పీఎస్‌ఎల్‌వీ సీ-36 ప్రయోగం నేడు | PSLV C experiment -36 today | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్‌వీ సీ-36 ప్రయోగం నేడు

Published Wed, Dec 7 2016 4:41 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

పీఎస్‌ఎల్‌వీ సీ-36 ప్రయోగం నేడు

పీఎస్‌ఎల్‌వీ సీ-36 ప్రయోగం నేడు

- నిర్విఘ్నంగా కొనసాగుతున్న కౌంట్‌డౌన్
- ఉదయం 10.25 గంటలకు నాలుగు దశల్లో ప్రయోగం
 
 శ్రీహరికోట (సూళ్లూరుపేట):
భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 10.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-36 ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. సోమవారం రాత్రి 10.25 గంటలకు ప్రారంభించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 36 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్‌ఎల్‌వీ సీ-36 రాకెట్ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 17.9 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ-36 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించనున్నారు. ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువును తీసుకుని రాకెట్ భూమి నుంచి నింగికి పయనమవుతుంది.

ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనంతోపాటు కోర్‌అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనం సాయంతో 110.48 సెకన్లకు మొదటిదశను పూర్తి చేస్తారు. ఆ తరువాత 41.7 టన్నుల ద్రవ ఇంధనంతో 261.9 సెకన్లకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 521.7 సెకన్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1,028.26 సెకన్లకు నాలుగోదశను పూర్తి చేసే విధంగా లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. అనంతరం నాలుగోదశకు శిఖరభాగంలో పొందికగా అమర్చిన 1,235 కిలోల బరువు కలిగిన రిసోర్స్‌శాట్-2ఏ 1,075.26 (17.9 నిమిషాల్లో) సెకన్లకు భూమికి 827 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో 98.719 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు భవిష్యత్తులో ఇంధనం బరువు తగ్గించి ఉపగ్రహాల బరువును పెంచేందుకు ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు.

 రిసోర్స్‌శాట్-2ఏతో ఉపయోగాలు
 2003 అక్టోబర్ 10న పీఎస్‌ఎల్‌వీ సీ5 ద్వారా రిసోర్స్‌శాట్-1, 2011 ఏప్రిల్ 20న పీఎస్‌ఎల్‌వీ సీ16 ద్వారా రిసోర్స్‌శాట్-2 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ రెండు ఉపగ్రహాలకు అనుసంధానంగా 1,235 కిలోలు బరువు కలిగిన రిసోర్స్‌శాట్-2ఏ రోదసీలోకి పంపుతున్నారు. భూమిపై జలవనరులు, అర్బన్ ప్లానింగ్, వ్యవసాయ రంగం, రక్షణశాఖకు ఎంతో ఉపయోగకరంగా మూడు ఉపగ్రహాలు ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఉపగ్రహంలో మూడు రకాల పేలోడ్‌‌స (త్రీ టైర్ ఇమేజింగ్ సిస్టం) అమర్చి పంపుతున్నారు. ఇందులో లీనర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్స్ (లిస్-3), (లిస్ -4) అనే రెండు పేలోడ్‌‌సతోపాటు అడ్వాన్‌‌సడ్ వైడ్ ఫీల్డ్ సెన్సార్ పరికరాలను అమర్చి పంపుతున్నారు. ప్రస్తుతం రెండు ఉపగ్రహాలు ఒకచోటును స్కానింగ్ చేసిన తరువాత మళ్లీ అదే చోటును స్కానింగ్ చేయడానికి 24 రోజుల సమయం పడుతుంది. రిసోర్స్‌శాట్-2ఏ ఉపగ్రహ సేవలు అందుబాటులోకి వస్తే మూడు ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై 12 రోజులకు ఒకసారి లోకేట్ చేస్తుంది. అంటే భూమిపై వనరుల విషయంలో అత్యుత్తమైన సేవలు అందిస్తాయి.
 
 నమూనా రాకెట్‌కు పూజలు
 సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం పీఎస్‌ఎల్‌వీ సీ36 నమూనా రాకెట్‌కు పూజలు చేశారు. ఇస్రో డెరైక్టర్లు కనుంగు, అర్జునన్, సిబ్బంది నమూనా రాకెట్‌ను మంగళవారం గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement