జాబిలమ్మ మీదకు చంద్రయాన్‌–2  | Indian Scientists Are Preparing For The Ambitious Chandrayaan 2 Launch Which Will Be Launched At 2.43 PM On Monday. | Sakshi
Sakshi News home page

జాబిలమ్మ మీదకు చంద్రయాన్‌–2 

Published Mon, Jul 22 2019 11:36 AM | Last Updated on Mon, Jul 22 2019 11:36 AM

Indian Scientists Are Preparing For The Ambitious Chandrayaan 2 Launch Which Will Be Launched At 2.43 PM On Monday. - Sakshi

షార్‌లోని రెండో ప్రయోగవేదికపై ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్న చంద్రయాన్‌–2 ప్రయోగానికి సంబంధించి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 15న వేకువజామున 2.51 గంటలకు  ప్రయోగించాలని అనుకున్న చంద్రయాన్‌–2 మిషన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. వారం రోజులు తిరగకముందే మళ్లీ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌  ప్రక్రియను ప్రారంభించారు.

సాక్షి, సూళ్లూరుపేట (శ్రీహరికోట): జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ ద్వారా ‘త్రీ–ఇన్‌–వన్‌గా చెప్పకునే ఆర్బిటర్, ల్యాండర్‌ (విక్రమ్‌), రోవర్‌ (ప్రజ్ఞాన్‌) కాంపోజిట్‌ ఎర్త్‌స్టాక్‌ (పీఈఎస్‌)ను జాబిల్లి మీదకు పంపించే సమయం ఆసన్నమైంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3, ఎం1 రాకెట్‌ 16.22 నిమిషాల తరువాత భూమికి దగ్గరగా (పెరిజీ) 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 38,000 కిలోమీటర్లు ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్‌ ఆర్బిట్‌ (అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి ప్రవేశపెడుతుంది. ఈ ప్రయోగం జరిగిన 16 రోజుల్లో అపోజిని 38,000 కిలోమీటర్లు నుంచి 1,41,000 పెంచేందుకు ఆర్బిటర్‌ను మం డించి నాలుగుసార్లు కక్ష్యదూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్‌కు ట్రాన్స్‌ లూ నార్‌ ఇంజెక్షన్‌ ద్వారా చంద్రుడివైపు ప్రయాణం చేసేందుకు మళ్లి స్తారు. తదనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు చంద్రునికి చుట్టూరా రెట్రోబర్న్‌ చేసి వంద కిలోమీటర్లు వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి నాలుగుసార్లు ఆపరేషన్‌ చేపడతారు. 100 కిలోమీటర్లు నుంచి 30 కిలోమీటర్లు ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్‌ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయి చంద్రుడి మీదకు ప్రయాణం చేస్తుంది.

చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దిగుతుంది. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయిన తరువాత ల్యాండర్‌ను 15 నిమిషాల పాటు మండించి దాన్ని చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియను చేపడతారు. అయితే ఈ 15 నిమిషాలనే ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. చంద్రయాన్‌–1లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే చంద్రయాన్‌–2లో ఉపయోగించారు. అయితే ఇందులో ల్యాండర్‌ను చంద్రుడిపై దించే ప్రక్రియను నూతనంగా రూపొందించారు. చంద్రయాన్‌–1కి చంద్రయాన్‌–2కు మధ్య 15 నిమిషాల వ్యవధి అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయే కీలకమైన సమయంలో ఎలాంటి సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతాయోనని ఇస్రో శాస్త్రవేత్తల్లో కొంత ఆందోళనగా ఉంది. ఈ 15 నిమిషాల సమయాన్ని అధిగమించేందుకు  ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్‌–అబల్‌ అనే లిక్విడ్‌ ఇంజిన్లను ఉపయోగించనుంది.  చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ మృదువైన  చోట ల్యాండ్‌ అయిన తరువాత రోవర్‌ లోపల ఉండే తలుపు తెరుచుకునే విధంగా డిజైన్‌ చేశారు. ల్యాండర్‌ నుంచి రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై రావడానికి సుమారు నాలుగు గంటల సమయాన్ని తీసుకుని మరీ బయటకు వస్తుంది.

రోవర్‌ సెకెన్‌కు ఒక సెంటీమీటర్‌ వేగంతో కదులుతుంది. రోవర్‌ ఒక లూనార్‌ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్‌ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మాలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. అయితే ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్‌ నాలుగోదేశంగా ఖ్యాతి గడించనుంది. ఇప్పటి దాకా రష్యా, అమెరికా, చైనాకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశారు.  చంద్రయాన్‌–1 పేరుతో ఉపగ్రహాన్ని చంద్రుడికి చుట్టూ పరిభ్రమించేలా చేసిన మొట్ట మొదటి దేశంగా భారత్‌కు పేరుంది. ఇప్పుడు చంద్రయాన్‌–2 పేరుతో ఆర్బిటర్‌ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్‌ ద్వారా రోవర్‌ను పంపించే నాలుగోదేశంలో అవతరించనుంది. మూడింటిని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్‌ వన్‌ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement