14న చంద్రయాన్‌–3 ప్రయోగం | ISRO moon mission: Chandrayaan-3 spacecraft integrated with launch vehicle | Sakshi
Sakshi News home page

14న చంద్రయాన్‌–3 ప్రయోగం

Published Fri, Jul 7 2023 4:30 AM | Last Updated on Fri, Jul 7 2023 7:54 AM

ISRO moon mission: Chandrayaan-3 spacecraft integrated with launch vehicle - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): కీలకమైన చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని ఈ నెల 14న చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) గురువారం తెలిపింది. మొదటగా ఈ నెల 12న అని ప్రకటించింది. ఆ తర్వాత 13కు వాయిదా వేసింది. తాజాగా, 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగం ఉంటుందని షార్‌ వర్గాలు ప్రకటించాయి.

స్వల్ప సాంకేతిక లోపాలను సరిచేసుకోవడంతో పాటు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే సమయంలోనే ప్రయోగిస్తారనే వాదన కూడా ఉంది. 2019లో చంద్రయాన్‌–2ను కూడా జులై 15న ప్రయోగించారు. షార్‌లోని రెండో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ (వ్యాబ్‌)లో రాకెట్‌ అనుసంధానం పూర్తి చేసి గురువారం ఉదయాన్నే వ్యాబ్‌ నుంచి ప్రయోగవేదికకు అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.

పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను 4 దశల్లో ప్రయోగిస్తే అదే జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను మాత్రం 3 దశల్లోనే ప్రయోగిస్తారు. పీఎస్‌ఎల్‌వీ కంటే జీఎస్‌ఎల్‌వీ–మార్క్‌–2 రాకెట్‌ కొంచెం బరువు ఎక్కువ, 2 వేల కిలోలు బరువున్న ఉపగ్రహాలు తీసుకెళుతుంది. అదే ఎల్‌వీఎం మార్క్‌–3 అత్యంత శక్తివంతమై రాకెట్‌. ప్రెంచి గయానా కౌరు అంతరిక్ష కేంద్రం రూపొందించి ఏరియన్‌–5 రాకెట్‌ తరహాలో వుంటుంది.

మూడు వేలు కిలోల నుంచి 6 వేలు కిలోల బరువైన ఉపగ్రహాలను సునాయాసంగా రోదసీలోకి తీసుకెళ్లగలుగుతుంది. ఈ రాకెట్‌కు అత్యంత శక్తివంతమైన రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లు వుంటాయి. ఒక్కో స్ట్రాపాన్‌ బూస్టర్‌లో 200 టన్నుల ఘన ఇంధనం వుంటుంది. మొదటిదశలో రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లలో వున్న 400 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశను పూర్తి చేస్తారు.

110 టన్నుల ద్రవ ఇం««ధనంతో (ఎల్‌–110)తో రెండోదశను, 25 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనం (సీ–25)తో మూడోదశతో ప్రయోగాన్ని పూర్తి చేసేలా ఈ రాకెట్‌ను రూపకల్పన చేశారు. ప్రయోగానికి ముందు తుది విడత మిషన్‌ సంసిద్ధతా సమావేశాన్ని 11న నిర్వహించనున్నారు. అనంతరం ప్రయోగ సమయాన్ని, కౌంట్‌డౌన్‌ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ఈనెల 14న ప్రయోగమని తెలిపారు.

ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్‌ ప్రయోగసమయంలో 640 టన్నులు బరువు కలిగి వుంటుంది. 3,900 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్‌–3 ఉçపగ్రహాన్ని నింగివైపు మోసుకెళ్లనుంది. చంద్రయాన్‌–3 ఉపగ్రహంలో 2,148 కిలోలు బరువు కలిగిన ప్రపోల్షన్‌ మా డ్యూల్, 1,752 కిలోలు బరువు కలిగిన ల్యాండర్, 26 కిలోలు బరువు కలిగిన రోవర్‌లను అమర్చి పంపుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి 60 శాతం పనుల వరకు దేశంలోని 120 ప్రయివేట్‌ పరిశ్రమల సహకారం తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement