 20కి పైగా ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఎర్త్ అబ్జర్వేషన్ కోసం తయారు చేసిన ఈ అత్యాధునిక శాటిలైట్ లను మిలటరీ, పౌర అవసరాలకు చైనా ప్రయోగిస్తోంది. 2020లోగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు చైనా కృషి చేస్తుండగా తాజా ప్రయోగ విఫలం దాన్ని మరికొంచెం ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహ ప్రయోగాలు విజయవంతమైతే భూమి మీద ఉన్న ఏ ప్రాంతాన్నైనా హై డెఫినీషన్ క్వాలిటీతో వీక్షించేందుకు అవకాశం కలుగుతుంది. హ్యాక్ ప్రూఫ్ కమ్యూనికేషన్ కోసం చైనా క్వాంటమ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే.