నెలల ఉత్కంఠకు బ్రేక్ పడింది.. జాబిల్లిని ఇంకోసారి అందుకోవాలన్న ఇస్రో ప్రణాళిక వాయిదా పడింది.. అంతా బాగుంది.. చంద్రయాన్ –2 నింగికి ఎగురుతుంది.. అని ఆశించినా.. సాంకేతిక లోపం కారణంగా ప్రయోగం వాయిదా అన్న ప్రకటన భారతీయుల్లో తీవ్ర నిరాశ నింపింది. అయితే.. మలి ప్రయోగం ఎప్పుడు?
శ్రీహరికోట (సూళ్లూరుపేట)/సాక్షి నాలెడ్జ్ సెంటర్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం ప్రయోగించతలపెట్టిన జీఎస్‌ఎల్‌వీ మార్క్3–ఎం1–చంద్రయాన్–2 ప్రయోగం సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది. క్రయోజనిక్ దశలో సాంకేతిక లోపం కారణంగానే ప్రయోగం ఆగిపోయిందని తెలిసింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ 19.4 గంటల సమయం పూర్తై, ఇంకా 56.24 నిమిషాల కౌంట్‌డౌన్ ఉన్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. 19.4 గంటలపాటు నిర్వహించిన కౌంట్‌డౌన్ సమయంలో ఎల్–110 దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. తర్వాత సీ–25 దశలో అంటే.. మూడో దశలో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. ప్రయోగం ఇక 56.24 నిమిషాల్లో జరుగుతుందనగానే ఉన్నట్టుండి కౌంట్‌డౌన్ ప్రక్రియను నిలిపేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నామని, ప్రయోగం మళ్లీ ఎప్పుడు జరిపేదీ త్వరలోనే తెలియజేస్తామన్న ఇస్రో ప్రకటనతో ఏం జరిగిందన్న అంశానికి ప్రాధాన్యం పెరిగిపోయింది.
పోగో గ్యాస్ బాటిల్‌లో లీకేజీ వల్లే..
ఉపగ్రహ వాహకనౌకలో అత్యంత కీలకంగా భావించే క్రయోజనిక్ దశలో గ్యాస్ బాటిల్ (పోగో బాటిల్) లీకేజీ వల్ల ప్రయోగాన్ని అర్ధంతరంగా నిలిపేశారు. క్రయోజనిక్ ఇంజన్‌లకు అతిముఖ్యమైన పోగో గ్యాస్ బాటిల్స్‌లో గ్యాస్ లీకేజీ జరిగితే ఇంజన్లకు తగిన థ్రస్ట్ రాదని భావించి 56.24 నిమిషాలకు ముందే ప్రయోగాన్ని ఆపేశారు. ఎస్–200 బూస్టర్లు, ఎల్–110 దశలో బాగా పనిచేసినా సీ–25 దశలో తగిన వేగం రాదని భావించి కౌంట్‌డౌన్ ప్రక్రియను శాస్త్రవేత్తలు నిలిపేశారు. క్రయోజెనిక్ ఇంజన్‌లో ఇంధనం లీకేజీ కారణంగానే ప్రయోగం వాయిదా పడిందని కొందరు నిపుణుల అంచనా. శాస్త్రవేత్తలు రాత్రికి రాత్రే క్రయోజనిక్ దశలో 25 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనాన్ని వెనక్కి తీసేశారు. ఇంకా అందులో అడుగు భాగాన, పక్కన ఆనుకుని ఉన్న ఇంధనపు పొరలను తొలగించేందుకు నైట్రోజన్ వ్యాపర్స్‌ను లోపలకు పంపించి పూర్తిగా శుభ్రం చేయాల్సి ఉంది. దీనికి మరో ఐదు రోజులు పడుతుంది. అయితే.. రాకెట్‌ను మొత్తం విప్పదీయాల్సి ఉండడంతో క్రయో ఇంధనంతోపాటు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని వెనక్కి తీసే ప్రక్రియను సోమవారం ఉదయం నుంచి చేపట్టారు. రాకెట్ విడి భాగాలను మొత్తంగా విప్పదీసి మళ్లీ అసెంబ్లింగ్ చేయాల్సి ఉండడంతో ఈ ప్రయోగం ఈ ఏడాది చివరి వరకు వాయిదా పడే అవకాశం ఉంది. అయితే.. జీఎస్‌ఎల్‌వీ మార్క్3–ఎం1 రాకెట్‌లో క్రయోజనిక్ దశలో సాంకేతిక లోపం తలెత్తడం ఇదే మొదటిసారి కావడంతో దీనిపై పట్టు సాధించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సాంకేతిక లోపం ఎలా జరిగిందనే దానిపై ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నారు. దీనిపై ఒక కమిటీని సైతం వేయనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ ప్రయోగాన్ని నిలిపివేసి సుమారు రూ.600 కోట్లు ఆదా చేయగలిగారు.
జీఎస్‌ఎల్‌వీతోనే సమస్య?
చంద్రయాన్–2 ప్రయోగానికి వాడుతున్న జీఎస్‌ఎల్‌వీ కారణంగానే ప్రయోగం వాయిదా పడిందా? అంటే అవునని అంటున్నారు కొందరు నిపుణులు. జీఎస్‌ఎల్‌వీకి చంద్రయాన్–2 కేవలం నాలుగో ప్రయోగం కావడం ఇందుకు ఒక కారణమైతే.. అందులో వాడుతున్న క్రయోజనిక్ ఇంజన్‌తోనూ ఇస్రోకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా ఒత్తిడి మేరకు రష్యా నాలుగు క్రయోజనిక్ ఇంజన్లను మాత్రమే మనకు అందజేసింది. వాటిలో కొన్ని ఇప్పటికే విఫలం కాగా మిగిలి ఉన్న ఒకే ఒక్క ఇంజన్ సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు సొంతంగా పరిశోధనలు చేపట్టి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కొత్త ఇంజన్లను తయారుచేశారు. చంద్రయాన్–1 తర్వాత ఇస్రో సొంతంగా తయారుచేసిన క్రయోజనిక్ ఇంజన్ సాయంతో జీశాట్–4 ఉపగ్రహాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసింది. అయితే.. ఇంజన్ ఆన్ కాకపోవడంతో రాకెట్ సముద్రంలో కూలిపోయింది. ఆ తర్వాత చేసిన మూడు ప్రయోగాలు విజయవంతం కావడంతో చంద్రయాన్–2కు ఈ రాకెట్‌ను ఎంపిక చేశారు. అయితే క్రయోజనిక్ ఇంజన్ నుంచి అతిశీతల పరిస్థితుల్లో ఉండే ఇంధనం లీక్ కావడం, ఇంజన్‌లోని కొన్ని వాల్వ్‌లు సక్రమంగా పనిచేయకపోవడాన్ని గుర్తించడం వల్ల ప్రయోగాన్ని ఆపేశారని కొంతమంది నిపుణుల అంచనా. ‘అంత పెద్ద ప్రయోగంలో చిన్నచిన్న సమస్యలు సహజమే. సమస్య ఉందని గుర్తించాక ఏ మాత్రం అవకాశం తీసుకోకూడదు’అని డీఆర్‌డీవో శాస్త్రవేత్త రవిగుప్తా అన్నారు. ‘ప్రయోగం కోసం దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు. సమస్య సాధారణమైందా? సంక్లిష్టమైందా? అన్నది ప్రధానం కాదు. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రయోగాన్ని కొనసాగించలేం’అని ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ మాజీ డైరెక్టర్ జి.బాలచంద్రన్ తెలిపారు.
నిరాశగా వెనుదిరిగిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్
చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు వచ్చిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం సాయంత్రం షార్‌కు వచ్చిన ఆయన జీఎస్‌ఎల్‌వీ మార్క్3 రాకెట్‌ను సందర్శించి రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. రాత్రి 12.30 గంటలకు ప్రయోగాన్ని తిలకించేందుకు మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. ప్రయోగం వాయిదా పడటంతో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పి సోమవారం ఉదయాన్నే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment