ఒక రాకెట్‌.. 104 ఉపగ్రహాలు! | India to launch 104 satellites in record mission | Sakshi
Sakshi News home page

ఒక రాకెట్‌.. 104 ఉపగ్రహాలు!

Published Wed, Feb 15 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

ఒక రాకెట్‌.. 104 ఉపగ్రహాలు!

ఒక రాకెట్‌.. 104 ఉపగ్రహాలు!

► నేడే ఇస్రో అద్వితీయ ప్రయోగం
► ఉదయం 9.28కి నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్‌వీ సీ 37 రాకెట్‌ 
► రికార్డు స్థాయిలో ఒకే ప్రయోగంలో కక్ష్యలోకి 104 ఉపగ్రహాలు
► కార్టోశాట్‌ 2డీ సహా మూడు స్వదేశీ శాటిలైట్లు


అంతరిక్ష ప్రయోగాల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ప్రపంచస్థాయి ప్రయోగాలకు వేదికైన షార్‌ నుంచి, గెలుపు గుర్రం పీఎస్‌ఎల్‌వీ సీ 37 రాకెట్‌ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. రికార్డు స్థాయిలో ఒకే ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను గ‘ఘన’ ప్రయాణానికి సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 9.28 గంటలను ఇందుకు ముహూర్తంగా నిర్ణయించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలను నింగికి పంపిన దేశంగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది. ఇస్రో ఘన చరిత మరోసారి ప్రపంచానికి తేటతెల్లమవుతుంది.

ఆల్‌ ది బెస్ట్‌ ఇస్రో టీమ్‌..! ఆల్‌ ది బెస్ట్‌ ఇండియా..!!

శ్రీహరికోట (సూళ్లూరుపేట): రికార్డు స్థాయిలో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను నింగికి మోసుకెళ్లే అద్వితీయ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్  స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ ను మంగళవారం ఉదయం 5.28 గంటలకు ప్రారంభించారు. దాదాపు 28 గంటల కౌంట్‌డౌన్ నంతరం పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ప్రయోగం నాలుగు దశల్లో, 28.42 నిమిషాల్లో పూర్తయ్యేలా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది పీఎస్‌ఎల్‌వీకి 39వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా మూడు స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు.

714 కిలోల బరువైన కార్టోశాట్‌ 2డీ, ఇస్రో నానో శాటిలైట్స్‌ అయిన ఐఎన్ ఎస్‌–1ఏ, ఐఎన్ ఎస్‌–1బీలు స్వదేశీ ఉపగ్రహాలు. విదేశీ ఉపగ్రహాల్లో 96 అమెరికాకు చెందినవి కాగా, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం కూడా ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటున్నాయి. కార్టొశాట్‌ 2డీ ఉపగ్రహం రిమోట్‌ సెన్సింగ్‌ సేవలను ఐదేళ్ల పాటు అందిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను పంపిన తొలిదేశంగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది. గతంలో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకే రాకెట్‌తో 37 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించింది. జూన్ 2015లో ఇస్రో సైతం ఒకే ప్రయోగంలో 23 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

మంగళవారం ఉదయం కౌంట్‌డౌన్  ప్రారంభమైన వెంటనే రాకెట్‌కు నాలుగో దశలో అవసరమైన 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ దశలో మోనో మిథైల్‌ హైడ్రోజన్  (ఎంఎంహెచ్‌), మిక్స్‌డ్‌ ఆక్సిడైజడ్‌ ఆఫ్‌ నైట్రోజన్ (ఎంఓఎన్ –3) ఇంధనాన్ని నింపారు. అనంతరం నాలుగో దశకు అన్ని పరీక్షలు చేసి బాగుంది అని నిర్ధారించుకున్నాక సోమవారం రాత్రి  రెండోదశలో అవసరమైన 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. అనంతరం ఇంధనం నింపే ప్రక్రియను పూర్తి చేసి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్‌ ఫిల్లింగ్‌.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగానికి సిద్ధమవుతారు.

కాగా, మంగళవారం సాయంత్రం ఇస్రో చైర్మన్  ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ షార్‌ చేరుకుని కౌంట్‌డౌన్  ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రాకెట్‌కు తుదివిడత తనిఖీలు నిర్వహించారు. ఆ తరువాత సహచర సైంటిస్టులతో సమీక్ష నిర్వహించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమవ్వాలని దేశవ్యాప్తంగా ప్రజలు పూజలు, ర్యాలీల ద్వారా తమ ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సైతం దీనిపై భారీ చర్చ సాగుతోంది.

శ్రీవారి చెంత పూజలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో పీఎస్‌ఎల్‌వీ సీ–37 నమూనా రాకెట్‌కు మంగళవారం పూజలు నిర్వహించారు.  మంగళవారం ఇస్రో డైరెక్టర్లు జయరామన్, డాక్టర్‌ కనుంగో, డాక్టర్‌ జగదీశ్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. నమూనా రాకెట్‌తో శ్రీవారి పాదాల చెంత పూజలు నిర్వహించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement