
జీఎస్‌ఎల్వీ డీ6 ప్రయోగం సక్సెస్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష కీర్తి కీరిటంలో మరో కలికితురాయి చేరింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయోజనిక్ దశతో వరుసగా రెండోసారి విజయాన్ని అందుకుంది. ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్వీ డీ6 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది.
గురువారం సాయంత్రం 4.52 గంటలకు జీఎస్‌ఎల్వీ డీ6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. జీశాట్-6 ఉపగ్రహాన్ని 1,024 సెకన్ల తర్వాత నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. మిషన్ డైరెక్టర్ ఉమామహేశ్వరన్ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు.
ఈ ప్రయోగంతో ద్వారా డిజిటల్ మల్టీమీడియాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో తెలిపింది. జీశాట్-6 ఉపగ్రహం 9 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. దేశ కమ్యూనికేషన్ వ్యవస్థలో 25వ శాటిలైట్ గా జీశాట్-6 నిలవనుంది. ఈ ప్రయోగానికి రూ.250 కోట్లు వ్యయం అయింది.