
సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి అర్బన్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అమోఘ ప్రగతి సాధిస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అన్నారు. మంగళవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 41వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గతంలో రాకెట్ ప్రయోగాలు, డిజైన్, తయారీ, పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లమని, ప్రస్తుతం సొంతగా రాకెట్ ప్రయోగాలు చేస్తూ ప్రపంచానికి సవాల్ విసురుతున్నామని చెప్పారు. భారతదేశం త్వరలోనే అతిపెద్ద ఐటీ, మెడిసిన్ ఎగుమతిదారుగా మారనుందన్నారు. అనంతరం 22 మంది విద్యార్థులకు డాక్టరేట్లు, 17 మందికి బంగారు పతకాలు అందజేశారు.
సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: కిషన్ రెడ్డి
సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున∙తాము కూడా భాగస్వామ్యం అవుతామని తెలిపారు. సత్యసాయిబాబా 97వ జయంత్యుత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్, మల్టీమీడియా షోను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. సత్యసాయి బాబా జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఈ షో ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.