దేశం గర్వించే ఆ క్షణం | Chandrayaan 2 Vikram Lander All Set To Land On Moon | Sakshi
Sakshi News home page

మన ‘మామ’ ఇంటికి..

Published Fri, Sep 6 2019 2:50 AM | Last Updated on Fri, Sep 6 2019 10:15 AM

Chandrayaan 2 Vikram Lander All Set To Land On Moon - Sakshi

చందమామ రావే.. జాబిల్లి రావే.. అని అమ్మలు పిల్లల కోసం ఎంత పిలిచినా రాలేదు.. అందుకే మన శాస్త్రవేత్తలే చందమామ వద్దకు వెళ్లేందుకు మార్గం కనిపెట్టారు.. జాబిల్లి జాడలు వెతుక్కుంటూ ప్రయాణం మొదలుపెట్టారు. జూలై 22న శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 రాకెట్‌లో నింగికి ఎగిరి జాబిల్లి కక్ష్యలోకి చేరడంతో చం ద్రయాన్‌–2 యాత్ర ప్రారంభమైంది. 48 రోజులకు ల్యాండర్‌ జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై శనివారం తెల్లవారుజామున 1.30– 2.30 గంటల మధ్యలో చంద్రుడిపై కాలుమోపనుంది. ఈ యాత్ర ద్వారా చంద్రగ్రహంపై ఎంతమేర నీరు ఉందో తెలిసే అవకాశముంది. మొదటి ప్రయత్నంలోనేజాబిల్లి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలిదేశంగా భారత్‌ చరిత్రలో నిలిచిపోనుంది.  దటీజ్‌ ఇండియా!   

గ్రహరాశులనధిగమించి.. ఘనతారల పథము నుంచి.. గగనాంతర రోదసిలో.. గంధర్వగోళ గతులు దాటేందుకు.. రంగం సిద్ధమవుతోంది! భారతీయులుగా మనమంతా గర్వించే రోజు రానే వచ్చింది.. కచ్చితంగా చెప్పాలంటే ఇంక కొన్ని గంటలే.. చంద్రయాన్‌–2 ఆర్బిటర్‌ నుంచి వేరుపడ్డ విక్రమ్‌ ల్యాండర్‌.. జాబిల్లి దక్షిణ ధృవంపై వాలడమే ఆలస్యం.. అంతరిక్ష యవనికపై భారత త్రివర్ణ పతాకం గర్వంగా నిలవనుంది! 

48 రోజుల నిరీక్షణకు తెరపడే శుభసమయం ఇంకో 24 గంటల్లోనే రానుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 1.30– 2.30 గంటల (శుక్రవారం అర్ధరాత్రి దాటాక) మధ్యలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌ –2 ల్యాండర్‌ జాబిల్లి దక్షిణ ధృవ ప్రాంతంపై దిగనుంది. బాలారిష్టాలను దాటుకుని జూలై 22న నింగికి ఎగసిన చంద్రయాన్‌–2 ఐదుసార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టి.. ఆ తర్వాత జాబిల్లి కక్ష్యలోకి చేరింది. మూడు లక్షలకుపైగా కిలోమీటర్ల ప్రయాణం తర్వాత వారం రోజుల కింద జాబిల్లి సమీపానికి చేరిన ఈ అంతరిక్ష నౌక దశల వారీగా మన సహజ ఉపగ్రహానికి దగ్గరవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగానికి చివరి ఘట్టమైన సాఫ్ట్‌ల్యాండింగ్‌ శనివారం తెల్లవారుజామున జరగనుంది. 

ఎందుకింత ప్రాముఖ్యం? 
చంద్రయాన్‌ –2 విజయవంతమైతే ఇస్రో బోలెడు రికార్డులు సృష్టించనుంది. మొదటి ప్రయత్నంలోనే జాబిల్లి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్‌ చరిత్రలో నిలిచిపోతుంది. జాబిల్లిపైకి ల్యాండర్‌ను పంపిన నాలుగో దేశంగానూ రికార్డుల్లోకి ఎక్కుతుంది. కాగా, ఆర్బిటర్‌ నుంచి వేరుపడిన విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా జాబిల్లిపై దిగడం ఈ ప్రయోగంలో అత్యంత కీలక ఘట్టం. ఇతర గ్రహాలపై సాఫ్ట్‌ల్యాండింగ్‌కు ప్రయత్నించడం ఇస్రోకు ఇదే తొలిసారి. అనేక క్లిష్ట పరిస్థితుల్లో విక్రమ్‌ దిగాల్సి ఉంటుంది.

భూమితో పోలిస్తే జాబిల్లిపై గురుత్వ శక్తి మూడొంతులే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జాబిల్లి గురుత్వశక్తి ప్రభావానికి గురైన వెంటనే వేగంగా జారిపడిపోవడం మొదలవుతుంది. గాలి కూడా ఉండదు కాబట్టి.. పతనాన్ని నిరోధించే అవకాశం ఉండదు. గాలి లేకుండా ప్యారాచూట్స్‌ పనిచేయవు. ఇన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ మోటార్ల సాయంతోనే వేగాన్ని నియంత్రించుకుంటూ గంటకు 3.6 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వేగంతో దిగాల్సి ఉంటుంది. 

రోవర్‌ వేరుపడటంతో ప్రయోగం పూర్తి.. 
జాబిల్లిపై విక్రమ్‌ సాఫ్ట్‌ల్యాండింగైన తర్వాత కొన్ని గంటలకు అందులోనే నిక్షిప్తమై ఉన్న రోవర్‌ ప్రజ్ఞాన్‌ బయటకు వస్తుంది. జాబిల్లి ఉపరితలంపై తిరుగుతూ ఈ చిట్టి రోబో ప్రయోగాలు చేస్తుంది. ఈ రోవర్‌లో రెండు పరికరాలు ఉంటాయి. ల్యాండైన ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ.. అక్కడి మట్టిని పరిశీలిస్తుంది. ఏయే మూలకాలు ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తుంది. దక్షిణ ధృవం వద్ద సూర్యరశ్మి ఉండే 14 రోజుల పాటు ఈ రోవర్‌ పనిచేసేలా డిజైన్‌ చేశారు.

దక్షిణ ధృవం ప్రత్యేకత? 
అమెరికా, రష్యాతో పాటు చైనా కూడా ఇప్పటికే చందమామపై అనేక ప్రయోగాలు చేపట్టింది. అయితే చంద్రగ్రహ మధ్యరేఖకు కొంచెం అటు ఇటు మాత్రమే ప్రయోగాలు చేశాయి. సూర్యరశ్మి బాగా ఉంటుంది కాబట్టి పరికరాలకు అవసరమైన విద్యుత్తు తయారు చేసుకోవడం సులువు కాబట్టి.. అందరూ ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కానీ.. ఇస్రో ల్యాండర్‌ దిగనున్న దక్షిణ ధృవ ప్రాంతం మాత్రం వీటన్నింటికంటే భిన్నమైంది. 50 ఏళ్ల జాబిల్లి యాత్రలో ఇప్పటివరకు ఎవరూ కాలు పెట్టని, పరిశీలనలు జరపని ప్రాంతాల్లో ఇది ఒకటి. భూమి నుంచి విడిపోయేటప్పటి శిలాజాలు ఈ ప్రాంతంలో చెక్కు చెదరకుండా ఉండే అవకాశముంది. చంద్రయాన్‌ –1 ద్వారా జాబిల్లిపై నీరు ఉన్న విషయం స్పష్టమైంది. చంద్రయాన్‌–2 ద్వారా ఎంతమేర నీరు ఉందో తెలిసే అవకాశముంది. 

ఆ చివరి గంట.. 
విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండర్‌లోని కెమెరాలు ప్రతి సెకనుకు తాను దిగాల్సిన ప్రాంతం తాలూకు ఫొటోలు తీస్తూ మనకు పంపుతుంటాయి. వాటి నుంచి అనువైన ప్రాంతాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎంపిక చేస్తారు. ఆ ఎంపికకు అనుగుణంగా విక్రమ్‌లోని కంప్యూటర్లు ఎత్తు, వేగం, దూరం వంటి వాటిని లెక్కించుకుని దిగుతుంది. భూమ్మీది నుంచే విక్రమ్‌లోని ఐదు రాకెట్‌ ఇంజన్లను నియంత్రిస్తుండటం ఇంకో క్లిష్టమైన పరిస్థితి. ముందుగా దాని వేగం తగ్గించడం.. ఆ తర్వాత ఉపరితలానికి కొంచెం ఎత్తులో స్థిరంగా ఉండేలా చేయడం.. దిగాల్సిన ప్రాంతానికి చేరేలా దిశ మార్చడం వంటివన్నీ చాలా కీలకం.  ఇలా రియల్‌ టైమ్‌లో అంతరిక్ష నౌక ల్యాండింగ్‌ ఏ దేశమూ ఇప్పటివరకూ చేపట్టలేదు. ఇవన్నీ సాధ్యం కావాలంటే.. విక్రమ్‌లోని కెమెరాలు, దూరాన్ని కొలిచే లేజర్‌ పరికరాలు, కంప్యూటర్లు, భూమ్మీది శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో, సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది.

ఆర్బిటర్‌
చంద్రయాన్‌–2 ప్రయోగంలో భాగంగా చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్‌ బరువు 2,379 కిలోలు. ఇది సొంతంగా దాదాపున వెయ్యి వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతూ ఏడాది పాటు పనిచేస్తుంది.  హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ దీన్ని రూపొందించింది. 

విక్రమ్‌
చంద్రయాన్‌–2 ద్వారా జాబిల్లిపైకి దిగే ల్యాండర్‌ పేరు ‘విక్రమ్‌’. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ స్మారకార్థం ల్యాండర్‌కు ఈ పేరు పెట్టారు. ఇది దాదాపు 1,471 కిలోల బరువుంటుంది. ఇది 14 రోజుల పాటు పనిచేస్తుంది. రోవర్‌ సాఫ్ట్‌ల్యాండ్‌ అవ్వడంలో కీలక పాత్ర దీనిదే. 

ప్రజ్ఞాన్‌
ఆరు చక్రాలుండే రోవర్‌ పేరు ప్రజ్ఞాన్‌. 27 కిలోల బరువుంటుంది. చంద్రుడి ఉపరితలంపై అడుగిడిన దగ్గరి నుంచి సౌర శక్తి సాయంతో 500 మీటర్ల మేర ప్రయాణించగలదు. ఇది ఎక్స్‌రే కిరణాలను ప్రసారం చేస్తూ చంద్రుడి
ఉపరితలంపై ఏయే మూలకాలు ఎక్కువగా ఉన్నాయో చెబుతుంటుంది.  

చంద్రయాన్‌ ప్రస్థానం ఇలా.. 
జూలై 22 : శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 రాకెట్‌లో నింగికి 
జూలై 24 : భూమి చుట్టూ తిరిగే కక్ష్య దూరం పెంపు. అతిదగ్గరగా 230 బై 45,163 కిలోమీటర్లతో కక్ష్య 
జూలై 26 : మరోమారు కక్ష్య దూరం పెంపు. ఈ సారి అతిదగ్గరగా 251 బై 54,829 కిలోమీటర్లతో కక్ష్య  
జూలై 29 : మూడోసారి కక్ష్య దూరం పెంపు. చోదక వ్యవస్థలను సుమారు 989 సెకన్లు వాడుకుంటూ భూమికి అతిదగ్గరగా 276 బై 71,792 కిలోమీటర్లతో కక్ష్య.  
ఆగస్టు 2 : నాలుగో కక్ష్య పెంపు ప్రయోగం విజయవంతం. భూమికి 277 బై 89,472 కిలోమీటర్ల దూరంగా కొత్త కక్ష్య మార్గం.  
ఆగస్టు 6 : చివరి కక్ష్య పెంపు పూర్తి. చోదక వ్యవస్థలను ఉపయోగించుకుని భూమికి దగ్గరగా 276 బై 1,42,975 కి.మీ. కక్ష్య.
 

ఆగస్టు 20 : జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌–2ను మళ్లించిన శాస్త్రవేత్తలు. జాబిల్లికి 114 కి.మీ. దగ్గరగా.. 18,072 కిలోమీటర్లు దూరంగా కక్ష్య మార్గం. 
ఆగస్టు 21 : జాబిల్లి చుట్టూ తిరుగుతున్న కక్ష్య దూరం తగ్గింపు. అతిదగ్గరి దూరం 118 బై 4412 కిలోమీటర్లకు తగ్గింపు. 
ఆగస్టు 28 : మూడో కక్ష్య కుదింపు ప్రక్రియ విజయవంతం. తాజా కక్ష్య మార్గం అతి దగ్గరగా 179 బై 1412 కి.మీలు. 
ఆగస్టు 30 : నాలుగో కక్ష్య కుదింపు ప్రక్రియ. చోదక వ్యవస్థలను 1155 సెకన్ల సేపు వాడుకుని కక్ష్య మార్గాన్ని 124 బై 164 కిలోమీటర్లకు కుదించారు. 
సెప్టెంబర్‌ 2 : ఆర్బిటర్‌ నుంచి విజయవంతంగా వేరుపడిన ల్యాండర్‌ విక్రమ్‌. జాబిల్లి చుట్టూ 119 బై 127 కిలోమీటర్ల కక్ష్యలో విక్రమ్‌ భ్రమణం
సెప్టెంబర్‌ 3 : ఆర్బిటర్‌ కక్ష్య సవరణ ప్రక్రియ మొదలు. 4 సెకన్ల పాటు ఇంజిన్లను వాడుకోవడం ద్వారా విక్రమ్‌ కక్ష్యను 104 బై 128 కిలోమీటర్లుగా మార్పు. 
సెప్టెంబర్‌ 4 : విక్రమ్‌ను జాబిల్లికి మరింత చేరువుగా తీసుకెళ్లే ప్రయత్నం సక్సెస్‌. తాజాగా విక్రమ్‌ కక్ష్య 35 బై 101 కిలోమీటర్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement