ప్రపంచ దేశాల చూపు భారత్‌ వైపు..! | Chandrayaan 2 Experiment After Midnight Today | Sakshi
Sakshi News home page

మూన్‌పై మన మార్క్‌

Published Sun, Jul 14 2019 7:24 AM | Last Updated on Sun, Jul 14 2019 12:40 PM

Chandrayaan 2 Experiment After Midnight Today - Sakshi

రేదొరా నిను చేరగా..!
అంతరిక్షంలో.. ఎన్నో వింతలు..విశేషాలు..మరెన్నో అద్భుతాలు..వాటిని శోధించేందుకు అగ్రదేశాల పోటీ. వాటికి దీటుగా భారత్‌ ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసింది. ఇస్రోను ప్రధాన ఆయుధంగా మలుచుకుని వినువీధిలో ఎదురులేని శక్తిగా నిలిచింది. 1970లో రష్యా వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపారు. ఆ తర్వాత అమెరికా,చైనా దేశాలు చంద్రునిపై ప్రయోగాలు చేశాయి. 2008లో జిల్లాలోని షార్‌ వేదికగా చంద్రయాన్‌–1ను ఇస్రో విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి పంపిన తర్వాతే నీటిజాడలు వెలుగుచూశాయి. ఆ తర్వాత మంగళ్‌యాన్‌––1ను అంగారకుడి కక్ష్యలోకి పంపింది. నేడు చంద్రయాన్‌–2తో  చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ శోధనలు చేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. దీనికి వేదికవుతోంది షార్‌.  భారతదేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసే ఈ ప్రయోగంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా శ్రీహరికోట వైపు చూస్తున్నాయి.     – సూళ్లూరుపేట

సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు భవిష్యత్‌ అంతా భారీ ప్రయోగాలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 వంటి భారీ ఉపగ్రహ వాహకనౌకను రూపొందించేందుకు 2000 సంవత్సరం నుంచి కృషి చేసి పరిపక్వతను సాధించగలిగారు. తొలుతగా 2014 డిసెంబర్‌ 23 జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ను ప్రయోగాత్మకంగా ప్రయోగించి నిర్ధారించుకున్నారు. ఆ ప్రయోగంలో ఎస్‌–200, ఎల్‌–110 సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. అందులో సీ–25 లేకుండా క్రూ మాడ్యూల్‌ను పంపించి మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టి విజయవంతం చేశారు. ఆ తర్వాత 2017 జూన్‌ 5న జీఎస్‌ఎల్‌వీ–మార్క్‌3డీ1 ద్వారా 3,136 కిలోల బరువు కలిగిన జీశాట్‌–19 అనే సమాచార ఉపగ్రహాన్ని,  నవంబర్‌ 14న మార్క్‌ 3డీ2 ద్వారా 3,700 కిలోల బరువు కలిగిన జీశాట్‌–29 అనే సమాచార ఉపగ్రహాన్ని సునాయాసంగా ప్రయోగించారు. ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగాలు విజయాలు సాధించాయంటే అది 19 ఏళ్ల కఠోర శ్రమకు ఫలితమని చెప్పొచ్చు.

కీలక దశల్లో స్ట్రాపాన్‌ బూస్టర్ల తయారీలో పరిణితి
ఇందులో కీలకంగా మారిన మొదటి దశ 200 టన్నుల ఘన ఇంధనాన్ని నింపిన రెండు ఎస్‌–200 స్ట్రాపాన్‌ బూస్టర్ల అవసరాన్ని గుర్తించారు. మామూలుగా పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్లలో మొదటి దశలో సుమారు 138, 142 టన్నుల ఘన ఇంధనాన్ని వాడతారు.  M మార్క్‌–3 రాకెట్‌లో అయితే 400 టన్నుల ఘన ఇంధనాన్ని నింపిన రెండు బూస్టర్లు అవసరం కావడంతో వీటిని షార్‌లోని ఘన ఇంధనం తయారీ విభాగం (స్ప్రాబ్‌)లోనే తయారు చేశారు. 2000 నుంచి 2010 వరకు దీనికి ఏమి అవసరముంటుందో గుర్తించి 2010 జనవరి 24న ఎస్‌–200 స్ట్రాపాన్‌ బూస్టర్లకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. రెండో దశలో ఉపయోగించే 110 టన్నుల ద్రవ ఇంధనం నింపిన మోటార్లు (ఎల్‌–110) వాడతారు. మామూలు ప్రయోగాల్లో అయితే 40 టన్నులకు మించి వాడరు. ఇక్కడేమో ఉపగ్రహం బరువును బట్టి రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తారు.

ఎల్‌–110ను తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్‌ ప్రపొల్లెంట్‌ స్పేస్‌ సెంటర్‌లో తయారు చేసి 2010 మార్చి 5న భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. ఇక మూడో దశలో అత్యంత శక్తివంతమైన క్రయోజనిక్‌ ఇంజిన్లను వినియోగిస్తారు. దీన్ని ఇస్రో పరిభాషలో సీ–25గా పిలుస్తారు. మామూలుగా జీఎస్‌ఎల్‌వీలో 12.5 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనాన్ని వినియోగిస్తే అదే మార్క్‌–3కు వచ్చే సరికి రెట్టింపు క్రయో ఇంధనం అంటే 25 టన్నుల ఇంధనాన్ని వినియోగిస్తారు. 12.5 టన్నుల బరువు కలిగిన క్రయోజనిక్‌ దశను రూపొందించేందుకు మన శాస్త్రవేత్తలు తీవ్రమైన కృషి చేశారు. 25 టన్నుల క్రయో దశను రూపొందించేందుకు రెండేళ్ల వ్యవధిని తీసుకున్నారు. సీ–25లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించడంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాప్తి చెందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇస్రోకు బాహుబలి రాకెట్‌గా పేరు పొందిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 సిరీస్‌లో ఇది మూడో ప్రయోగం కావడం విశేషం. ప్రస్తుతం సుమారు నాలుగు టన్నుల బరువు కలిగిన  చంద్రయాన్‌–2 మిషన్‌ను ముచ్చటగా మూడో సారి రోదసీలోకి తీసుకెళ్లేందుకు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3–ఎం1 రాకెట్‌ ద్వారానే నిర్వహించనున్నారు.   

గగన్‌యాన్‌ లక్ష్యంగా ...
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2022 నాటికి మానవ సహిత ప్రయోగాలే (గగన్‌యాన్‌) లక్ష్యంగా 2014, 2016, 2018 సంవత్సరాల్లో మూడు రకాల ప్రయోగాత్మక ప్రయోగాలు చేసి ముందంజల్లో నిలిచింది. గగన్‌యాన్‌ ప్రయోగానికి సంబంధించి భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు నిధులు కేటాయించడంతో ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. గగన్‌యాన్‌ తరహా ప్రయోగాలను నిర్వహించేందుకు 2014 డిసెంబర్‌ 18నే బీజం పడింది. భవిష్యత్‌లో గగన్‌యాన్‌ ప్రయోగాలు చేసేందుకు ముందుస్తుగానే జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 వంటి భారీ రాకెట్‌ను, ఆర్‌ఎల్‌వీ టీడీ, పాడ్‌ అబార్ట్‌ టెస్ట్‌ వంటి మూడు ప్రయోగాత్మక ప్రయోగాలను చేపట్టి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు మంచి జోష్‌ మీదున్నారు.
  
ఆర్‌ఎల్‌వీ టీడీ ప్రయోగమూ విజయమే 
సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 2016 మే 23న రియూజబుల్‌ లాంచింగ్‌ వెహికల్‌–టెక్నికల్‌ డిమాన్‌స్ట్రేటర్‌ (ఆర్‌ఎల్‌వీ–టీడీ) విజయవంతంగా ప్రయోగించారు. ఈ తరహా రాకెట్‌ 12 టన్నుల బరువుతో పయనమై 56 కిలో మీటర్లు ఎత్తుకెళ్లిన తర్వాత శిఖర భాగాన అమర్చిన 550 కిలోల బరువు కలిగిన హైపర్‌ సోనిక్‌ పైలట్‌ను విడుదల చేసింది. ఆ పైలట్‌ 65 కిలో మీటర్లు ఎత్తుకెళ్లి తిరిగి తీసుకువచ్చేందుకు రన్‌వే సౌకర్యం లేకపోవడంతో ప్రయోగాత్మకంగా హైపర్‌ సోనిక్‌ పైలట్‌ను శ్రీహరికోట రాకెట్‌ కేంద్రానికి 450 కిలో మీటర్లు దూరంలో బంగాళాఖాతంలో దిగ్విజయంగా దించారు. దీనికి ఇండియన్‌ కోస్టల్‌ గారŠుడ్స, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ వారు సముద్రం మీద విండ్‌ మెజర్‌మెంట్, షిప్‌ బర్న్‌ టెలీమేట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు. వ్యోమనాట్స్‌ను రోదసీలో వదిలి పెట్టి మళ్లీ క్షేమంగా తీసుకురావడానికి ఉపయోగపడే రియూజబుల్‌ లాంచింగ్‌ వెహికల్‌–టెక్నికల్‌ డిమాన్‌స్ట్రేటర్‌ (ఆర్‌ఎల్‌వీ–టీడీ) ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా చేసి నిర్ధారించుకున్నారు.  

గగన్‌యాన్‌ ప్రయోగం కోసమే పాడ్‌ అబార్ట్‌ టెస్ట్‌ 
మానవ సహిత ప్రయోగాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు 2018 జూలై 4న ‘ప్యాడ్‌ అబార్ట్‌ టెస్ట్‌’ ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా విజయవంతంగానే నిర్వహించారు. ‘ ప్యాడ్‌ అబార్ట్‌æ టెస్ట్‌’ ప్రయోగాన్ని 259 సెకండ్ల పాటు రాకెట్‌ను నాలుగు దశల్లో మండించి రెండు కిలో మీటర్లు మేర అంతరిక్షం వైపునకు  తీసుకెళ్లి ప్యారాచూట్‌ల ద్వారా క్రూ మాడ్యూల్‌ను బంగాళాఖాతంలోకి దించారు. అక్కడ రెండు చిన్నపాటి పడవల్లో ఇస్రో శాస్త్రవేత్తలు వేచి ఉండి వాటిని రికవరీ చేశారు. అయితే ఈ ప్రయోగంలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకున్నప్పటికీ విజయవంతగానే నిర్వహించారు. క్రూ మాడ్యూల్‌ను సముద్రంలో దించే సమయంలో సుమారు 10 నిమిషాల ముందే వదిలేయడంతో మాడ్యూల్‌ కిందభాగం కొద్దిగా దెబ్బతింది. అయితే వ్యోమగాములే ఉంటే దీని వల్ల ఇబ్బందేమీ ఉండదని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. 

మానవ సహిత ప్రయోగాల్లో ప్రమాదాల నివారణకే ప్రయోగాలు 
2003లో యూఎస్‌ఏకు చెందిన కొలంబియా స్పేస్‌ షటిల్‌ వ్యోమగాములను విజయవంతంగా రోదసీలోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తిరిగి భూమికి చేరుకునే సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే ఉష్ణోగ్రతల్లో తేడాలు వచ్చి ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోయింది. ఇందులో ఆమెరికా వ్యోమగాములతో పాటు భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా కొన్ని పరీక్షలు చేసుకుంటున్నారు. ఈ పరీక్షల్లో భాగంగా ఇద్దరు వ్యోమగాములను భూ సమీప కక్ష్యలోకి పంపించి వారిని సురక్షితంగా ముందుగా నిర్ణయించిన ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి. ఆ సమయంలో రాకెట్‌ ఎలా పని చేస్తుంది. వాతావరణంలోని మార్పులు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ‘ప్యాడ్‌ అబార్ట్‌ టెస్ట్‌’ ప్రయోగాన్ని నిర్వహించి వాటి వివరాలను ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

భవిష్యత్‌లో వ్యోమగాములను రోదసీలోకి పంపి మళ్లీ తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు క్రూ మాడ్యూల్, ఆర్‌ఎల్‌వీ–టీడీ, పాడ్‌ అబార్ట్‌ టెస్ట్‌ అనే మూడు రకాల  ప్రయోగాత్మక ప్రయోగాలతో సాంకేతిక పరంగా పట్టు సాధించారు. ఈ మూడు ప్రయోగాలకు సుమారు రూ.170 కోట్ల దాకా వ్యయం చేశారని తెలుస్తోంది. అయితే మానవ సహిత ప్రయోగాలను నిర్వహించేందుకు మరో రెండు మానవ రహితంగా ప్రయోగాత్మక ప్రయోగాలు చేసి నిర్ధారించుకున్న తర్వాత గగన్‌యాన్‌ ప్రయోగానికి సిద్ధమయ్యేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఇస్రో ఇటీవల కాలంలో చేసే ప్రతి ప్రయోగాత్మక ప్రయోగం మొదటి ప్రయత్నంలోనే విజయవంతం అవుతుండడంతో యావత్‌ ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోంది.

2000లో మార్క్‌–3కి బీజం
సుమారు 3 వేల నుంచి 5 వేల కిలోల బరువు కలిగిన కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌తో పాటు, మానవుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు, చంద్రుడు, అంగారకుడి మీద పరిశోధనల నిమిత్తం చంద్రయాన్‌–2 వంటి మిషన్‌ పంపేందుకు మార్క్‌–3 వంటి భారీ ఉపగ్రహ వాహకనౌక అవసరమని 2000లో గుర్తించి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. 2003లో దీనికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడమే కాకుండా బడ్జెట్‌లో రూ. 3 వేల కోట్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా షార్‌లోనే రూ.700 కోట్లతో ఈ ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. 

షార్‌కు దేశ ప్రథమ పౌరుడు రాక
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు అత్యంత కీలక కేంద్రమైన సతీష్‌ ధవన్‌స్పేస్‌ (షార్‌) సెంటర్‌కు దేశ ప్రథమ పౌరుడు రామనాథ్‌ కోవింద్‌ రానున్నారు. షార్‌ను ఇప్పటికి మగ్గురు రాష్ట్రపతులు సందర్శించగా ప్రస్తుతం నాల్గో రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఈ నెల 14న షార్‌ను సందర్శించనున్నారు. అయితే షార్‌ను సందర్శించిన భారత శాస్త్రవేత్త డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం ఇస్రో శ్రీహరికోట నుంచి చేపట్టిన మొట్టమొదటి ఎస్‌ఎల్‌వీ–3డీ1 ప్రయోగ సమయంలో ఆ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా, శాస్త్రవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి హోదాలో షార్‌లో రెండో ప్రయోగ వేదికను ప్రారంభించేందుకు విచ్చేశారు. అయితే ఆయన స్వతహాగా శాస్త్రవేత్త కావడంతో రాష్ట్రపతి హోదాలోనే పలుమార్లు ప్రయోగాలను వీక్షించేందుకు విచ్చేసిన సందర్భాలున్నాయి. సుమారు రూ.30 కోట్లతో నిర్మించిన రెండో ప్రయోగ వేదికను 05–05–2005న ఆయన చేతులు మీదుగా ప్రారంభించారు.

అదే రోజున రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ06 ద్వారా కార్టోశాట్‌–1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అయితే ఆయన ఆ సమయంలో 4వ తేదీనే షార్‌కు చేరుకుని ప్రయోగ పనుల్లో కూడా పాలుపంచుకోవడం విశేషం. ఆ తర్వాత 2012 జనవరి 2న అప్పటి రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభాపాటిల్‌ కూడా షార్‌ కేంద్రాన్ని సందర్శించారు. భవిష్యత్‌లో భారీ ప్రయోగాల దృష్ట్యా షార్‌లో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు రూ. 20 కోట్లతో నిర్మించిన న్యూ మిషన్‌ కంట్రోల్‌రూంను ఆమె చేతులు మీదుగా అప్పట్లో ప్రారంభించారు. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 25న అప్పటి రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్‌ముఖర్జీ పీఎస్‌ఎల్‌వీ సీ20 ప్రయోగానికి వీక్షించేందుకు విచ్చేశారు. అయితే ఆయన కేవలం ప్రయోగాన్ని వీక్షించేందుకు మాత్రమే వచ్చి వెళ్లారు. ప్రస్తుత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఈ నెల 14న షార్‌ కేంద్రాన్ని సందర్శించిన నాలుగో రాష్ట్రపతి కావడం విశేషం. షార్‌లో ఇటీవల రూ.695 కోట్లతో నిర్మించిన రెండో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ను ప్రారంభించేందుకు షార్‌ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14న సాయంత్రం సెకండ్‌ వ్యాబ్‌ను ప్రారంభించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement