నేడు జీఎస్‌ఎల్‌వీ-డీ5 ప్రయోగం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో కీలక ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం సాయంత్రం 4.18 గంటలకు జీశాట్-14 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్‌ఎల్‌వీ(జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్)-డీ5 రాకెట్ నింగికి దూసుకుపోనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగానికి 29 గంటల కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 11.18 గంటలకు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కౌంట్‌డౌన్ సమయంలో శనివారం జీఎస్‌ఎల్‌వీ-డీ5 రాకెట్ రెండో దశలో 39.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. రాకెట్‌లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను ప్రయోగానికి ఆరు గంటల ముందు అప్రమత్తం చేస్తారు.
ఈ ప్రయోగాన్ని గతేడాది ఆగస్టు 19ననే చేపట్టాల్సి ఉండగా.. రాకెట్ రెండో దశలో ఇంధన లీకేజీ కారణంగా ఆఖరి గంటలో వాయిదా పడింది. ఇస్రో ఇంతవరకూ ఏడు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేపట్టగా.. రెండే విజయవంతం అయ్యాయి. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో కీలక దశ అయిన అప్పర్ క్రయోజెనిక్ దశను ఇస్రో స్వదేశీయంగానే తయారుచేసింది. షార్‌లో కౌంట్‌డౌన్ ప్రక్రియను శనివారం సాయంత్రం ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ పరిశీలించారు. ప్రయోగం నేపథ్యంలో షార్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మత్స్యకారులు ఆదివారం చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేశారు.
ప్రత్యేకతలు ఇవే...
జీఎస్‌ఎల్‌వీ డీ5 పొడవు: 49.13 మీటర్లు
బరువు: 414.75 టన్నులు ప్రయోగం ఖర్చు: రూ.205 కోట్లు
(రాకెట్‌కు రూ.160 కోట్లు, ఉపగ్రహానికి రూ.45 కోట్లు)
జీశాట్-14 బరువు:1,982 కిలోలు పనిచేసే కాలం: 12 ఏళ్లు