
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిలో రెండో ప్రయోగానికి సిద్ధమవుతోంది. కరోనా పూర్తిగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రయోగాల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో పీఎస్‌ఎల్‌వీ–సీ53 ప్రయోగం ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ ప్రయోగంలో ఈవోఎస్ (అకా ఓషన్‌శాట్–3) అనే ఉపగ్రహంతో పాటు మరో 5 చిన్న ఉపగ్రహాలను పంపనున్నారు.
ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోన్న స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ప్రయోగాన్ని మార్చి 15న ప్రయోగాత్మకంగా నిర్వహించి నిర్థారించుకున్న తరువాత మార్చి 25 నుంచి 31 లోపు ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాన్ని కూడా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.