‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో ముందడుగు
న్యాయశాఖ రూపొందించిన బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
పార్లమెంట్ ముందుకు జమిలి బిల్లు
జేపీసీకి సిఫార్సు చేసే ఛాన్స్
బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలు అవసరం
ఉభయ సభల్లో గట్టెక్కాలంటే బీజేపీ కష్టపడాల్సిందే!
న్యూఢిల్లీ, సాక్షి: దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన.. ‘జమిలి బిల్లు’కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో.. సమగ్ర బిల్లు పార్లమెంట్ ముందుకు చర్చకు రానుంది. దేశంలో వేరువేరుగా ఎన్నికల నిర్వహణ.. దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందంటూ కేంద్రంలోని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. ఈ మేరకు గురువారం మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర పడింది.
కాగా, రాబోయే సాధారణ ఎన్నికలు.. జమిలిగానే జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. కానీ, పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ముందుకెళ్లాలని మోదీ భావిస్తున్నారు. ముందుగా పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెడతారు.
ఇదీ చదవండి: శరవేగంగా ‘జమిలి’ అడుగులు! బిల్లు ఆమోదం పొందాలంటే..
గతంలోనే కోవింద్ కమిటి సిపార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ 18,626 పేజీల ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 2023, సెప్టెంబర్ 2 ఈ నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. పలువురు నిపుణుల సారధ్యంలో 191 రోజుల కసరత్తు అనంతరం ఈ నివేదికను పూర్తిచేశారు. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, తరువాతి 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ఈ నివేదికలో సిఫారసు చేసింది.
కోవింద్ కమిటీ తన నివేదికలో ఏకకాలంలో ఓటు వేయడం దేశప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది. ఒకేసారి ఐక్యంగా ఓటు వేయడం అనేది అభివృద్ధి ప్రక్రియను, సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తుందని.. ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది. ఏకకాలంలో ఓటింగ్ జరగడం వల్ల పారదర్శకత, సౌలభ్యం, ఓటరు విశ్వాసం గణనీయంగా పెరుగుతుందని కోవింద్ కమిటీ భావించింది.
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా దళాల ముందస్తు ప్రణాళికను ఈ కమిటీ సిఫారసు చేసింది. తొలిసారిగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఉండవచ్చని నివేదిక పేర్కొంది. హంగ్ హౌస్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే, మిగిలిన ఐదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ పేర్కొంది.
దాదాపు 30 పార్టీలు జమిలి ప్రతిపాదనను సమర్థించగా.. కాంగ్రెస్ సహా 13 పార్టీలు వ్యతిరేకించాయి.
జమిలి నేపథ్యం..
జమిలి.. పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం మనదేశానికి ఇదేమీ కొత్త కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చాక.. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలి మాయమై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రానున్న సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో చేయాలి. లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. అయితే ఇందుకు రాజ్యాంగ పరంగా అవరోధాలున్నాయి.
ఏయే ఆర్టికల్స్ సవరణ అంటే..
దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా కొన్ని రాజ్యాంగ సవరణలు అవసరం.
లోక్‌సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ
రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1 ) సవరణ.
అత్యయిక పరిస్థితుల సమయంలో సభకాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2) సవరణ
రాష్ట్రపతికి లోక్‌సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆర్టికల్ 85 (2) (బి) సవరణ.
రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌కు దాఖలు పరిచే ఆర్టికల్ 174 ( 2) ( బి ) సవరణ
రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణ
ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరణ.
Comments
Please login to add a commentAdd a comment