సూళ్లూరుపేట: ఎల్‌వీఎం3–ఎం2 ప్రయోగం విజయంతో ఇస్రోకు ఒక రోజు ముందుగానే దీపావళి పండగ వచ్చిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగానంతరం ఆదివారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడారు. న్యూ స్పేస్ ఇండియా, వన్‌వెబ్ సహకారంతో ఆదివారం ఎల్‌వీఎం3–ఎం2 ద్వారా ప్రయోగించిన 36 యూకేకి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామని తెలిపారు.
క్రయోజనిక్ దశలో 36 ఉపగ్రహాలను ఒకేసారి కాకుండా నాలుగు దిశల్లో నాలుగేసి ఉపగ్రహాలు చొప్పున కక్ష్యలోకి విడిపోయేలా ఈ ప్రయోగంలో కొన్ని కీలకమైన సైంటిఫిక్ పరికరాలతో రూపొందించామని చెప్పారు. ఈ ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరడం కీలకం కావడంతో 36 ఉపగ్రహాలు విడిపోవడానికి 1.30 గంటల సమయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. వన్‌వెబ్ కంపెనీతో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఒప్పందం మేరకు మరో 36 ఉపగ్రహాలను, మళ్లీ ఇంకో 36 ఉపగ్రహాలను ఇదే తరహాలోనే ప్రయోగిస్తామని తెలిపారు. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
వాణిజ్య ప్రయోగాలే లక్ష్యం
ఇకపై వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడమే లక్ష్యమని న్యూ స్పేస్ ఇండియా సీఎండీ రాధాకృష్ణన్ అన్నారు. దీన్ని చరిత్రాత్మక ప్రయోగంగా వన్‌వెబ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభివర్ణించారు. ఇప్పటికే 648 ఉపగ్రహాలను వివి«ధ దేశాల నుంచి ప్రయోగించామని గుర్తు చేశారు. ఇది కొత్త అధ్యాయానికి శ్రీకారమని పవన్ గోయెంకా (వన్‌వెబ్ కంపెనీ) చెప్పారు. ‘‘36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపడం కూడా అద్భుతం. వాణిజ్యపరంగా ఇస్రో మరో అడుగు ముందుకేయడం శుభ పరిణామం’’ అని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment