సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూ స్పేస్ ఇండియా సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్‌ఎల్‌వీ–సీ55 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనున్నారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు.
మొత్తం 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్‌ఎల్‌వీ–సీ55 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంట్‌డౌన్ ప్రక్రియను ఇస్రో చైర్మన్ సోమనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్–2, 16 కిలోల బరువు కలిగిన లూమిలైట్–4 అనే రెండు ఉపగ్రహాలను భూమికి 570 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్య (సన్ సింక్రనస్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టనున్నారు.
44.4 మీటర్ల పొడవు కలిగిన రాకెట్... 228.355 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమై 20.35 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తి చేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. అదేవిధంగా ఈ రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో ఒక ప్రత్యేక ప్రయోగం చేస్తున్నారు. 20.35 నిమిషాల వ్యవధిలో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత 1.33 నిమిషాలకు పీఎస్–4ను రీస్టార్ట్ చేస్తారు. అది కొద్దిసేపటి తర్వాత ఆరిస్–2, పైలెట్, అర్కా–200, స్టార్‌బెర్రీ, డీఎస్‌వోఎల్, డీఎస్‌వోడీ–3యూ, డీఎస్‌వోడీ–06యూ అనే చిన్నపాటి పేలోడ్లను వివిధ రకాల కక్ష్యల్లో వదిలిపెడుతుంది. ఈ తరహా ప్రయోగం ఇక్కడి నుంచి తొలిసారి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment