
అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టులో కీలకమైన తొలి ఫైట్ టెస్ట్ వెహికల్ అబోర్ట్ మిషన్-(టీవీ-డీ1)ను అక్టోబర్ 21న ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఫైట్ టెస్ట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశ్యం.. TV-D1 క్రూ మాడ్యూల్‌ను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపడం, తిరిగి దానిని భూమికి తీసుకురావడం. క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్‌లను రాకెట్ సాయంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వ చ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. అక్కడ్నుంచి వ్యోమగాములు పారాచూట్ల సాయంతో శ్రీహరి కోటకు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతం తీరంలో దిగేలా ఏర్పాట్లు చేశారు.
🚨 ISRO's Gaganyaan mission first flight test TV-D1 is scheduled on 7-9 am October 21, 2023. pic.twitter.com/i1SJgVm0HZ
— Indian Tech & Infra (@IndianTechGuide) October 16, 2023
ఎల్‌వీఎం3 రాకె ట్ ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికా దళం సాయంతో క్రూ మాడ్యుల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్‌యాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో పేర్కొంది.
వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదిలో ప్రయోగించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. మూడు అన్ క్రూడ్ మిషన్‌లతో సహా దాదాపు 20 ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. తాజాగా గన్‌యాన్ మిషన్ పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మిషన్ సంసిద్ధత, భారత అంతరిక్ష ప్రయోగాల భవిష్యత్తుపై ఇస్రో చైర్మన్ సోమనాథ్‌తోపాటు ఇతర అధికారులతో సమీక్ష జరిగింది.