
పీఎస్‌ఎల్‌వీ సీ-36 కౌంట్‌డౌన్ ప్రారంభం
- బుధవారం ఉదయం 10.25 గంటలకు ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 10.25 గంట లకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ-36 ఉపగ్రహ వాహక నౌకకు 36 గంటల ముందు సోమవారం రాత్రి 10.25 కౌంట్‌డౌన్ ప్రారంభించారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్‌ఆర్ కమిటీ ఆధ్వర్యంలో మిషన్ సంసిద్ధతా సమావేశాన్ని నిర్వహించి ప్రయోగంలో కొన్ని మార్పులు చేశారు. రాకెట్‌లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు నిర్వహించి సమావేశంలో ప్రయోగపనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ కున్హికృష్ణన్‌కు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో రాకెట్‌కు లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి చిన్న మార్పులు చేశారు.
పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల సిరీస్‌లో ఇది 38వ ప్రయోగం. 1994-2016 నుంచి ఇప్పటిదాకా 121 ఉపగ్రహాలను రోదసీలోకి పంపారు. ఇందులో 42 స్వదేశీ, 79 విదేశీ ఉపగ్రహాలు కావడం విశేషం. 2003 అక్టోబర్ 10న పీఎస్‌ఎల్‌వీ సీ5 ద్వారా రిసోర్స్‌శాట్-1, 2011 ఏప్రిల్ 20న పీఎస్‌ఎల్‌వీ సీ-16 ద్వారా రిసోర్స్‌శాట్-2ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆ రెండు ఉపగ్రహాలకు ఫాలోఅప్‌గా బుధవారం రిసోర్స్‌శాట్-2ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.