
2017 నాటికి 12 ప్రయోగాలు
షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వెల్లడి
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నుంచి 2017వ సంవత్సరానికి 12 ప్రయోగాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. 64వ గణతంత్ర వేడుకల అనంతరం ఆదివారం ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా షార్‌లో విలేకరులతో మాట్లాడారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం అభివృద్ధిలో భాగంగా రూ.250 కోట్ల వ్యయంతో మల్టీ ఆబ్జెక్టివ్ రాడార్ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైందని తెలిపారు. ఆయన తెలిపిన మరికొన్ని వివరాలు...
ఒకేసారి రెండు రాకెట్లు అనుసంధానం చేసేందుకు సెకెండ్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (స్వాబ్)ను రూ.360 కోట్లతో నిర్మించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ ఏడాదిలో ఐదు ప్రయోగాలకు సిద్ధం.
మార్చి రెండోవారంలో పీఎస్‌ఎల్‌వీ సీ24 రాకెట్‌ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ఉపగ్రహం, మేలో పీఎస్‌ఎల్‌వీ సీ26 ద్వారా జర్మనీకి చెందిన స్పాట్-07 ఉపగ్రహాన్ని, మళ్లీ ఆరు నెలల్లో మరో రెండు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను పంపనున్నాం.