హైదరాబాద్ : ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. గురువారం ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ32 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ32 రాకెట్ ను నింగిలోకి విజయవంతగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 20 నిమిషాల తర్వాత రాకెట్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 1425 కిలోలు బరువు కలిగిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1ఎఫ్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ32 రోదసీలోకి మోసుకెళ్లింది. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇక పీఎస్ఎల్వీ సీ-32 ప్రయోగం విజయవంతంతో షార్లో సంబరాలు జరుపుకుంటున్నారు.