D. Paparao
-
అస్థిరమైనా ప్రజాస్వామ్యమే మేలు!
జమిలి ఎన్నికల గురించిన చర్చ నేడు దేశంలో వాడిగా, వేడిగా జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఆ మేరకు కేంద్ర క్యాబినెట్ కూడా జమిలి ఎన్నికలకు ఆమోద ముద్ర వేసింది. అయితే ఇటు ప్రజలలోనూ, అటు అనేక రాజకీయ పక్షాలలోనూ అనేక ప్రశ్నలు ఉన్నాయి. జమిలి ఎన్నికల ప్రక్రియ అనేది ఎన్నికల వ్యయాలు, రాజకీయ సుస్థిరతలకు సంబంధించిన అంశం కానే కాదు. ప్రజా తీర్పుల భయం లేకుండా ఐదేళ్లు పాలించడానికి మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడగలదు. రాజకీయ పక్షాలను అదుపు చేసేందుకు ప్రజలకు ఉన్న కాస్తంత అవకాశాన్ని కూడా లేకుండా చేయగలదు.జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ పరమైన లోతుపాతులూ, సాధ్యా సాధ్యాలూ వంటి అంశాలను కాసేపు పక్కన పెడదాం. జమిలి ఎన్ని కల అనుకూల వాదనలకు ప్రాతిపదికగా వున్న కొన్ని అంశాలను చూద్దాం. జమిలి ఎన్నికల వలన పదే పదే ఎన్నికలు జరిగే పరిస్థితి పోయి, ఆ మేరకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి అనేది ఒక వాదన. దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొంటుందనేది మరో వాదన. 2019 పార్లమెంటరీ ఎన్నికలకు గాను, దేశ వ్యాప్తంగా అయిన మొత్తం ఖర్చును సుమారుగా 50 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. 2024ల ఎన్నికల ఖర్చు, 2019 నాటి కంటే రెట్టింపై అది సుమారుగా 1–1.35 లక్షల కోట్ల రూపాయల మేరకు ఉంది. ఈ ఖర్చులను పైపైన చూస్తే , ఎన్నికల పేరిట చాలా పెద్ద మొత్తంలోనే డబ్బు ఖర్చయిపోతోందని అనిపించక మానదు. కానీ, దీన్ని ప్రభుత్వ లేదా ఎన్నికల కమిషన్ వ్యయాలు... పార్టీలు, అభ్యర్థుల వ్యయాలుగా విడగొట్టి చూస్తే వాస్తవం మెరుగ్గా అర్థం అవుతుంది. 2019లోని ఎన్నికల ఖర్చులో, ఎన్నికల కమిషన్ వాటా కేవలం 15% అనేది గమనార్హం. అంటే, 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదే లెక్క ప్రకారం, 2024లో ఎన్నికల మొత్తం వ్యయంలో 15 వేల కోట్ల రూపా యలు మాత్రమే ఎన్నికల కమిషన్ ప్రభుత్వ వ్యయంగా ఉంది. ఎన్నికల వ్యయాలలో సింహభాగం నిజానికి ప్రైవేటు అభ్యర్థులది. దీని వలన, అటు దేశ ఖజానాకో, ప్రజల పన్ను డబ్బుకో వచ్చి పడిన ముప్పేమీ లేదు.సమస్య నాయకులకే!నిజానికి, రాజకీయాలు వ్యాపారంగా మారిన నేటి కాలంలో, అభ్యర్థులు చేసే ఈ ఖర్చులు, జనం డబ్బును తిరిగి జనానికి చేరుస్తు న్నాయి. ఈ కోణం నుంచి ఆలోచిస్తే, పదే పదే ఎన్నికలు రావడం వలన జనానికి వచ్చిపడే నష్టం ఏమీ లేదు. అది కేవలం రాజకీయ నాయకుల సమస్య. 2024 ఏప్రిల్– జూన్ కాలంలో (2024–25 ఆర్థిక సంవత్సరం తాలూకు తొలి త్రైమాసికం) దేశ ఆర్థిక వ్యవస్థ, సుమారు 21 నెలల మందగమనం తర్వాత, కొంత కోలుకోవడాన్ని గమనించొచ్చు. ఆ కాలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, దాని తాలూకు ఖర్చులు ఒక రకంగా దేశ ఆర్థిక వ్యవస్థకూ, ప్రజల కొనుగోలు శక్తికీ ఉద్దీపనలుగా పని చేశాయి. బాడుగ కార్లు మొదలుకొని, బ్యానర్లు, పోస్టర్లు, పబ్లిక్ మీటింగ్‌ల ఖర్చులు, సోషల్ మీడియా ప్రచార ఖర్చులు... వీటితో పాటుగా ఎటుకూడి ‘ఓటుకు నోటు’ను జనానికి అలవాటు చేశారు కాబట్టి, ఆ వ్యయాలు కూడా కలగలిపి దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఉద్దీపన కావడంలో ఆశ్చర్యం లేదు.ఎన్నికలలో ఓట్లను కొనుగోలు చేసిన అనేక మంది రాజకీయ నేతలు గెలిచాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు దాపురించాయి. కాబట్టి, జమిలి ఎన్నికల రూపంలో ఐదు సంవత్స రాల సుస్థిర పాలనను హామీ చేసుకోవడం అనేది అటు అభ్యర్థులకూ, ఇటు పాలక పార్టీలకూ వెసులుబాటుగానే కనపడినా... అది ప్రజలకు మాత్రం సుదీర్ఘకాల సాధికారత లేని స్థితినీ, పరిపాలన బాగా లేకున్నా భరించక తప్పని స్థితినీ తెచ్చిపెడుతుంది. ఇక్కడి ప్రశ్న రాజకీయ నాయకులకూ, పాలక పార్టీలకూ వాటి పాలనా అధికార వ్యవధిని గ్యారెంటీ చేసే జమిలి ఎన్నికలు మెరుగా? లేదా... ప్రజలకు ఎంతో కొంత నేతల అందుబాటునూ, సాధికారతనూ హామీ చేసే సజీవమైన అస్థిరతే మెరుగా అన్నది!కాలవ్యవధికి గ్యారెంటీయా?మన దేశంలో ఉన్నది ప్రధానంగా పార్లమెంటరీ వ్యవస్థ. మన లోక్ సభ, రాజ్య సభలకు తరచుగా మధ్యంతర ఎన్నికలు వస్తూనే ఉండటం తెలిసిందే. గెలిచిన అభ్యర్థుల మరణాలు, వారి రాజీనా మాలు తదితర అనేక కారణాల వలన కూడా మధ్యంతర ఎన్నికలు వస్తూ ఉంటాయి. కాబట్టి, జమిలి ఎన్నికల పేరిట ఐదేళ్ల పాటు నికరంగా, సుస్థిరంగా పాలించి తీరగలమన్న ఆశ అంత వాస్తవికమై నదేమీ కాదు. పదే పదే ఎన్నికలు రాకుండా నివారించగలిగితే, పాలక పక్షాలు అనేక విధాన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగలుగుతాయన్న వాదన కూడా ఉన్నది. ఇది కేవలం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడంలో పాలక పక్షాలకు కావలసిన సుస్థిర పాలనను హామీ చేసే వాదన మాత్రమే. నిజానికి, గతం నుంచి ఇటువంటి వాదన వేరొక రూపంలో ఉంది. ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పక్షాలు ఏ విధంగా పరస్పరం ఆరోపణలూ, ప్రత్యారోపణలూ చేసుకున్నా, ఎన్నికల అనంతరం అటు పాలక పక్షం... ఇటు ప్రతిపక్షమూ రెండూ కలగలిసి దేశ అభ్యున్నతికి పాటు పడాలి అన్నది. ఈ వాదన పూర్తిగా అసంబద్ధమైనది. అధికార పక్షం తాను ప్రాతినిధ్యం వహించే వర్గాల, సమూహాల ప్రయోజనాల కోసం పని చేస్తూ పోతుంటే... మరో పక్కన, భిన్నమైన ప్రయోజనాలు వున్న సామాజిక వర్గాలు, సమూ హాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతిపక్షాలు అనివార్యంగా పాలక పక్షంతో తలపడక తప్పని స్థితి ఉంటుంది. ఉదాహరణకు, ఒక ప్రభుత్వం కార్మిక చట్టాలను సంస్కరించటం పేరిట, యజమానులు లేదా పెట్టు బడిదారులకు అనుకూలమైన విధానాలను తెచ్చే ప్రయత్నం చేస్తే, అది సహజంగానే కార్మికులకు ప్రాతినిధ్యం వహించే పక్షాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. సుస్థిరత పేరిట ప్రభు త్వాలకు ఆ ఐదు సంవత్సరాల కాల వ్యవధిని గ్యారెంటీ చేయడం ఆ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించని ఇతరేతర వర్గాలకు నియంతృత్వంగానే పరిణమించగలదు. సుస్థిర నియంతృత్వమా? అస్థిర ప్రజాస్వామ్యమా?నేడు సంస్కరణల పేరిట అమలు జరుగుతోన్న విధానాల క్రమంలో, పేద ప్రజలకూ, సామాన్య జనానికీ ఇచ్చే సబ్సిడీలు లేదా రాయితీలపై నిరంతరంగా కోతలు పడుతున్నాయి. ప్రధాని మోదీనే స్వయంగా ‘రేవడి సంస్కృతి’ (ఉచితాల సంస్కృతి)పై చర్చ జరగా లంటూ చెప్పడాన్ని గమనించవచ్చు. ఈ సంక్షేమ వ్యయాలు లేదా ‘ఉచితాల’ గురించిన చర్చ అంతిమంగా అనేక దేశాలలో పొదుపు చర్యల రూపంలో ఆర్థిక మాంద్య స్థితికీ, అస్థిరతకూ కారణం కావడాన్ని కళ్ళ ముందే చూస్తున్నాం. గతంలో, అనేక లాటిన్ అమెరికా దేశాలలోనూ... యూరోప్‌లోని గ్రీస్‌లోనూ... ఈ మధ్య కాలంలోనే ఆసియా ఖండంలోని శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలలోనూ సామాన్య జనానికి కల్పించే రాయితీలను పొదుపు చర్యల పేరిట తగ్గించి వేయడం ఏ విధంగా సామాజిక విస్పోటనాలకూ, పోరా టాలకూ దారి తీసిందో చూశాం. ఇటువంటి, ప్రజా వ్యతిరేక, సంక్షేమ వ్యతిరేక నిర్ణయాలను మధ్య మధ్యలో వచ్చి పడే ఎన్నికల లేదా ప్రజా తీర్పుల భయం లేకుండా ఐదేళ్ల పాటు నిరాఘాటంగా తీసుకోగలిగే టందుకు మాత్రమే ఈ జమిలి ఎన్నికల ప్రక్రియ ఉపయోగపడ గలదు. కాబట్టి, ఇప్పటికే ప్రజలకు దూరమైన రాజకీయ వ్యవస్థలో రాజకీయ పక్షాలు, రాజకీయ నేతలను అదుపు చేయగలిగేటందుకు ప్రజలకు ఉన్న కాస్తంత అవకాశాన్ని కూడా, ఈ జమిలి ఎన్నికలు లేకుండా చేసేయగలవు. జమిలి ఎన్నికల ప్రక్రియ అనేది కేవలం ఎన్నికల వ్యయాలు లేదా రాజకీయ సుస్థిరతలకు సంబంధించిన అంశం కానే కాదు. అది, దేశ రాజకీయాలపై సామాన్య జనానికి పట్టు వుండాలా... లేదా కార్పొ రేట్లు, ధనవంతులు లేదా వారి అనుకూల రాజకీయ పక్షాలకు పట్టు ఉండాలా అనే అంశానికి సంబంధించింది అనేది సుస్పష్టం. సుస్థిర ప్రజా వ్యతిరేక పాలన కంటే, నిరంతరంగా ప్రజలకు లోబడిన, వారికి లొంగి వుండే అస్థిర రాజకీయ వ్యవస్థే మేలు.డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
సత్యం... శాశ్వతం... మూడక్షరాల లెనిన్!
‘వ్లాదిమిర్ ఇల్ల్యిచ్ ఉల్యనోవ్... లెనిన్... పోరాటమే జీవితం అయిన వాడు... తుది శ్వాస విడిచాడు’– ఈ మాటలు 1924 జనవరి 21వ తేదీన, నేటికి సరిగ్గా 100 ఏళ్ల క్రితం నాటి లెనిన్ మరణం గురించి ఆయన జీవిత చరిత్ర రచయిత రాబర్ట్ సర్వీస్ పుస్తకం లోనివి. అలాగే అదే రచయిత మరో సందర్భంలో పేర్కొన్నట్లుగా ‘20వ శతాబ్ద రాజకీయ నేతలలో, అధికార స్థానాన్ని ఈషణ్మాత్రం కూడా తన సొంతం కోసం వాడుకోనివాడు’ వ్లాదిమిర్ లెనిన్. మరణం నాటికి లెనిన్ వయస్సు కేవలం 53 సంవత్సరాలు. 1870 ఏప్రిల్ 22వ తేదీన రష్యాలోని సింబిర్క్స్ పట్టణంలో ఉన్నత విద్యా వంతులైన దంపతులకు మూడవ బిడ్డగా వ్లాదిమిర్ ఇల్ల్యిచ్ ఉల్యనోవ్ జన్మించాడు. ఉద్యమ ప్రస్థానంలో 1901లో లెనిన్ అనే మారు పేరును ఆయన ఎంచుకున్నాడు. నల్లేరు మీద నడక వంటి లెనిన్ కుటుంబం జీవితంలో మొదటి దెబ్బ ఆయన పదిహేనవ ఏట తండ్రి మరణంతో తగిలింది. ఆ తర్వాత లెనిన్ పదిహేడవ ఏట తనకు రోల్ మోడల్‌గా భావించిన తన అన్న... జార్ చక్రవర్తిని హత్యచేసేందుకు ప్రయత్నించి విఫలమై ఉరికంబం ఎక్కాడు. ఈ తరుణంలోనే ఆయన మార్క్సిజం అధ్యయనం దిశగా అడుగులు వేశారు. న్యాయశాస్త్రం అభ్యసించి 1892–93 కాలంలో న్యాయవాదిగా ప్రధానంగా రైతాంగం, చేతి వృత్తుల వారి కేసులను ఆయన వాదించాడు. 1893 ఆగస్టులో ఆయన సెయింట్ పీటర్స్బర్గ్ నగరాన్ని చేరి, అక్కడ మార్క్సిస్ట్ అధ్యయన బృందాలలో చురుకైన పాత్ర పోషించనారంభించారు. ఆ సమయంలోనే కార్మికులకు కార్ల్ మార్క్స్ రచించిన ‘పెట్టుబడి’ గ్రంథంపై ఆయన అధ్యయన తరగతు లను నిర్వహించారు. ఈ మార్క్సిస్ట్ విప్లవ భావాల ప్రచార క్రమంలోనే ఆయనతో పాటు కొందరు నాయకులు కూడా 1895 డిసెంబర్లో అరెస్ట్ అయ్యారు. 15 నెలల జైలు జీవితం అనంతరం, లెనిన్‌ను 3 సంవత్సరాల సైబీరియా ప్రవాసానికి నాటి జార్ ప్రభుత్వం పంపింది. అక్కడే ఆయనతో జత కలిసిన కృపస్కయాను ఆయన వివాహం చేసుకున్నారు. కృపస్కయా ఆయనకు జీవితకాల సహచరి, కామ్రేడ్, కార్య దర్శిగా గొప్ప పాత్ర పోషించారు. సైబీరియా ప్రవాసం 1900 జనవరిలో ముగిసింది. అయితే, రష్యాలో ఉండగా చట్టబద్ధంగా రాజకీయ కార్య కలాపాలు సాధ్యం కాదని నిర్ణయించుకొని లెనిన్ రష్యాను విడిచి జర్మనీలోని మ్యూనిక్ నగరాన్ని చేరుకున్నారు. ఈ ప్రవాస ప్రస్థాన క్రమంలో యూరోప్‌లోని అనేక నగరాలలో జీవించారు. తన తాత్విక గురువు ప్లకనోవ్, సహచరుడు మార్టోవ్లతో కలిసి ‘ఇస్క్రా’ (నిప్పురవ్వ) అనే పత్రికను స్థాపించారు. ఒక ప్రచార సాధనంగా, పార్టీ నిర్మాణానికి కేంద్ర బిందువుగా పత్రికల పాత్రను గుర్తించిన లెనిన్ అటు తర్వాత అనేక పత్రికల స్థాపన, నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. అలాగే, ఆ యా పత్రికలలో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాశారు. అలాగే, తన అన్న అలెగ్జాండర్ మరణం అనంతరం ఆయన ఆశయాన్ని స్వీకరించి, తీవ్రవాద దాడుల ద్వారా ఆ ఆశయాన్ని సాధించలేమని గుర్తించి కార్మిక రాజ్య లక్ష్యసాధ నకు ఏకైక మార్గంగా సంఘటిత పడ్డ కార్మిక జనాళి తాలూకు నిర్మాణానికి పూనుకున్నారు. ప్రవాసంలో ఉంటూనే పత్రికలూ, రష్యాలోని పార్టీ నిర్మా ణాల ద్వారా కార్మికవర్గంలోనూ, విస్తృత ప్రజానీకంలోనూ సోషలిస్ట్ భావజాల వ్యాప్తికి లెనిన్ కృషి చేశారు. ఈ క్రమంలోనే, మార్క్సిజం పట్ల, దాని సజీవ నిర్వచనం పట్ల వామ పక్షవాదులలో ఉన్న అనేక తప్పుడు ధోరణులపై ఆయన నిరంతర పోరాటం చేశారు. మార్క్సిజం అనేది పోరాట కరదీపిక అనీ... అది కరుడుగట్టిన పిడివాదం కాదనీ ఆయన నిరంతరం బోధించారు. పార్టీలో అంతర్గత పోరాట క్రమంలో మెన్షివిక్ బృందంతో తెగదెంపులు చేసుకొని 1903లో ‘బోల్షివిక్’ పార్టీని ఏర్పరచారు. అనంతరం 1905లో, రష్యా – జపాన్ యుద్ధంలో ఓటమి పాలైన రష్యాలో విప్లవ పోరాటం చెలరేగింది. దేశవ్యాప్త కార్మికుల సమ్మెలు, ఆర్థిక డిమాండ్ల స్థాయిని దాటి రాజకీయ పోరాటాలుగా మారాయి. అయితే, ఈ విప్లవాన్ని జార్ చక్రవర్తులు అణచివేయగలిగారు. కానీ, అంతిమంగా తమ ప్రజానీకానికి పాక్షిక ప్రజాతంత్ర హక్కులను ఇవ్వక చక్రవర్తికి తప్పలేదు. దీనిలో భాగంగానే పార్లమెంటరీ వేదికగా ‘డ్యూమా’ ఏర్పడింది. అలాగే, 1903లో మెన్షివిక్, బోల్షివిక్ పార్టీలుగా చీలిపోయిన సోషలిస్ట్ డెమోక్రాట్లు ఈ విప్లవ వైఫల్యం పట్ల ప్రతిస్పందించిన తీరూ... వారు దాని నుంచి తీసుకున్న పాఠాలు కూడా పూర్తిగా భిన్నమైనవి. ఈ విప్లవ వైఫల్యానంతరం మెన్షివిక్‌లు మరింత ఆర్థికవాదం, సంస్క రణవాద దిశగా మరలారు. కాగా, ఈ విప్లవ పరాజయం కార్మిక వర్గం మరింత మిలిటెంట్ పోరాటాలకు మరలవలసిన అవసరాన్ని చెబుతోందని లెనిన్ నేతృత్వంలోని బోల్షివిక్‌లు నిర్ధారించుకున్నారు. 1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభానికి ముందరే యూరప్‌లోని వివిధ దేశాల కమ్యూనిస్టులు యుద్ధం గనుక వస్తే, అది సామ్రాజ్యవాద దేశాలు, ప్రపంచంలోని మార్కెట్లను పంచుకొనేందుకు కొట్లాడుకొనేదిగానే ఉంటుంది గనుక ఆ యుద్ధాన్ని వ్యతిరేకించాలనీ... తమ తమ దేశాల సైనికులకు ఈ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చేందుకు వారు తమ తమ దేశాల పెట్టుబడిదారుల పైకి తమ తుపాకులను తిప్పేలా పిలుపునివ్వాలనీ నిర్ణయించారు. అయితే, తీరా యుద్ధం మొదలయ్యాక అనేక దేశాల పార్టీలు జాతీయత, దేశభక్తి పేరిట తమ తమ దేశాల ప్రభుత్వాలను సమర్థించుకోసాగాయి. ఈ నేపథ్యంలో, ఒక్క లెనిన్ మాత్రమే సూత్రబద్ధ వైఖరి తీసుకొని ఈ యుద్ధంలో రష్యా ప్రవేశానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈ యుద్ధంలో రష్యా సైనికులు, కార్మికులు తమ ఆయుధాలను స్వదేశీ పెట్టుబడిదారులపైకి తిప్పాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాదులు తమ తమ స్వప్రయోజనాల కోసం, మార్కెట్లను పంచుకోవడం కోసం కొట్లాడుకొనే ఈ యుద్ధంలో వివిధ దేశాల పేద కార్మికులూ, సైనికులూ పరస్పరం చంపుకోవడం కూడనిదని ఆయన ఉద్భోధించారు. కాగా, కడకు 1917 నాటికి ఈ యుద్ధ క్రమంలో తీవ్ర ప్రాణ నష్టానికి, కడగండ్లకు గురైన రష్యా సైనికులు, కార్మికులు యుద్ధం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయసాగారు. అలాగే, కాస్తంత సొంత భూమి కోసం తపన పడుతోన్న రష్యా రైతాంగం కూడా ఈ అసంతృప్తిలో భాగస్వామి అయ్యింది. దీని పర్యవసానమే 1917 ఫిబ్రవరి విప్లవం. అయితే, ఈ విప్లవ క్రమంలో అధికారంలోకి వచ్చిన మెన్షివిక్‌లు తదితరులు మెజారిటీ రష్యా ప్రజానీకం ఆకాంక్ష అయిన యుద్ధం నుంచి వైదొలగాలన్న దానిని గౌరవించలేదు. వారు ఆ యుద్ధంలో కొనసాగారు. ఈ దశలోనే, స్విట్జర్లాండ్ నుంచి సీల్ వేసిన రైలు పెట్టెలో జర్మనీ గుండా రష్యాలో అడుగిడిన వ్లాదిమిర్ లెనిన్... ‘కార్మి కులకు రొట్టె, రైతుకు భూమి, సైనికుడికి శాంతి’ నినాదంతో మరో విప్లవం దిశగా సాగాల్సిన అవసరాన్ని ‘1917 ఏప్రిల్ థీసిస్’ ద్వారా రష్యా ప్రజల ముందు ఉంచారు. దీనితో అభద్రతకూ... ఆగ్రహానికి లోనైన మెన్షివిక్ ప్రభుత్వం లెనిన్‌ను అరెస్ట్ చేసేందుకు నిర్ణయించింది. పర్యవసానంగా మరికొద్ది కాలం పాటు రష్యా సరిహద్దులోని ఫిన్లాండ్లో ఒక కార్మికుడి ఇంట అజ్ఞాతంగా గడిపిన లెనిన్, అనంతరం అక్టోబర్ నాటికి విప్లవానికి బోల్షివిక్ పార్టీని సమాయత్తం చేశారు. ఈ మొత్తం క్రమంలో పార్టీలో అంతర్గతంగా కూడా వ్యతిరేకతను ఎదు ర్కొన్నారు. మొత్తంగా, 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం నుంచీ... 1917 అక్టోబర్ వరకూ ఆయన దాదాపు ఒంటరిగానే విప్లవ చోదక శక్తిగా... ప్రపంచ పీడిత జనాళి పథ నిర్దేశకుడిగా ముందు నడిచారు. అక్టోబర్ విప్లవానంతరం, సోవియట్ సోషలిస్ట్ రాజ్యాన్ని కూల్చివేసేందుకు దాడి చేసిన పద్నాలుగు పెట్టుబడిదారీ దేశాల సైన్యాలనూ, వైట్గార్డుల రూపంలో అంతర్గత శత్రు వులనూ తిప్పి కొట్టడంలోనూ... జర్మనీతో బ్రెస్ట్లిటోవుస్క్ సంధి చేసుకోవడం వంటి విషయాలలో ట్రాట్స్కీ వంటి వారి అతివాద పోకడలను అదుపులో పెట్టడం లోనూ లెనిన్ పాత్ర అద్వితీయం. ఈ క్రమంలో ఆయన పైన జరిగిన తుపాకీ కాల్పుల హత్యాయత్నం, తీవ్రమైన పని ఒత్తిడి వంటివి ఆయన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీశాయి. 1917 విప్లవానంతరం 1922 వరకూ రష్యాలో అంతర్యుద్ధం జరిగింది. 1921లో ఆరోగ్య సమస్యలు బయటపడడం మొదలైన తర్వాత 1924 జనవరి 21 వరకు ఆయన స్థితి దిగజారుతూనే ఉంది. అయినా, చివరి క్షణం వరకూ లెనిన్ విప్లవాన్ని కంటికి రెప్పలా కాపాడుకొనేందుకు పెనుగులాడుతూనే ఉన్నారు. పక్షవాతంతో మంచం పట్టినా పట్టువిడవని దీక్షతో చివరి క్షణం వరకూ విప్లవ పురోగతి కోసం ఆయన తపన పడ్డారు. తాను ముందు ఊహించినట్లుగా రష్యా విప్లవాన్ని అనుసరించి జర్మనీ వంటి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో విప్లవాలు జరగకపోవడంతో నాడు ప్రపంచ విప్లవ కేంద్రబిందువు, తూర్పు దిశగా కదిలిందని ఆయన సూత్రీకరించారు. పర్యవసానంగా చైనాలో విప్లవం జరిగే అవకాశాన్ని కూడా ఆయన ప్రతిపాదించారు. పెట్టుబడిదారులు మార్కి ్సజానికి కాలం చెల్లిపోయిందంటూ చేస్తున్న అసత్య ప్రచారాల ద్వారా మార్క్స్, లెనిన్లను పలచన చేయనారంభించారు. అయితే, అంతిమంగా ఈ మధ్యనే ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారీ పత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’ నేటి యుగంలో లెనిన్ లేవనెత్తిన ప్రశ్నలకు ఇంకా సమకాలీనత ఉందంటూ వ్యాఖ్యానించడం వాస్తవాలకు అద్దం పడుతోంది. అయితే, అదే పత్రిక లెనిన్ లేవనెత్తిన ప్రశ్నలకు ఆయనే ఇచ్చిన జవాబు మాత్రం సరైనది కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఆ పత్రిక తాలూకు అనివార్య అగత్యం. మూడు దశాబ్దాల క్రితం రచయిత అదృష్ట దీపక్ లెనిన్ గురించి చెప్పిన ఈ మాటలు నేడు మరింత వాస్తవం: ‘అతీత గత అవస్థలను ఎరుగని అఖండ కాలం పేరు లెనిన్, హృదయ స్పందన వీనుల సోకే ప్రతీ ప్రదేశం పేరు లెనిన్...’ డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు మొబైల్: 98661 79615 -
సంస్కరణల జోరులో సమిధలు
సంస్కరణలను ఆశించిన స్థాయిలో వేగిరపర్చనందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి తెగడ్తలు, వాటిని నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తున్నందుకు ప్రధాని మోదీకి ప్రశంసలూ.. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలూ, రేటింగ్ ఏజెన్సీల కథ ఇదే మరి. ఈ మధ్యనే ప్రపంచ బ్యాంకు వివిధ దేశాలకు ఇచ్చే, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగులు ప్రకటించారు. ఈ ర్యాంకింగులలో మన దేశానికి 100వ ర్యాంకు వచ్చింది. 3 సం‘‘ల క్రితం మోదీ అధికారంలోకి వచ్చేనాటికి ఈ సూచికపై మన ర్యాంకింగ్ మొత్తం 189 దేశాలలో 130కి పైబడే ఉంది. అంటే మూడేళ్ల కాలంలో ఈ ర్యాంకింగ్ బాగా వృద్ధి చెందింది. అందుకే మోదీ ఈ ర్యాంకింగ్‌ను తానూ, తన ప్రభుత్వం అమలు జరిపిన సంస్కరణల తాలూకు ఘనతగా చెప్పుకొంటున్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా భిన్నమైన, ప్రతికూలమైన ఆర్థిక ముఖచిత్రాన్ని మన కళ్ళముందుంచుతున్నాయి. 2017–18 ఆర్థిక సం‘‘ తాలూకు తొలి త్రైమాశికం (ఏప్రిల్–జూన్)లో దేశ స్థూల జాతీయ వృద్ధి రేటు అంతకుముందరి కాలం కంటే భారీగా దిగజారి 5.7%గా నమోదు అయ్యింది. గత ఆర్థిక సం‘‘ (2016–17) ప్రథమ త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు సుమారుగా 7.9%గా ఉంది. అంటే ఈ సం‘‘ కాల వ్యవధిలో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 2.2% మేరన దిగజారింది. దీనికి ప్రస్తుతం కళ్ళముందు కనబడే కారణాలు పెద్ద నోట్ల రద్దు, హడావుడి జి.ఎస్.టి అమలుదలలు. అయితే నిజానికి ఈ రెండు అస్తవ్యస్త ఆర్థిక నిర్ణయాలు మాత్రమే నేటి జి.డి.పి దిగజారుడుకు కారణాలు కావు. 2014 మే నెలలో నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికి ఆయనపైన ప్రజలు ఏర్పరచుకొన్న సానుకూల భావన తాలూకు సెంటిమెంటూ, నాటి అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ఆయనకు బాగా అనుకూలించాయి. వీటిల్లో ప్రధానమైనవి ముడి చమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం, అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో కమోడిటీల ధరలు కూడా తగ్గుతుండటం. ముఖ్యంగా అంతకు ముందటి కాలంలో బ్యారల్‌కు సుమారుగా 130 డాలర్ల వరకూ చేరిన ముడిచమురు ధరలు మోదీ పాలన ఆరంభం నుంచీ వేగంగా తగ్గుతూ ఒకానొక దశలో బ్యారల్‌కు 30 డాలర్లకు కూడా చేరాయి. దీని ఫలితంగా ముడిచమురును భారీగా దిగుమతి చేసుకొనే మన దేశానికి, పెద్ద స్థాయిలో విదేశీమారక ద్రవ్యం పొదుపు అయ్యింది. ఫలితంగా మోదీ ప్రభుత్వానికి ఎంతో కొంత ప్రజలకు ఆకర్షణీయంగా కని పించే అవకాశం లభించింది. కానీ గత సం‘‘ కాలంపై నుంచీ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమేణా పెరుగుతూ నేడు సుమారుగా బ్యారల్‌కు 60 డాలర్ల పైకి చేరుకున్నాయి. ఈ పరిస్థితికి తోడుగా మూలిగే నక్కపై తాటికాయలా నోట్ల రద్దు, హడావుడి జి.ఎస్.టి అమలు తోడయ్యాయి. తాను అమలు జరిపిన సంస్కరణల వలన దేశంలో వ్యాపారం చేసేందుకూ, పెట్టుబడులు పెట్టేందుకు పరిస్థితులు మెరుగు కావటంతో గత 3 సం‘‘లో దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 67% దాకా పెరిగాయని మోదీ చెప్పుకుంటున్నారు. కానీ, పారిశ్రామిక పెట్టుబడులు పెరిగినా నిరుద్యోగం మాత్రం మరింత వేగంగా ఎందుకు పెరుగుతోందో జవాబు చెప్పే బాధ్యత ఆయన పైనే ఉంది. 1991లో దేశంలో సంస్కరణల ఆరంభం అనంతరం ఆర్థిక అసమానతలు, నిజవేతనాల పతనం, పెరిగిన అవినీతి వంటివన్నీ మనం చూసినవే. కాగా నేడు మోదీ ఈ దుష్పరిణామాల సంస్కరణలనే, తాను వేగంగా అమలుజరిపాననీ, ఇక ముందు మరింత వేగంగా అమలు జరుపుతాననీ చెబుతున్నారు. నేడు వేగవంతమవుతోన్న ఆర్థిక సంస్కరణలు ముందుముందు ఖచ్చితంగా సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులను మరింత దిగజారుస్తాయి. ఉపాధి హామీ పథకం పట్ల కేంద్రప్రభుత్వం ఆలోచనలూ, ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలూ, ఎరువులవంటి వాటిపై సబ్సిడీల ఎత్తివేత ద్వారా రైతాంగంపై మరింత పెరుగుతోన్న భారాలు, గ్యాస్ సబ్సిడీ వంటి వాటిని మెల్లమెల్లగా తొలగించి వేస్తుండటంతో మధ్యతరగతీ, పేదవర్గాలపై పడుతోన్న అదనపు ఆర్థిక భారాలు తది తరం రానున్న రోజులలో ప్రజల కడగండ్లను మరింత పెంచుతాయి. కాగా, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలకు అనుకూలమైన తీరులో సంస్కరణలను వేగిరపరచ లేకపోయినందుకే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అంతర్జాతీయ మీడియా నిష్క్రియాపరుడని స్టాంపులు వేసింది. సంస్కరణలను వ్యతిరేకిస్తున్నందుకు వామపక్షాలను ప్రగతి విఘాతమైనవిగా చిత్రీకరిస్తున్నారు. దీనికి భిన్నంగా అదే సంస్కరణలను నిర్ధాక్షిణ్యంగా, వేగంగా అమలు జరుపుతున్నందుకు అదే అంతర్జాతీయ సంస్థలు, మీడియా మోదీని ఉక్కుమనిషిగా, క్రియాశీలుడిగా అభినందిస్తున్నాయి. ఇంత జరిగి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజి నెస్’ ర్యాంకింగ్ భారీగా మెరుగుపడినా అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు మాత్రం, ఇంకా తృప్తిపడలేదు. 10 ఏండ్ల క్రితం తామిచ్చిన బి.బి.బి. రేటింగును పెంచాలంటే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ తో పాటుగా ద్రవ్యలోటు, స్థూల జాతీయ ఉత్పత్తిలో ఋణ శాతం అంశాలలో కూడా మెరుగుదల తేవాలని ఆ సంస్థలంటున్నాయి. మొత్తం దేశాన్నే తమ ఆర్థిక ఆకలికి అర్పించుకొన్న తీరని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలూ, రేటింగ్ ఏజెన్సీల కథ ఇదే మరి. - డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు ‘ 98661 79615 -
ద్రవ్యలోటు... కాదు చేటు
అధిక ద్రవ్యలోటుతో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పేమీ కాదనే అభిప్రాయం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక శాస్త్రవేత్తలలో బలపడుతోంది. ఈ మార్పునకు మోడీ ప్రభుత్వం స్వాగతం పలుకుతుందా? పట్టంగట్టిన ప్రజలు ఆశిస్తున్నట్టుగా రానున్న బడ్జెట్లో ఉపాధి కల్పనకు, ఆదాయాల పెంపుదలకు పెద్ద పీట వేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వ ఆర్థిక విధానాలు, వాటి స్వభావం స్పష్టం కావాల్సి ఉంది. 1990లలో నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ద్రవ్యలో టును తగ్గించడమనేదే అన్ని ప్రభుత్వాల ఆర్థిక విధానాలకు కేంద్ర బిందువు. ప్రభుత్వ వార్షిక రాబడి కంటే వ్యయం ఎక్కువగా ఉండటమే ద్రవ్యలోటు. ఉదాహరణకు, పన్నుల వసూళ్లు, తదితర ఆదాయ వనరుల ద్వారా కేంద్రానికి లభించే వార్షిక రాబడి రూ.100, వ్యయం రూ.105 అనుకుంటే... ద్రవ్య లోటు 5 శాతమవుతుంది. ద్రవ్యలోటు తగ్గింపు పేరిట యూపీఏ సర్కారు విధించిన ప్రభుత్వ వ్యయాలలోని కోతలన్నీ ప్రధానంగా సామాన్య ప్రజల సంక్షేమ పథకాలపైనే పడ్డాయి. పైగా వినియోగదారుల సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలలో కూడా కోత లు పడ్డాయి. ఫలితంగా ఎరువులు, పెట్రో, వంట గ్యాస్ ధరలు పెరిగాయి. యూపీఏ ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాల ప్రధా న లక్ష్యం ఆహార సబ్సిడీలు సహా వినియోగదారుల సబ్సిడీలన్నిటికీ తూట్లు పొడవడమే. ఈ చర్యలతో ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించగలిగారు. కానీ ఆర్థిక వ్యవస్థ కోలుకున్న దాఖలాలు మాత్రం లేవు. ఏమిటీ ద్రవ్యలోటు? ఇంతకూ ద్రవ్యలోటు అధికంగా ఉంటే వచ్చి పడే విపత్కర సమస్యలేమిటి? నియంత్రించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటి? అని సందేహం రావ డం సహజం. ద్రవ్యలోటు పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగి, నిత్య జీవితావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయని, కరెన్సీ విలువ పడిపోతుందని పలువురు ఆర్థిక శాస్త్రవేత్తల సమాధానం. అయితే మన దేశంలో వ్యవసాయ, వినియోగ మార్కెట్లలోని గుత్తాధిపత్య ధోరణులు, దొంగ నిల్వల వంటి అక్ర మ వ్యాపార పద్ధతులే ధరలను ప్రత్యేకించి ఆహార, వినియోగ వస్తువుల ధరలను ఎక్కువగా నియంత్రిస్తాయని వారు విస్మరిస్తున్నారు. ద్రవ్యలోటు గురిం చి ఎక్కువగా ఆందోళన చెందుతున్నది బడా వ్యాపార, పారిశ్రామిక వర్గాలే. 2008 నుంచి అధిక స్థాయిలో ఉన్న (సగటున ఏటా 10 శాతం) ద్రవ్యోల్బణం ఫలితంగా నేడు షేర్ మార్కెట్ సూచి 25,000 స్థాయికి చేరింది. అయినా షే ర్ల నిజ విలువ మాత్రం 2008లో సెన్సెక్స్ 13,000 స్థాయిలో ఉన్నప్పటి స్థా యిలోనే ఉంది. ఇలా పడిపోతున్న షేర్ మార్కెట్ మదుపుల విలువను భర్తీ చేసుకోవాలని వ్యాపార వర్గాల తాపత్రయం. ద్రవ్యలోటును తగ్గించడం పేరిట సంక్షేమ వ్యయాలలో కోతలను విధించి, ప్రభుత్వ రాయితీల లబ్ధిని పొందాలని ఆశిస్తున్నాయి. ఉత్పత్తి వృద్ధి, ఉద్యోగిత మెరుగుపడకపోయినా కృత్రిమంగా షేర్ మార్కెట్లు విజృంభించేలా చేసి లబ్ధిని పొందాలని భావిస్తున్నాయి. ద్రవ్యలోటును తగ్గించడమే పరమ కర్తవ్యంగా బోధిస్తున్నాయి. మాంద్యానికి విరుగుడు ‘లోటు’ ద్రవ్యలోటు తక్కువగా ఉంటేనే వృద్ధి, ఉపాధి కల్పన సాధ్యమనడానికి ఆధారాలు లేవు. నిజానికి 1930లలో ఏర్పడ్డ ఆర్థిక మహా మాంద్యానికి పరిష్కారంగా అమెరికా సహా ప్రపంచంలోని సంపన్న దేశాలన్నీ ద్రవ్యలోటు విధానాలనే అనుసరించాయి. లోటు బడ్జెట్ విధానాలతో ప్రభుత్వ వ్యయాలను, ఉ పాధి అవకాశాలను పెంచి కొనుగోలు శక్తిని, డిమాండును పెంచడం ద్వారా వృద్ధి, వికాసం సాధ్యమని జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థిక సిద్ధాంతాల సారం. ఆ సిద్ధాంతాలే నాడు ప్రపంచానికి శిరోధార్యమయ్యాయి. రెండవ ప్రపంచ యు ద్ధానంతరం దశాబ్దాల తరబడి సాగిన అమెరికా, యూరప్‌ల ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డాయి. 1970లలో ఉత్పత్తి రంగ వృద్ధి మందగించి, పెట్టుబడులపై లాభాలు సన్నగిల్లడం ప్రారంభమైంది. పైగా ఉద్యోగాలు లేని వృద్ధి దశగా చెప్పే ఫైనాన్స్ (ద్రవ్య) పెట్టుబడి ఆధిపత్యపు దశ మొదలైంది. ప్రత్యేకించి 1980ల నుంచి ఈ ఉద్యోగాలు లేని వృద్ధి ధోరణే బలపడింది. అదే నేడు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి, అల్ప ఉద్యోగిత, అల్ప ఆదాయాల ఊబి లోకి నెట్టింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలను, కొనుగోలుశక్తిని పెంచడానికి దోహదపడే రీతిలో ప్రభుత్వ వ్యయాలను పెంచకుండా ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కే అవకాశం లేదు. ఆహ్వానించదగిన మార్పు గత రెండేళ్లుగా మన దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించి 4.7 శాతం పరిధిలోనే ఉండిపోయింది. దీంతో నిరుద్యోగం పెరిగిపోయింది, కొనుగోలు శక్తి పతనమైంది. సహజంగానే ఇది డిమాండు తగ్గుదలకు దారితీసింది. దీంతో ప్రైవేటు పెట్టుబడిదారులు, ప్రత్యేకించి పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆదాయాలను, కొనుగోలు శక్తిని పెంచితే తప్ప డిమాండు పుంజుకోదు, ప్రైవేటు పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు కాబట్టి ప్రభుత్వం రంగంలోకి దిగడం తప్ప గత్యంతరం లేదు. కానీ యూపీఏ విధానాలు ప్రజల కొనుగోలు శక్తిని, డిమాండును మరింతగా దిగజార్చే దిశగా సాగాయి. ఈ స్థితిలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆశలను రేకెత్తించింది. వాటిని నెరవేర్చాలంటే గత రెండు దశాబ్దాలుగా అమలయిన ‘షేర్ మార్కెట్ వృద్ధి’ పంథాను వీడక తప్పదు. అది నిరాశామయమైన ఆర్థిక పరిస్థితుల నడుమ కొందరు శత కోటీశ్వరులను సృష్టించడానికి మాత్రమే తోడ్పడింది. ఈ పరిస్థితుల్లో నూతన ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్థిక సలహాదారుగా అరవింద్ పనగారియ నియమితులవుతారని వినవస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆసియా అభివృద్ది బ్యాంకు మాజీ ప్రధాన సలహాదారు, కొలంబియా విశ్వవిద్యాలయ ఆచార్యులు అయిన పనగారియ... గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా కొత్త ప్రభుత్వం ఒక మేరకు అధిక ద్రవ్యలోటును ఆమోదించయినా ప్రభుత్వ పెట్టుబడుల వ్యయాన్ని పెంచాలని అభిప్రాయపడటం విశే షం. ప్రముఖ అంతర్జాతీయ కన్సెల్టెన్సీ సంస్థ ‘మెకెన్సీ’ సైతం అధిక ద్రవ్య లోటుతో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పేమీ కాదని పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం నేర్పిన గుణపాఠాలతో అంతర్జాతీయంగా ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయాలలో మార్పు వస్తోంది. ఆహ్వానించదగిన ఈ మార్పునకు మోడీ ప్రభుత్వం స్వాగతం పలుకుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మోడీ బడ్జెట్ దిశ ఎటు? ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం అంతర్జాతీయ అనుభవాలను గమనంలోకి తీసుకోవాల్సి ఉంది. గ్రీస్, స్పెయిన్, ఇటలీ వంటి పాశ్చాత్య దేశాలు సైతం ఆర్థిక మాంద్యానికి గురై, అల్ప ఉద్యోగిత, అల్ప ఆదాయాలు, అల్ప కొనుగోలు శక్తి, అల్ప డిమాండు, తిరిగి అల్ప వృద్ధి, భారీ నిరుద్యోగిత అనే విషవలయంలో చిక్కుకుపోయాయి. యూపీఏలాగా ఆ దేశాల ప్రభుత్వాలు ‘పొదుపు చర్యల’ పేరిట అమలు చేసిన ద్రవ్యలోటు తగ్గింపు విధానాలు వాటిని మరింత సంక్షోభంలోకి, ప్రభుత్వ రుణాల ఊబిలోకి దించాయి. విపరీత రుణ భారానికి గ్రీస్ పతనావస్థకు చేరింది. ఆ దేశ యువతలో దాదాపు 50 శాతం నిరుద్యోగులే. స్పెయిన్‌లోనూ ఇంచుమించుగా అదే పరిస్థితి నెలకొంది. సంక్షేమ వ్యయాలకు బడ్జెట్ కేటాయింపులలో భారీ కోతలు, ప్రభుత్వోద్యోగుల తొలగింపు, వేతనాల తగ్గింపు, పార్ట్ టైమర్ల వంటి అసంఘటిత, అల్ప వేతన ఉద్యోగుల నియామకాలు తదితర పొదుపు చర్యలు చేపట్టారు. ఈ ద్రవ్యలోటు తగ్గింపు విధానాలు పరిస్థితి మరింతగా దిగజారడానికే దారితీశాయని ఇప్పటికే రుజువయింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే తొలి ‘మోడీ బడ్జెట్’కు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం పట్టంగట్టిన ప్రజలు ఆశిస్తున్నట్టుగా బడ్జెట్లో ఉపాధి కల్పనకు, ఆదాయాల పెంపుదలకు పెద్దపీట వేస్తుందా? లేక యూపీఏలాగా కొద్ది మంది కుబేరులకు, షేర్, ద్రవ్య మార్కెట్ స్పెక్యులేటర్ల ప్రయోజనాలే పరమార్థంగా భావిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. ఈ అంశమే కొత్త ప్రభుత్వం దిశ ఎటో తేల్చి చెప్పే గీటురాయి అవుతుంది. ద్రవ్యలోటును కట్టడి చేయాల్సిందేనంటూ ఆర్థిక మంత్రి జైట్లీ ఇప్పటికే చేసిన వ్యాఖ్యలు అందుకే ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. - (వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు) డి. పాపారావు -
ప్రధాని కాదు, విధానం మారాలి
నిజానికి 2008, సెప్టెంబర్‌లో అమెరికాలో అతి పెద్ద ఆర్థిక సంక్షోభం మొదలయింది. కానీ అదే సమయంలో మనదేశంలో పరిస్థితులు చాలావరకు స్థిరంగా ఉన్నాయి. 2009లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నాటి మన ఆర్థిక మంత్రి ఈ మేరకు ఉటంకించారు కూడా. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. దీనికి మన పాలకుల తీరే కారణం. సంక్షోభంలో పడిపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే కృషిలో మన పాలకులు శక్తి మేరకు భాగస్వామ్యం తీసుకున్నారు. అభివృద్ధి చెందుతున్న పలు దేశాల షేర్మార్కెట్ల మాదిరిగానే, భారత్ షేర్ మార్కెట్ కూడా కొద్దివారాలుగా డోలాయమాన పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నది. దీనితో పాటు వివిధ దేశాల కరెన్సీల విలువలూ క్షీణించాయి. మన రూపాయి విలువ కూడా కాస్త తగ్గింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. అమెరికా తన ఆర్థిక ఉద్దీపన పథకాన్ని కుదించడం ఒకటి కాగా, చైనా ఆర్థికవృద్ధిలో తగ్గుదల రెండో కారణం. అమెరికా ఉద్దీపనతో పాట్లు 2012, సెప్టెంబర్ నుంచి అమెరికా ఫెడరల్ బ్యాంక్ నెలవారీ 85 బిలియన్ డాలర్లను దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెడుతున్నది. దేశ ప్రజలలో పడిపోయిన కొనుగోలు శక్తిని మళ్లీ పెంపొందించి ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుంచి గట్టెక్కించడమే ఈ ఉద్దీపన పథకం లక్ష్యం. మొత్తానికి 2013 సంవత్సరం మధ్య నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోసాగింది. ఉపాధి, కొనుగోలు శక్తి, గృహ కొనుగోలు రంగం వంటి వాటి సూచీలు మెరుగ్గా కనిపించసాగాయి. దానితో ఈ నెలవారీ ఉద్దీపన పథకాన్ని కొంత మేరకు తగ్గించాలని ఫెడరల్ బ్యాంక్ ఆలోచించింది. ఆర్థిక వ్యవస్థలో సానుకూల సంకేతాలు స్పష్టమైనాక ఉద్దీపన పేరుతో మరిన్ని డాలర్ల ముద్రణ, చలామణీ మంచిదికాదు. చలామణీ పెరిగి డాలరు విలువ మరింత తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే అమెరికా తన ఉద్దీపన పథకంలో మొత్తాన్ని 85 బిలియన్ల నుంచి 65 బిలియన్ డాలర్లకు తగ్గించింది. అమెరికా తీసుకున్న ఈ చర్యే అభివృద్ధి చెందుతున్న దేశాల షేర్ మార్కెట్లకు సంకటంగా పరిణమించింది. గతంలో మాదిరిగా ఈ మార్కెట్లకు డాలర్ పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడం మొదలయింది. ఫలితంగానే భారత్ సహా, అభివృద్ధి చెందుతున్న దేశాల షేర్ మార్కెట్ల సూచీలు నేల చూపులు చూడడం మొదలయింది. అదేసమయంలో చైనా నుంచి నిరాశాజనకమైన గణాంకాలు వెలువడ్డాయి. అదీకాక ఇప్పుడు సరుకుల దిగుమతిలో చైనాది పెద్ద స్థానం. చైనా వృద్ధి త గ్గితే ఆ దేశం ఎగుమతుల మీద ఆధారపడి ఉన్న దేశాల మాటేమిటి? ఈ పరిణామంతోనే కొన్ని దేశాల మార్కెట్లలో పతనం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ పరిణామం నుంచి అదృష్టవశాత్తు భారత్‌కు మినహాయింపు ఉంది. చైనాకు మన దేశం నుంచి ఎగుమతులు తక్కువే. కానీ, నెలవారీ ఉద్దీపన పథకాన్ని కుదించాలని అమెరికా తీసుకున్న నిర్ణయం మాత్రం భారత్‌కు పెద్ద సమస్యనే సృష్టించి పెట్టింది. 2013, మే నెలలో ఈ ఉద్దీపన పథకం కుదింపు గురించిన వార్త రాగానే మన షేర్ మార్కెట్ సూచీలలో, రూపాయి విలువలో పతనం కనిపించింది. అంతకు ముందు ఒక దశలో డాలర్ విలువ రూ.69కి సమానమైంది. తరువాత మన రిజర్వు బ్యాంక్ చేపట్టిన కొన్ని చర్యలు, ఉద్దీపన తగ్గించే యోచన లేదంటూ అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఇచ్చిన ప్రకటన రూపాయి కోలుకొనడానికి అవకాశం కల్పించాయి. కానీ గత రెండు మూడు మాసాలుగా అమెరికా ఉద్దీపన పథకంలో కోత మొదలై, రెండు దఫాలుగా ఇరవై బిలియన్ డాలర్ల మేర తగ్గడంతో మళ్లీ సమస్య కొంత వరకు మొదటికి వచ్చినట్టయింది. షేర్ మార్కెట్ సూచీలలో, రూపాయి విలువలో ప్రస్తుతం కనిపిస్తున్న సందిగ్ధత దీని ఫలితమే. మన నేతల వెన్నెముక లేని తనం ఈ పరిణామాలతోనే వెల్లడవుతోంది. రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ వ్యాఖ్యలే దీనికి తార్కాణం. జనవరి 29న ఆయన అమెరికా ఉద్దీపన పథకం కుదింపు గురించి చెబుతూ, ‘అంతర్జాతీయ ద్రవ్య సహకారం కుప్పకూలిపోయింద’ని అన్నారు. కానీ, 2008 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తినపుడు దాని నుంచి బయటపడడానికి సాయపడినవి అభివృద్ధి చెందుతున్న దేశాలే. కాబట్టి, ‘పారిశ్రామిక దేశాలు ప్రస్తుత దశలో చేతులు దులుపుకుని పోరాదు. మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామని అనరాదు. మా సమస్యలు మేం పరిష్కరించుకోగలమని చెప్పరాదు’. ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం ఉన్న పాశ్చాత్య దేశాల గురించి మన రిజర్వు బ్యాంక్ గవర్నర్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ ఫిబ్రవరి మూడున మళ్లీ రాజన్గారే అమెరికా ఫెడరల్ బ్యాంక్ గవర్నర్ జానెట్ ఎలెన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ‘ఆమె సరైనా రీతిలో వ్యవహరిస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది’ అన్నారాయన. ఇదీ ఆయన ప్రయాణం. అక్కడ సంక్షోభం... నిజానికి 2008, సెప్టెంబర్‌లో అమెరికాలో అతి పెద్ద ఆర్థిక సంక్షోభం మొదలయింది. కానీ అదే సమయంలో మనదేశంలో పరిస్థితులు చాలావరకు స్థిరంగా ఉన్నాయి. 2009లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నాటి మన ఆర్థికమంత్రి ఈ మేరకు ఉటంకించారు కూడా. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. దీనికి మన పాలకుల తీరే కారణం. సంక్షోభంలో పడిపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే కృషిలో మన పాలకులు శక్తి మేరకు భాగస్వామ్యం తీసుకున్నారు. 2008 నాటి పౌర అణు ఒప్పందం దీనిలో భాగమే. అమెరికాకు చెందిన భారీ అణు రియాక్టర్ సాంకేతిక సంస్థలకు లబ్ధి చేకూర్చడం, అమెరికాలో ఉండేవారికి అధిక వేతనాలతో ఉపాధి కల్పన కూడా ఈ ఒప్పందంలో అంతర్భాగమే. కంపెనీల అమ్మకాలు పడిపోయి ప్రజల కొనుగోలు శక్తి కూడా పడిపోయిన దశలో ఇదంతా అమెరికాకు ఊరటే. ఇంకా, అమెరికా బహుళ జాతి ఆయుధ తయారీ సంస్థల నుంచి కూడా మనం కొనుగోళ్లు చేశాం. ఇది చాలదన్నట్టు మన దేశీయ కంపెనీలు (2013 నాటికి) 11 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో అమెరికాలో లక్ష ఉద్యోగాలను సృష్టించి పెట్టాయి. మరోపక్కన బరాక్ ఒబామా ప్రభుత్వం మాత్రం భారతీయుల ఔట్సోర్సింగ్ అవకాశాలను నిలువరించడానికి చేయని ప్రయత్నం లేదు. నిజానికి అమెరికాకు భారత్ అతి పెద్ద మార్కెట్ అని ఆయన భారత పర్యటనలో బాహాటంగానే చెప్పారు. కృతజ్ఞత లేని అమెరికా ఏమైతేనేమి! రకరకాల అంతర్జాతీయ సాయాలతో, కాయకల్ప చికిత్సలతో అమెరికా నేడు కొంత మేరకు కోలుకొన్నట్టే కనపడుతోంది. దానితో దాని నిజ స్వరూపం కూడా బయటపడడం మొదలయింది. కష్టకాలంలో సాయపడిన భారత్ వంటి దేశాలను నట్టేట వదిలి అమెరికా తన స్వార్థం తాను చూసుకుంటోంది. నిజానికి, రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామరాజన్ జనవరి 29న బయటపెట్టిన ఆక్రోశం సారాంశం ఇదే. ఇప్పుడు అమెరికా తన ఉద్దీపన పథకాన్ని అకస్మాత్తుగా కుదించుకోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలలోకి వస్తున్న డాలర్ల ప్రవాహం ఆగిపోతోంది. లేదా తగ్గుతున్నది. ఫలితంగానే ఆయా దేశాల షేర్ మార్కెట్లు నష్టపోతున్నాయి. ఉద్దీపన పథకం కుదింపుతో డాలర్ ముద్రణ తగ్గి విలువ పెరుగుతోంది. దీనితో వివిధ దేశాల మార్కెట్లలో వివిధ రకాల కరెన్సీల రూపంలో ఉన్న పెట్టుబడులు నేడు డాలర్ల కోసం అమెరికా వైపు పరుగులు తీస్తున్నాయి. డాలర్ విలువ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. మన రూపాయి మాదిరిగానే, అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ విలువ పడిపోవడానికి కూడా ఇదే కారణం. మన షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు వాటిని అమ్మేసి, అమెరికా డాలర్లకు మళ్లుతున్నారు. డాలర్ విలువ పెంచుతున్నారు. నేడు రూపాయి పరిస్థితి కొంత నిలకడగానే కనపడుతోంది. బహుశా ఇది తాత్కాలికమే కావచ్చు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద ఈ విలువ, దాని భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటాయన్నది కూడా ఒక అంచనా. ఎన్నికల అనంతరం దేశంలో స్థిరమైన మార్కెట్ అనుకూల ప్రభుత్వం ఏర్పడితే ఆ మార్కెట్‌కు క్షేమం. లేదంటే విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఇక్కడ నుంచి తరలించుకు వెళతారు. దీనికి తోడు ఈలోపున అమెరికా ఉద్దీపన సొమ్ములో మరో దఫా కోత కూడా పడవచ్చును. ఒకటి మాత్రం నిజం. మన పాలకులు స్వావలంబనతో కూడిన విధానాలకు శ్రీకారం చుట్టకుండా, అమెరికా సేవలో తరించాలని అనుకున్నంత కాలం ఇక్కట్లు తప్పవు. ఇప్పుడు కావలసినది ప్రధాని మార్పు ఒక్కటే కాదు. అంతకుమించి ఆశించవలసింది విధానాలలో మార్పు. దీనిని అంతా గమనించాలి. (వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు) - డి. పాపారావు