సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయవంతం కావడం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడారు. ఈ ప్రయోగాన్ని ముందుగా అనుకున్న విధంగానే చేయగలిగామని చెప్పారు. జూలై 14న నిర్వహించి చంద్రయాన్–3 మిషన్‌ను ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్‌ను దించి సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న సమయంలోనే సూర్యయాన్–1కి రెడీ అయిపోయామని చెప్పారు.
రేపటి నుంచి 16 రోజుల పాటు ఆర్టిట్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 125 రోజుల తర్వాత ఉపగ్రహాన్ని సూర్యుని దిశగా పయనింపజేసి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్–1 బిందువు వద్ద ప్రవేశపెడతామన్నారు. భవిష్యత్తులో చంద్రయాన్–4 ప్రయోగం, ఆ తర్వాత శుక్రుడి మీదకు కూడా ప్రయోగానికి సిద్ధమవుతామని తెలిపారు. ఈ ఏడాది ఆక్టోబర్‌లో గగన్‌యాన్ ప్రయోగాత్మక ప్రయోగం, జీఎస్‌ఎల్‌వీ మార్క్–2 రాకెట్ ద్వారా త్రీడీఎస్ అనే సరికొత్త ఉపగ్రహాన్ని పంపించబోతున్నామని చెప్పారు.
ఇస్రోకు ప్రధాని అభినందనలు
న్యూఢిల్లీ: దేశం యొక్క మొదటి సోలార్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి సంక్షేమం కోసం విశ్వాంతరాళాన్ని అర్థం చేసుకునే క్రమంలో మన శాస్త్రీయ పరిశోధనలు అవిశ్రాంతంగా కొనసాగుతాయని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలకు అభినందనలు అని తెలిపారు.
ఇస్రో బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. పరిశోధనల క్రమంలో సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇస్రో బృందాన్ని అభినందించారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లే మిషన్‌ను సాధించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్–1’ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటిందని అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment