సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్–2 తొలిసారి అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటోలను పంపింది. ప్రస్తుతం చంద్రయాన్–2 భూమికి–చంద్రుడికి మధ్యలోని భూమధ్యంతర కక్ష్యలో పరిభ్రమిస్తోంది. శనివారం సాయంత్రం 5.28 గంటలకు భూమిని ఉత్తరం ధృవం వైపు నుంచి తీసిన ఐదు ఫొటోలను ఆదివారం ఇస్రో తన సొంత వెబ్‌సైట్‌లో అధికారికంగా విడుదల చేసింది.
చంద్రయాన్–2 కక్ష్య దూరాన్ని ప్రస్తుతం భూమికి దగ్గరగా 277 కిలోమీటర్లకు, దూరంగా 89,472 కిలోమీటర్ల ఎత్తుకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూమికి 5,000 కిలోమీటర్ల దగ్గరగా వచ్చిన సమయంలో 10 నిమిషాల వ్యవధిలో ఐదు ఫొటోలను తీసి బెంగళూరు సమీపంలోని బైలాలు భూ నియంత్రిత కేంద్రానికి పంపింది. చంద్రయాన్–2లో ఉన్న ల్యాండర్ (విక్రమ్)లో ఎల్–14 కెమెరా ఈ చిత్రాలను తీసింది. చంద్రుడి ఉపరితలం మీద దిగే 15 నిమిషాలు విజయవంతమైతే చంద్రయాన్–2 యాత్ర సజావుగా సాగినట్టేనని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఫొటోలు ఎప్పుడెప్పుడంటే..
భూమికి ఉత్తర ధృవం నుంచి 5 వేల కిలోమీటర్ల ఎత్తులో ఒక ఛాయా చిత్రం, 5.29 గంటలకు 4,700 కిలోమీటర్ల్ల ఎత్తులోకి వచ్చాక మరో ఛాయాచిత్రాన్ని తీసింది. ఆ తరువాత 5.31 గంటలకు 4,100 కిలోమీటర్ల్ల ఎత్తు నుంచి, 17.34 గంటలకు 3,200 కిలో మీటర్ల ఎత్తు నుంచి, 17.37 గంటలకు 2,450 కిలోమీటర్ల ఎత్తు నుంచి మరో మూడు ఛాయా చిత్రాలను తీసి పంపింది.
ఫొటోలు పంపిన చంద్రయాన్–2
Published Mon, Aug 5 2019 3:50 AM | Last Updated on Mon, Aug 5 2019 7:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment