ఇద్దరూ ఇద్దరే.. ఎంతటి కష్టమైనా.. | ISRO Women Scientists In Chandrayaan 2 Project | Sakshi
Sakshi News home page

జాబిల్లి రాణులు

Published Sun, Jun 16 2019 11:34 AM | Last Updated on Sun, Jun 16 2019 12:51 PM

ISRO Women Scientists In Chandrayaan 2 Project - Sakshi

ఒకరేమో రాకెట్‌ వుమెన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు తెచ్చుకున్న అనుభవశాలి రీతూ కరిథాల్‌..మరొకరు తొలిసారిగా ఒక అతి పెద్ద ప్రాజెక్టుని నడిపే అవకాశం అందిపుచ్చుకున్న ముత్తయ్య వనిత..ఇద్దరూ ఇద్దరే. ఎంతటి కష్టమైన బాధ్యతను అప్పగించినా ఇష్టంతో చేస్తారు. ఇస్రోలో చాలా కాలంగా కీలక పదవుల్లో ఉన్న వారిద్దరూ ఇప్పుడు అత్యంత ప్రతిష్మాత్మక ప్రాజెక్టు చంద్రయాన్‌–2కు నేతృత్వం వహిస్తున్నారు. ఆ జాబిలి రాణుల నేపథ్యమేంటో చూద్దాం..

అంతరిక్ష రంగంలో భారత్‌ ఘనకీర్తిని అంతర్జాతీయంగా మరో మెట్టుపై నిలబట్టే గొప్ప ప్రాజెక్టు. వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయిన చంద్రయాన్‌–2ను జూలై 15న తెల్లవారుజామున 2.51 నిముషాలకు ప్రయోగించబోతున్నాం. అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్‌ చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్‌–2. ఈ ప్రాజెక్టులో ఆఖరి 15 నిమిషాలు చాలా కీలకం. ఉపగ్రహం రోవర్‌ నుంచి విడిపోయి జాబిలిపైకి ఒడిదొడుకులు లేకుండా దిగడం కీలకం. అంతటి క్లిష్టమైన పనికి ఇద్దరు చంద్రవదనలు నేతృత్వం వహించడం మహిళా లోకానికి నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. 40వ పడిలో ఉన్న వారిద్దరినీ చూస్తూ దేశమే గర్వపడుతోంది. ‘ఇప్పటివరకు కమ్యూనికేషన్లు, ఇతర ఉపగ్రహాల ప్రయోగాలకు మాత్రమే మహిళలు ఆధ్వర్యం వహించారు. కానీ ఇతర గ్రహాలకు పంపే ఒక మిషన్‌కు మహిళలు నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. ఈ ప్రాజెక్టుల్లో 30శాతం మహిళలు పని చేస్తున్నారు.’అని ఇస్రో చైర్మన్‌ కె. శివన్‌ అన్నారు.

రాకెట్‌ వుమన్‌ ఆఫ్‌ ఇండియా రీతూ
రీతూ కరిథాల్‌. ఆమె ప్రతిభాపాటవాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వయంకృషితో పైకి వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన ఆమె ఏరోస్పేస్‌లో ఇంజనీరింగ్‌ చేశారు. రీతూకి చిన్నప్పట్నుంచి అంతరిక్ష రంగం, సైన్స్‌పై ఆసక్తి ఎక్కువ. నక్షత్ర కాంతుల వెనుక ఏముందో కనుక్కోవాలని ఉబలాటపడేవారు. అదే ఆసక్తితో ఇస్రోలో చేరారు. 1997లో ఇస్రోలో చేరిన ఆమె అంచెలంచెలుగా పైకి ఎదిగారు. చేరిన పదేళ్లకే యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు అందుకున్నారు. ఇస్రోలో 20 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో ప్రాజెక్టుల్లో పనిచేశారు. చంద్రయాన్‌–1లోనూ సభ్యురాలిగా ఉన్నారు. మంగళయాన్‌కి డిప్యూటీ ఆపరేషన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించడం ఆమె కెరీర్‌ను తారాపథానికి తీసుకెళ్లింది. రాకెట్‌ వుమన్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందారు. ఇప్పుడు చంద్రయాన్‌–2కి మిషన్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. చంద్రయాన్‌–2 ప్రారంభం నుంచి ఆమెనే పర్యవేక్షిస్తున్నారు.

ప్రాజెక్టు డైరెక్టర్‌ వనిత
ముత్తయ్య వనిత. ఎల్రక్ట్రానిక్‌ సిస్టమ్స్‌లో ఇంజనీరిం గ్‌ చదివారు. ఉపగ్రహాలను డిజైన్‌ చేయడంలో ప్రత్యే క శిక్షణ తీసుకున్నారు. చంద్రయాన్‌–2 ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా ఉన్నారు. డైరెక్టర్‌ అంటే సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోదు. టీమ్‌లో సభ్యులందరూ సక్రమంగా తమ బాధ్యత లు నిర్వహిస్తున్నారా లేదా చూడాలి. గడువులోగా పని పూర్తయ్యేలా చూడాలి. అంటే ఎంతో నాయకత్వ ప్రతిభ ఉండాలి. వనితకు ఇంత పెద్ద ప్రాజెక్టు చేపట్టడం ఇదే మొదటిసారి. అయినా ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. ‘ప్రాజెక్టు పరంగా చూస్తే నిస్సందేహంగా ఆమె కెరీర్‌ను ఇది మేలి మలుపు తిప్పేదే. ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇన్‌చార్జ్‌ కావడం ఇదే మొదటిసారి. కానీ ఆమె ఎన్నో రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల ప్రయోగాల ప్రాజెక్టులను వనిత సమర్థంగా నిర్వహించారు’ అని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న డైరెక్టర్‌ అన్నాదురై చెప్పారు. ఇంటర్నేషనల్‌ సైన్స్‌ జనరల్‌ నేచర్‌ 2019లో కీలక బాధ్యతలు వహిస్తున్న డైరెక్టర్ల జాబితాలో అగ్రస్థానంలో వనిత పేరుని చేర్చింది. 2006లో అస్ట్రానామికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నుంచి బెస్ట్‌ డైరెక్టర్‌ పురస్కారం అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement