విశ్లేషణ
జమిలి ఎన్నికల గురించిన చర్చ నేడు దేశంలో వాడిగా, వేడిగా జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఆ మేరకు కేంద్ర క్యాబినెట్ కూడా జమిలి ఎన్నికలకు ఆమోద ముద్ర వేసింది. అయితే ఇటు ప్రజలలోనూ, అటు అనేక రాజకీయ పక్షాలలోనూ అనేక ప్రశ్నలు ఉన్నాయి. జమిలి ఎన్నికల ప్రక్రియ అనేది ఎన్నికల వ్యయాలు, రాజకీయ సుస్థిరతలకు సంబంధించిన అంశం కానే కాదు. ప్రజా తీర్పుల భయం లేకుండా ఐదేళ్లు పాలించడానికి మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడగలదు. రాజకీయ పక్షాలను అదుపు చేసేందుకు ప్రజలకు ఉన్న కాస్తంత అవకాశాన్ని కూడా లేకుండా చేయగలదు.
జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ పరమైన లోతుపాతులూ, సాధ్యా సాధ్యాలూ వంటి అంశాలను కాసేపు పక్కన పెడదాం. జమిలి ఎన్ని కల అనుకూల వాదనలకు ప్రాతిపదికగా వున్న కొన్ని అంశాలను చూద్దాం. జమిలి ఎన్నికల వలన పదే పదే ఎన్నికలు జరిగే పరిస్థితి పోయి, ఆ మేరకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి అనేది ఒక వాదన. దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొంటుందనేది మరో వాదన.
2019 పార్లమెంటరీ ఎన్నికలకు గాను, దేశ వ్యాప్తంగా అయిన మొత్తం ఖర్చును సుమారుగా 50 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. 2024ల ఎన్నికల ఖర్చు, 2019 నాటి కంటే రెట్టింపై అది సుమారుగా 1–1.35 లక్షల కోట్ల రూపాయల మేరకు ఉంది. ఈ ఖర్చులను పైపైన చూస్తే , ఎన్నికల పేరిట చాలా పెద్ద మొత్తంలోనే డబ్బు ఖర్చయిపోతోందని అనిపించక మానదు. కానీ, దీన్ని ప్రభుత్వ లేదా ఎన్నికల కమిషన్ వ్యయాలు... పార్టీలు, అభ్యర్థుల వ్యయాలుగా విడగొట్టి చూస్తే వాస్తవం మెరుగ్గా అర్థం అవుతుంది.
2019లోని ఎన్నికల ఖర్చులో, ఎన్నికల కమిషన్ వాటా కేవలం 15% అనేది గమనార్హం. అంటే, 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదే లెక్క ప్రకారం, 2024లో ఎన్నికల మొత్తం వ్యయంలో 15 వేల కోట్ల రూపా యలు మాత్రమే ఎన్నికల కమిషన్ ప్రభుత్వ వ్యయంగా ఉంది. ఎన్నికల వ్యయాలలో సింహభాగం నిజానికి ప్రైవేటు అభ్యర్థులది. దీని వలన, అటు దేశ ఖజానాకో, ప్రజల పన్ను డబ్బుకో వచ్చి పడిన ముప్పేమీ లేదు.
సమస్య నాయకులకే!
నిజానికి, రాజకీయాలు వ్యాపారంగా మారిన నేటి కాలంలో, అభ్యర్థులు చేసే ఈ ఖర్చులు, జనం డబ్బును తిరిగి జనానికి చేరుస్తు న్నాయి. ఈ కోణం నుంచి ఆలోచిస్తే, పదే పదే ఎన్నికలు రావడం వలన జనానికి వచ్చిపడే నష్టం ఏమీ లేదు. అది కేవలం రాజకీయ నాయకుల సమస్య. 2024 ఏప్రిల్– జూన్ కాలంలో (2024–25 ఆర్థిక సంవత్సరం తాలూకు తొలి త్రైమాసికం) దేశ ఆర్థిక వ్యవస్థ, సుమారు 21 నెలల మందగమనం తర్వాత, కొంత కోలుకోవడాన్ని గమనించొచ్చు.
ఆ కాలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, దాని తాలూకు ఖర్చులు ఒక రకంగా దేశ ఆర్థిక వ్యవస్థకూ, ప్రజల కొనుగోలు శక్తికీ ఉద్దీపనలుగా పని చేశాయి. బాడుగ కార్లు మొదలుకొని, బ్యానర్లు, పోస్టర్లు, పబ్లిక్ మీటింగ్‌ల ఖర్చులు, సోషల్ మీడియా ప్రచార ఖర్చులు... వీటితో పాటుగా ఎటుకూడి ‘ఓటుకు నోటు’ను జనానికి అలవాటు చేశారు కాబట్టి, ఆ వ్యయాలు కూడా కలగలిపి దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఉద్దీపన కావడంలో ఆశ్చర్యం లేదు.
ఎన్నికలలో ఓట్లను కొనుగోలు చేసిన అనేక మంది రాజకీయ నేతలు గెలిచాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు దాపురించాయి. కాబట్టి, జమిలి ఎన్నికల రూపంలో ఐదు సంవత్స రాల సుస్థిర పాలనను హామీ చేసుకోవడం అనేది అటు అభ్యర్థులకూ, ఇటు పాలక పార్టీలకూ వెసులుబాటుగానే కనపడినా... అది ప్రజలకు మాత్రం సుదీర్ఘకాల సాధికారత లేని స్థితినీ, పరిపాలన బాగా లేకున్నా భరించక తప్పని స్థితినీ తెచ్చిపెడుతుంది.
ఇక్కడి ప్రశ్న రాజకీయ నాయకులకూ, పాలక పార్టీలకూ వాటి పాలనా అధికార వ్యవధిని గ్యారెంటీ చేసే జమిలి ఎన్నికలు మెరుగా? లేదా... ప్రజలకు ఎంతో కొంత నేతల అందుబాటునూ, సాధికారతనూ హామీ చేసే సజీవమైన అస్థిరతే మెరుగా అన్నది!
కాలవ్యవధికి గ్యారెంటీయా?
మన దేశంలో ఉన్నది ప్రధానంగా పార్లమెంటరీ వ్యవస్థ. మన లోక్ సభ, రాజ్య సభలకు తరచుగా మధ్యంతర ఎన్నికలు వస్తూనే ఉండటం తెలిసిందే. గెలిచిన అభ్యర్థుల మరణాలు, వారి రాజీనా మాలు తదితర అనేక కారణాల వలన కూడా మధ్యంతర ఎన్నికలు వస్తూ ఉంటాయి. కాబట్టి, జమిలి ఎన్నికల పేరిట ఐదేళ్ల పాటు నికరంగా, సుస్థిరంగా పాలించి తీరగలమన్న ఆశ అంత వాస్తవికమై నదేమీ కాదు.
పదే పదే ఎన్నికలు రాకుండా నివారించగలిగితే, పాలక పక్షాలు అనేక విధాన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగలుగుతాయన్న వాదన కూడా ఉన్నది. ఇది కేవలం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడంలో పాలక పక్షాలకు కావలసిన సుస్థిర పాలనను హామీ చేసే వాదన మాత్రమే.
నిజానికి, గతం నుంచి ఇటువంటి వాదన వేరొక రూపంలో ఉంది. ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పక్షాలు ఏ విధంగా పరస్పరం ఆరోపణలూ, ప్రత్యారోపణలూ చేసుకున్నా, ఎన్నికల అనంతరం అటు పాలక పక్షం... ఇటు ప్రతిపక్షమూ రెండూ కలగలిసి దేశ అభ్యున్నతికి పాటు పడాలి అన్నది. ఈ వాదన పూర్తిగా అసంబద్ధమైనది. అధికార పక్షం తాను ప్రాతినిధ్యం వహించే వర్గాల, సమూహాల ప్రయోజనాల కోసం పని చేస్తూ పోతుంటే... మరో పక్కన, భిన్నమైన ప్రయోజనాలు వున్న సామాజిక వర్గాలు, సమూ హాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతిపక్షాలు అనివార్యంగా పాలక పక్షంతో తలపడక తప్పని స్థితి ఉంటుంది.
ఉదాహరణకు, ఒక ప్రభుత్వం కార్మిక చట్టాలను సంస్కరించటం పేరిట, యజమానులు లేదా పెట్టు బడిదారులకు అనుకూలమైన విధానాలను తెచ్చే ప్రయత్నం చేస్తే, అది సహజంగానే కార్మికులకు ప్రాతినిధ్యం వహించే పక్షాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. సుస్థిరత పేరిట ప్రభు త్వాలకు ఆ ఐదు సంవత్సరాల కాల వ్యవధిని గ్యారెంటీ చేయడం ఆ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించని ఇతరేతర వర్గాలకు నియంతృత్వంగానే పరిణమించగలదు.
సుస్థిర నియంతృత్వమా? అస్థిర ప్రజాస్వామ్యమా?
నేడు సంస్కరణల పేరిట అమలు జరుగుతోన్న విధానాల క్రమంలో, పేద ప్రజలకూ, సామాన్య జనానికీ ఇచ్చే సబ్సిడీలు లేదా రాయితీలపై నిరంతరంగా కోతలు పడుతున్నాయి. ప్రధాని మోదీనే స్వయంగా ‘రేవడి సంస్కృతి’ (ఉచితాల సంస్కృతి)పై చర్చ జరగా లంటూ చెప్పడాన్ని గమనించవచ్చు. ఈ సంక్షేమ వ్యయాలు లేదా ‘ఉచితాల’ గురించిన చర్చ అంతిమంగా అనేక దేశాలలో పొదుపు చర్యల రూపంలో ఆర్థిక మాంద్య స్థితికీ, అస్థిరతకూ కారణం కావడాన్ని కళ్ళ ముందే చూస్తున్నాం.
గతంలో, అనేక లాటిన్ అమెరికా దేశాలలోనూ... యూరోప్‌లోని గ్రీస్‌లోనూ... ఈ మధ్య కాలంలోనే ఆసియా ఖండంలోని శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలలోనూ సామాన్య జనానికి కల్పించే రాయితీలను పొదుపు చర్యల పేరిట తగ్గించి వేయడం ఏ విధంగా సామాజిక విస్పోటనాలకూ, పోరా టాలకూ దారి తీసిందో చూశాం.
ఇటువంటి, ప్రజా వ్యతిరేక, సంక్షేమ వ్యతిరేక నిర్ణయాలను మధ్య మధ్యలో వచ్చి పడే ఎన్నికల లేదా ప్రజా తీర్పుల భయం లేకుండా ఐదేళ్ల పాటు నిరాఘాటంగా తీసుకోగలిగే టందుకు మాత్రమే ఈ జమిలి ఎన్నికల ప్రక్రియ ఉపయోగపడ గలదు. కాబట్టి, ఇప్పటికే ప్రజలకు దూరమైన రాజకీయ వ్యవస్థలో రాజకీయ పక్షాలు, రాజకీయ నేతలను అదుపు చేయగలిగేటందుకు ప్రజలకు ఉన్న కాస్తంత అవకాశాన్ని కూడా, ఈ జమిలి ఎన్నికలు లేకుండా చేసేయగలవు.
జమిలి ఎన్నికల ప్రక్రియ అనేది కేవలం ఎన్నికల వ్యయాలు లేదా రాజకీయ సుస్థిరతలకు సంబంధించిన అంశం కానే కాదు. అది, దేశ రాజకీయాలపై సామాన్య జనానికి పట్టు వుండాలా... లేదా కార్పొ రేట్లు, ధనవంతులు లేదా వారి అనుకూల రాజకీయ పక్షాలకు పట్టు ఉండాలా అనే అంశానికి సంబంధించింది అనేది సుస్పష్టం. సుస్థిర ప్రజా వ్యతిరేక పాలన కంటే, నిరంతరంగా ప్రజలకు లోబడిన, వారికి లొంగి వుండే అస్థిర రాజకీయ వ్యవస్థే మేలు.
డి. పాపారావు
వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు
మొబైల్: 98661 79615
Comments
Please login to add a commentAdd a comment