New Space Technology
-
ISRO PSLV-C56: ఇస్రో మరో వాణిజ్య విజయం
సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌక ఆదివారం ఉదయం 6.31 గంటలకు విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ఏడాదిలో ఇస్రో మూడో వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకున్నట్లయింది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి దీనిని ప్రయోగించాయి. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో చేపట్టిన 58 ప్రయోగాల్లో ఇది 56వ విజయం కావడం గమన్హాం. పీఎస్ఎల్వీ సీ–56 రాకెట్‌కు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 6.31 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల ప్రయాణాన్ని విజయవంతంగా సాగిస్తూ 23 నిమిషాల వ్యవధిలో (1,381 సెకన్లకు) సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులోని నియో ఆర్బిట్ (భూ సమీప కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 352 కిలోలు బరువు కలిగిన డీఎస్–ఎస్ఏఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోల ఆర్కేడ్, 23 కేజీల బరువున్న వెలాక్స్–ఏఎం, 12.8 కిలోల ఓఆర్బీ–12 స్ట్రయిడర్, 3.84 కేజీల గలాసియా–2, 4.1 కేజీల స్కూబ్–11, 3.05 కేజీల బరువైన న్యూలయన్ అనే ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. షార్ నుంచి చేసిన 90వ ప్రయోగమిది. అంతరిక్ష వ్యర్థాలను తొలగించే కొత్త ప్రయోగం పీఎస్ఎల్వీ సీ–56 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత పీఎస్–4 అక్కడ నుంచి 300 కిలోమీటర్ల స్థాయికి దిగి వస్తుంది. ఈ ఎత్తులో ఉండటం వల్ల ఇది త్వరగానే భూ కక్ష్యలోకి ప్రవేశించి మండిపోతోంది. దీంతో అంతరిక్షంలో ఇలాంటి ప్రయోగాల తదుపరి చెత్త తగ్గుతుంది. ఒకవేళ 530కి.మీ.ల ఎత్తులోనే ఉంటే కింది కక్ష్యలకు వచ్చి పడిపోవడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఇప్పుడు కిందిస్థాయిలోనే ఉంది కనుక కేవలం రెండునెలల్లో పడిపోతుంది. ఆ కీలక భాగాల తయారీదారు హైదరాబాద్ సంస్థే పీఎస్ఎల్వీ సి–56లోని కీలక భాగాలు, వ్యవస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్(ఏటీఎల్) రూపొందించినవే కావడం విశేషం. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు పావులూరి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. పీఎస్ఎల్వీ సి–56 లాంఛ్ వెహికల్లో వాడిన నావిగేషన్ ఇంటర్ఫేస్ మాడ్యూళ్లు, ఇనెర్షియల్ సెన్సింగ్ యూనిట్లు, ఇంట్రా మాడ్యూల్ హార్నెస్, కంట్రోల్ ఎల్రక్టానిక్స్, పైరో కంట్రోల్ సిస్టమ్స్, ట్రాకింగ్ ట్రాన్స్‌పాండర్, ఇంధన వ్యవస్థల రూపకల్పనలో తమ సంస్థ భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. ఇస్రో లాంఛ్ వెహికల్స్, శాటిలైట్లు, స్పేస్ క్రాఫ్ట్ పేలోడ్స్, గ్రౌండ్ సిస్టమ్స్‌ను తాము ఉత్పత్తి చేస్తున్నామన్నారు. పీఎస్ఎల్వీ సి–56తో కలిపి ఇప్పటి వరకు అయిదు పీఎస్ఎల్వీ మిషన్లలో అత్యంత కీలకమైన సబ్ అసెంబ్లీ ప్రక్రియను ఏటీఎల్ నిపుణులు చేపట్టినట్లు వివరించారు. -
ఇస్రో సూపర్ సక్సెస్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన పీఎస్ఎల్వీ సీ51 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. ఈ ఏడాది మొట్టమొదటగా ఆదివారం ఉదయం 10.24 గంటలకు ప్రయోగించిన రాకెట్ విజయంతో శుభారంభమైంది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 53వ ప్రయోగంతో షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన 78వ ప్రయోగం ఇది. 44.4 మీటర్ల పొడవైన పీఎస్ఎల్వీ సీ51 రాకెట్‌కు సంబంధించి శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగి వైపు దూసుకెళ్లింది. 1.38 గంటల వ్యవధిలో 19 ఉపగ్రహాలను భూమికి 537 నుంచి 637 కిలో మీటర్లు పరిధిలోని వివిధ సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది. ఇటీవల ఏర్పాటైన ఇస్రో అనుబంధ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాణిజ్యపరంగా చేపట్టిన ఈ మొట్టమొదటి మిషన్‌లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–01 ఉపగ్రహం ప్రధానమైంది. 637 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని 17.23 నిమిషాల్లో సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత పీఎస్ఎల్వీ సీ51 రాకెట్లో నాలుగో దశలో అమెరికాకు చెందిన స్పేస్‌బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12 చిన్న తరహా ఉపగ్రహాలు, సాయ్–1 కాంటాక్ట్–2 అనే మరో ఉపగ్రహంతో కలిపి 13 ఉపగ్రహాల శ్రేణిని ఒకసారి, తమిళనాడు కోయంబత్తూరులోని శ్రీశక్తి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన శ్రీ శక్తిశాట్, శ్రీపెరంబుదూర్‌లోని జెప్పియర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జిట్‌శాట్, మహారాష్ట్ర నాగపూర్‌లోని జీహెచ్ రాయ్సోనీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జీహెచ్ఆర్సీ ఈశాట్ మూడు ఉపగ్రహాలను యూనిటిశాట్స్‌ను, న్యూ స్పేస్ ఇండియాలో భాగంగా భారత ప్రైవేట్ సంస్థలు రూపొందించిన సింధునేత్ర, సతీష్ ధవన్ శాట్‌లను కలిపి మరో శ్రేణిగా చేర్చి రోదసీలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టడంతో ప్రయోగం పూర్తయింది. ఈ మిషన్‌తో ఇస్రో ఇప్పటి వరకు 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించినట్లయింది. 14 మిషన్ల ప్రయోగమే లక్ష్యం: డాక్టర్ కె.శివన్, ఈ ఏడాదిలో 14 మిషన్లు ప్రయోగించాలనే లక్ష్యంతో పని చేయాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు పిలుపునిచ్చారు. పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగం విజయవంతమైన అనంతరం శివన్ షార్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ 14 మిషన్ల ప్రయోగంలో భాగంగా 7 లాంచింగ్ వెహికల్స్, ఆరు ఉపగ్రహాలు, ఒక మానవరహిత ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 2020లో కోవిడ్–19 వల్ల ప్రయోగాల విషయంలో వెనుకబడ్డామని, ఇకపై వేగం పెంచుతామని తెలిపారు. బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–01ను ఇక్కడ నుంచి ప్రయోగించడం సంతోషంగా ఉందన్నారు. అనుకున్న ప్రకారం 17.23 నిమిషాలకు అమెజానియా–01 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన కొద్ది నిమిషాలకు సోలార్ ప్యానెల్స్ పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ ద్వారా అమెజానియా–01 ఉపగ్రహం సక్సెస్ పుల్గా కక్ష్యలోకి చేరుకున్నందుకు సంతోషంగా ఉందని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ కెసార్ పొంటీస్ అన్నారు. ప్రయోగం విజయం అనంతరం ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ అమోఘం అని, ఈ రాకెట్ తయారు చేసిన టీంను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌లో ప్రైవేట్ సంస్థలకు ఆహ్వానం పలికేందుకు న్యూ స్పేస్ ఇండియాను ఏర్పాటు చేశామని సీఎండీ నారాయణన్ తెలిపారు. భారత్‌లో ప్రైవేట్ సంస్థలకు చెందిన వారు ఉప గ్రహాలను తయారు చేసుకుంటే వాటిని ఇస్రో ప్రయోగించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రముఖుల అభినందనలు వాణిజ్యపరంగా మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధాని మోదీ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. దేశం చేపట్టిన సంస్కరణలు అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త శకానికి నాందిపలికాయన్నారు. అమెజానియా ప్రయోగం విజయవంతం కావడంపై బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారోకు ప్రధాని అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య సహకారానికి నాందికానుందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రోకు ఏపీ గవర్నర్ అభినందనలు సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సి–51 రాకెట్ ప్రయోగం విజయవంతంకావడంపట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఏపీ ముఖ్యమంత్రి అభినందనలు పీఎస్ఎల్వీ –సీ 51 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇస్రో భవిష్యత్‌లో చేపట్టే అన్ని ప్రయోగాల్లోనూ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
న్యూ స్పేస్ టెక్నాలజీ...గ్రహశకలాలకు ‘గాలం’!
గ్రహాలు, గ్రహశకలాలపై అధ్యయనం ద్వారా విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, మన భూమి పుట్టుపూర్వోత్తరాల గురించి మరింత బాగా తెలుసుకోవచ్చు. అందుకే.. గ్రహాలు, గ్రహశకలాల నుంచి మట్టి, శిలల నమూనాలను సేకరించేందుకు శాస్త్రవేత్తలు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఇప్పటిదాకా చంద్రుడు, ఇటోకవా అనే గ్రహశకలం నుంచి మాత్రమే నమూనాలు సేకరించగలిగారు. సుదూర ప్రదేశాలకు ప్రయాణించి గ్రహాలపై, గ్రహశకలాలపై వ్యోమనౌకలను దింపి నమూనాలను సేకరించి.. భూమికి తీసుకురావడమన్నది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. క్యూరియాసిటీ లాంటి రోవర్లు గ్రహాలపై దిగి మట్టిని విశ్లేషించి సమాచారం పంపగలిగినా.. మనిషి నేరుగా చేసే పరీక్షలకు, యంత్రాలు చేసే పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో ఇప్పటిదాకా ఆశించిన పురోగతి సాధ్యం కాలేదు. అయితే.. గ్ర హశకలాలకు ‘గాలం’ వేసి వాటి నుంచి నమూనాలు సేకరించే పనిని సులభం చేసే ఓ అద్భుత స్పేస్ టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన రాబర్ట్ వింగ్లీ బందం అభివద్ధిపరుస్తోంది. ఖగోళ వస్తువుల నుంచి నమూనాల సేకరణను కొత్తపుంతలు తొక్కించనుందని భావిస్తున్న ఈ అంతరిక్ష ‘గాలం’ సంగతేంటో చూద్దాం... ఈటెలు రువ్వి... నమూనాలు సేకరిస్తారు! చేపలు పట్టడానికి గాలం ఉపయోగిస్తారు. తిమింగలాలు పట్టేందుకు? ఈటెల్లాంటి పెద్ద గాలాన్ని ఉపయోగిస్తారు. కాకపోతే చేపలకు కొక్కెంలాంటి గాలం వేస్తారు. తిమింగలాలకు ఈటెలాంటి హార్పూన్ (తెలుగులో పంట్రకోల, రువ్వుటీటె అంటారు)లను యంత్రాల సాయంతో వేగంగా వదులుతారు. ముందు భాగం బాణంలా ఉండే ఈ హార్పూన్ తిమింగలాల శరీరంలోకి దిగిన తర్వాత చిక్కుకుపోతుంది. దీంతో హార్పూన్‌ను బలమైన తాడుతో మోటార్ల సాయంతో వెనక్కి లాగుతూ తిమింగలాలను ఓడ దగ్గరికి తీసుకొస్తారు. మరి.. ఈ ఐడియాను అంతరిక్షంలో ఎలా ఉపయోగిస్తారంటే... రాకెట్ మాదిరిగా మొనదేలిన కవచంతో ఉన్న హార్పూన్లను వ్యోమనౌకల ద్వారా పంపుతారు. హార్పూన్‌ను వ్యోమనౌక కు మైళ్లకొద్ది పొడవుండే దఢమైన తాడుతో కడతారు. చంద్రుడు లేదా ఓ గ్రహ శకలం సమీపంలోకి వ్యోమనౌక వెళ్లిన తర్వాత హార్పూన్ బలంగా విడుదలవుతుంది. దీంతో సెకనుకు ఒక కి.మీ. వేగంతో హార్పూన్ దూసుకుపోయి ఆ ఖగోళ వస్తువు ఉపరితలంలోకి దిగబడిపోతుంది. హార్పూన్ నేలలోకి దిగిపోగానే దాని కవచం విడిపోతుంది. ఇంకేం.. లోపల ఉండే డబ్బాలోకి కొన్ని కిలోల వరకూ మట్టి, రాళ్లు చేరిపోతాయి. శాంపిల్‌తో కూడిన హార్పూన్‌ను తాడు సాయంతో వ్యోమనౌక వెనక్కి లాక్కుని భూమికి తిరిగి వచ్చేస్తుందన్నమాట. నాసా నుంచి రెండేళ్లుగా నిధులు అందుకుంటున్న శాస్త్రవేత్తలు ఈ స్పేస్ హార్పూన్ని బ్లాక్‌రాక్ ఎడారిలో ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలోనూ హార్పూన్ల ప్రయోగానికి వీరు సిద్ధమవుతున్నారు. ప్రయోజనాలు చాలానే... స్పేస్ హార్పూన్లతో గ్రహశకలంపై వేర్వేరు చోట్ల శాంపిళ్లను సేకరించవచ్చు. వ్యోమనౌకను దింపాల్సిన అవసరం లేనందున ఇంధనం బాగా ఆదా అవుతుంది. గ్రహాల ఉపరితలంపై కొన్ని మీటర్ల లోతు నుంచీ నమూనాలు సేకరించొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. విఫలమైన ఉపగ్రహాలకు చెందిన శకలాలు ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, మనం పంపే ఉపగ్రహాలకు ముప్పు తెస్తున్నాయి. అలాంటి శకలాలపైకి హార్పూన్లను వదిలి, అవి గుచ్చుకున్నాక.. శకలాలను భూవాతావరణంలోకి ఈడ్చుకొచ్చి మండించొచ్చని అంటున్నారు. అలాగే.. భూమిపై అగ్నిపర్వతాల బిలాల నుంచి, అణు ప్రమాదాలు జరిగి రేడియోధార్మికత తీవ్రంగా ఉన్న చోటు నుంచి, ఇతర ప్రతికూలమైన ప్రదేశాల్లో ఆకాశం నుంచే శాంపిళ్లను సేకరించొచ్చని చెబుతున్నారు.