ఇక ఇస్రో నుంచి భారీ ప్రయోగాలు! | Massive experiments from ISRO | Sakshi
Sakshi News home page

ఇక ఇస్రో నుంచి భారీ ప్రయోగాలు!

Published Tue, Jul 3 2018 2:38 AM | Last Updated on Tue, Jul 3 2018 2:38 AM

Massive experiments from ISRO - Sakshi

షార్‌లో రెండో వెహికల్‌ బిల్డింగ్‌

శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఇప్పటికే ఎన్నో విజయవంతమైన రాకెట్‌ ప్రయోగాలతో చరిత్ర సృష్టించిన శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.628.95 కోట్ల వ్యయంతో రెండో వెహికల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌ (ఎస్‌వీఏబీ)ని నిర్మించారు. దీని ద్వారా రెండు రాకెట్లను అనుసంధానం చేయొచ్చు. ఈ నెల 22న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు.

రెండో వెహికల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌ (ఎస్‌వీఏబీ)లో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్లు, సుమారు ఐదు కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాలను కూడా ప్రయోగించేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. చంద్రయాన్‌–2 లాంటి భారీ ప్రయోగాలకు కూడా ఎస్‌వీఏబీ వేదిక కానుంది. ఏటా నాలుగు జీఎస్‌ఎల్‌వీ, 12 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు కృతనిశ్చయంతో ఉన్నారు. 96 మీటర్లు ఎత్తు కలిగిన ఎస్‌వీఏబీలో అంతర్జాతీయ స్థాయి వసతులు ఉండేలా ఇస్రో శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి మంజూరైన రూ.628.95 కోట్లలో ప్లాట్‌పామ్‌లకు రూ.70 కోట్లు, డోర్లకు రూ.24 కోట్లు, బోగీలకు రూ.8 కోట్లు, క్రేన్‌కు రూ.22 కోట్లు, హాలర్‌ (టాక్టర్‌)కు రూ.10 కోట్లు, ట్రాక్‌కు రూ.23 కోట్లు, సర్వీస్‌ వ్యవస్థకు రూ.45 కోట్లు, సివిల్‌ పనులన్నింటికి కలిపి రూ.280 కోట్లు, మిగిలిన రూ.146.95 కోట్లు ఇతర ఖర్చులకు వెచ్చించారు. ప్రస్తుతం పెరిగిన మెటీరియల్‌ కాస్ట్‌తో మరో వంద కోట్లు దాకా బడ్జెట్‌ పెరిగింది.

వ్యోమగాములను పంపడానికి ఏర్పాట్లు
షార్‌లో రూ.245 కోట్ల వ్యయంతో మల్టీ ఆబ్జెక్టివ్‌ ట్రాకింగ్‌ రాడార్‌ కేంద్రాన్ని నిర్మించి గతేడాది ప్రారంభించారు. ఒకేసారి పది రాకెట్‌లను ట్రాకింగ్‌ చేసే సామర్థ్యం కలిగిన ఎంఓటీఆర్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రపంచంలో ఎంఓటీఆర్‌ ఉన్న రెండో దేశంగా భారత్‌ ఆవిర్భవించింది. ఘన ఇంధనం తయారీకి అవసరమైన వాటిని రూ.226 కోట్లతో నిర్మించేందుకు ఇటీవలే టెండర్ల ప్రక్రియను ముగించారు. మరో ఏడాదిన్నరలో వీటిని పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే వ్యోమనౌకను ప్రయోగాత్మకంగా ప్రయోగించి విజయం సాధించడంతో షార్‌లోనే స్పేస్‌ షటిల్‌కు కావాల్సిన రన్‌వేను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాబోయే పదేళ్లలో ఇక్కడి నుంచే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే ఇస్రోకు గుండెలాంటి షార్‌ ప్రపంచ స్థాయి రాకెట్‌ ప్రయోగ కేంద్రంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement