న్యూ స్పేస్ టెక్నాలజీ...గ్రహశకలాలకు ‘గాలం’!
గ్రహాలు, గ్రహశకలాలపై అధ్యయనం ద్వారా విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, మన భూమి పుట్టుపూర్వోత్తరాల గురించి మరింత బాగా తెలుసుకోవచ్చు. అందుకే.. గ్రహాలు, గ్రహశకలాల నుంచి మట్టి, శిలల నమూనాలను సేకరించేందుకు శాస్త్రవేత్తలు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఇప్పటిదాకా చంద్రుడు, ఇటోకవా అనే గ్రహశకలం నుంచి మాత్రమే నమూనాలు సేకరించగలిగారు.
సుదూర ప్రదేశాలకు ప్రయాణించి గ్రహాలపై, గ్రహశకలాలపై వ్యోమనౌకలను దింపి నమూనాలను సేకరించి.. భూమికి తీసుకురావడమన్నది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. క్యూరియాసిటీ లాంటి రోవర్లు గ్రహాలపై దిగి మట్టిని విశ్లేషించి సమాచారం పంపగలిగినా.. మనిషి నేరుగా చేసే పరీక్షలకు, యంత్రాలు చేసే పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది.
అందుకే ఈ విషయంలో ఇప్పటిదాకా ఆశించిన పురోగతి సాధ్యం కాలేదు. అయితే.. గ్ర హశకలాలకు ‘గాలం’ వేసి వాటి నుంచి నమూనాలు సేకరించే పనిని సులభం చేసే ఓ అద్భుత స్పేస్ టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన రాబర్ట్ వింగ్లీ బందం అభివద్ధిపరుస్తోంది. ఖగోళ వస్తువుల నుంచి నమూనాల సేకరణను కొత్తపుంతలు తొక్కించనుందని భావిస్తున్న ఈ అంతరిక్ష ‘గాలం’ సంగతేంటో చూద్దాం...
ఈటెలు రువ్వి... నమూనాలు సేకరిస్తారు!
చేపలు పట్టడానికి గాలం ఉపయోగిస్తారు. తిమింగలాలు పట్టేందుకు? ఈటెల్లాంటి పెద్ద గాలాన్ని ఉపయోగిస్తారు. కాకపోతే చేపలకు కొక్కెంలాంటి గాలం వేస్తారు. తిమింగలాలకు ఈటెలాంటి హార్పూన్ (తెలుగులో పంట్రకోల, రువ్వుటీటె అంటారు)లను యంత్రాల సాయంతో వేగంగా వదులుతారు. ముందు భాగం బాణంలా ఉండే ఈ హార్పూన్ తిమింగలాల శరీరంలోకి దిగిన తర్వాత చిక్కుకుపోతుంది.
దీంతో హార్పూన్‌ను బలమైన తాడుతో మోటార్ల సాయంతో వెనక్కి లాగుతూ తిమింగలాలను ఓడ దగ్గరికి తీసుకొస్తారు. మరి.. ఈ ఐడియాను అంతరిక్షంలో ఎలా ఉపయోగిస్తారంటే... రాకెట్ మాదిరిగా మొనదేలిన కవచంతో ఉన్న హార్పూన్‌లను వ్యోమనౌకల ద్వారా పంపుతారు. హార్పూన్‌ను వ్యోమనౌక కు మైళ్లకొద్ది పొడవుండే దఢమైన తాడుతో కడతారు. చంద్రుడు లేదా ఓ గ్రహ శకలం సమీపంలోకి వ్యోమనౌక వెళ్లిన తర్వాత హార్పూన్ బలంగా విడుదలవుతుంది. దీంతో సెకనుకు ఒక కి.మీ. వేగంతో హార్పూన్ దూసుకుపోయి ఆ ఖగోళ వస్తువు ఉపరితలంలోకి దిగబడిపోతుంది.
హార్పూన్ నేలలోకి దిగిపోగానే దాని కవచం విడిపోతుంది. ఇంకేం.. లోపల ఉండే డబ్బాలోకి కొన్ని కిలోల వరకూ మట్టి, రాళ్లు చేరిపోతాయి. శాంపిల్‌తో కూడిన హార్పూన్‌ను తాడు సాయంతో వ్యోమనౌక వెనక్కి లాక్కుని భూమికి తిరిగి వచ్చేస్తుందన్నమాట. నాసా నుంచి రెండేళ్లుగా నిధులు అందుకుంటున్న శాస్త్రవేత్తలు ఈ స్పేస్ హార్పూన్‌ని బ్లాక్‌రాక్ ఎడారిలో ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలోనూ హార్పూన్ల ప్రయోగానికి వీరు సిద్ధమవుతున్నారు.
ప్రయోజనాలు చాలానే...
స్పేస్ హార్పూన్‌లతో గ్రహశకలంపై వేర్వేరు చోట్ల శాంపిళ్లను సేకరించవచ్చు. వ్యోమనౌకను దింపాల్సిన అవసరం లేనందున ఇంధనం బాగా ఆదా అవుతుంది. గ్రహాల ఉపరితలంపై కొన్ని మీటర్ల లోతు నుంచీ నమూనాలు సేకరించొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. విఫలమైన ఉపగ్రహాలకు చెందిన శకలాలు ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, మనం పంపే ఉపగ్రహాలకు ముప్పు తెస్తున్నాయి. అలాంటి శకలాలపైకి హార్పూన్‌లను వదిలి, అవి గుచ్చుకున్నాక.. శకలాలను భూవాతావరణంలోకి ఈడ్చుకొచ్చి మండించొచ్చని అంటున్నారు. అలాగే.. భూమిపై అగ్నిపర్వతాల బిలాల నుంచి, అణు ప్రమాదాలు జరిగి రేడియోధార్మికత తీవ్రంగా ఉన్న చోటు నుంచి, ఇతర ప్రతికూలమైన ప్రదేశాల్లో ఆకాశం నుంచే శాంపిళ్లను సేకరించొచ్చని చెబుతున్నారు.