న్యూఢిల్లీ: భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం తుది దశలో విఫలమైనప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలకు యావత్ జాతి అండగా నిలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర్నుంచీ అంతా శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరుకునే అపురూప క్షణాల కోసం యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా వేచి చూసిన వేళ చేదు ఫలితమే ఎదురైనప్పటికీ ఇదొక స్ఫూర్తివంతమైన ప్రయోగమని కొనియాడుతున్నారు. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి చంద్రయాన్-2 ప్రయోగంపై స్పందిస్తూ.. ‘ ఇస్రో శాస్త్రవేత్తల అద్భుతమైన ప్రయోగం భారత్ జాతికే గర్వకారణం. స్పేస్ సైన్స్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచానికే వన్నె తెచ్చారు. ఈ తరహా ప్రయోగాలు లక్షల మంది భారత చిన్నారులకు స్ఫూర్తి నింపుతుంది. జైహింద్’ అని ట్వీట్ చేశాడు.
ఇస్రో ఎంతగానో శ్రమించింది: కోహ్లి
చంద్రయాన్-2 ప్రయోగం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయినా ఇస్రో శాస్త్రవేత్తలపై మాత్రం సానుభూతి వ్యక్తమవుతోంది. ఈ ప్రయోగాన్ని విజయంవంతం చేయాలని సంకల్పించుకున్న ఇస్రో కృషి నిజంగా అమోఘమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొనియాడాడు. మనం చేసిన ప్రయోగమే ఒక సక్సెస్ అని కోహ్లి పేర్కొన్నాడు. సైన్స్‌లో ఫెయిల్యూర్స్ అంటూ ఏమీ ఉండవని ఈ సందర్భంగా తెలిపాడు. రాత్రింబవళ్లు ఎంతగానో శ్రమించిన శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందన్నాడు.
చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని భావించిన తరుణంలో విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. దాంతో చంద్రయాన్-2 ప్రయోగం తృటిలో చేజారింది. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment