షార్‌లోని రెండో ల్యాంచ్‌ప్యాడ్ వద్ద పహారాలో ఉన్న భద్రతా సిబ్బంది
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశానికే తలమానికమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో కూడా అప్రమత్తత ప్రకటించారు. షార్‌కు నిత్యం పహారా కాస్తున్న కేంద్ర ప్రాథమిక భద్రతా సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ సుభాష్ సిన్హా తెలిపారు. హైఅలర్ట్‌తో సిబ్బంది నిత్యం మరో మూడు గంటలపాటు అదనంగా విధులు నిర్వహిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులను అప్రమత్తం చేశారు. షార్ ఐల్యాండ్‌కు దక్షిణాన పల్‌వేరికాడ్ వైపు, ఉత్తరాన రాయదొరువు వైపు, సముద్రతీరప్రాంతం వైపు ప్రత్యేకంగా సాయుధ దళాలను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి భద్రతా సిబ్బందితో నాలుగు మొబైల్ పార్టీలను గస్తీ ఏర్పాటు చేశారు.
బకింగ్‌హాం కెనాల్, అటకానితిప్ప, షార్ పరిసర ప్రాంతాల్లోనూ గస్తీని ముమ్మరం చేశారు. పులికాట్ సరస్సులో, బంగాళాఖాతంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని జాలర్లకు ఆదేశాలిచ్చారు. షార్‌లోకి అపరిచిత వ్యక్తులు చొచ్చుకు రాకుండా చూసేందుకు కూడా సరిహద్దుల్లో సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. షార్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.